మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: మంగళవారం, 30 జులై 2019 (17:10 IST)

11 ఏళ్ల హరిప్రియ ఐక్యూ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కన్నా ఎక్కువ.. ఐక్యూ అంటే ఏమిటి? ఎలా కొలుస్తారు?

హరిప్రియ తమిళ బాలిక. బ్రిటన్‌లో పుట్టి పెరిగింది. అక్కడే నివసిస్తోంది. వయసు 11 సంవత్సరాలు. అయితే.. ఐక్యూలో అత్యధిక రేటింగ్ సాధించి పతాకశీర్షికలకు ఎక్కింది. ఐక్యూలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్ వంటి దిగ్గజ శాస్త్రవేత్తల సరసన నిలిచిన బాలికగా గుర్తింపు పొందింది. చదువు, బహు భాషలు, నృత్యం, సంగీతం, పాటలు, ఆటలు.. అనేక రంగాల్లో అద్భుతంగా రాణిస్తోంది.

 
ప్రపంచ ప్రఖ్యాత మేధో ప్రయోగశాలల్లో ఒకటైన బ్రిటిష్ మెన్సా నిర్వహించిన 'కాటెల్-3బి' పరీక్షకు హాజరైంది. అందులో పొందగలిగే అత్యధిక రేటింగ్ 162. ఆ రేటింగ్‌ను హరిప్రియ సాధించింది. అంటే.. ఐన్‌స్టీన్, హాకింగ్‌లకన్నా కూడా రెండు పాయింట్లు ఎక్కువ సాధించింది. అలాగే.. బ్రిటిష్ కల్చర్ ఫెయిర్ స్కేల్‌లో సైతం.. ఆమె అత్యధిక రేటింగ్ 140 పాయింట్లు సాధించింది.

 
అసలు ఇంతకీ ఐక్యూ అంటే ఏమిటి? దీనిని ఎలా కొలుస్తారు? ఐన్‌స్టీన్ కూడా ఐక్యూ పరీక్షకు హాజరయ్యారా? ఇంటెలిజెన్స్ కోషెంట్.. దీన్నే పొట్టిగా ఐక్యూ అంటారు. ఇది ఎవరైనా ఒక వ్యక్తి తెలివితేటల స్థాయిని చెప్పే ఓ కొలమానం అనొచ్చు. సమస్యలను విశ్లేషించగల, పరిష్కరించగల సామర్థ్యానికి కొలమానం ఇది.

 
ఐక్యూను నిర్థరించేందుకు కొన్ని పరీక్షలను ఉపయోగిస్తారు. మన దేశంలో ఐక్యూ టెస్ట్‌లకు అంత ప్రాముఖ్యం లేకపోయినా పాశ్చాత్య దేశాలలో ఇవి సర్వసాధారణం. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికాలో సాయుధ బలగాల నియామకంలో ఈ టెస్టులను భారీ స్థాయిలో ఉపయోగించారు. ఆఫీసర్ స్థాయి పోస్టులకు అర్హులను ఈ టెస్టుల ద్వారా నిర్ణయించేవారు.

 
అసలు ఐక్యూ ఎలా కొలుస్తారు?
మొదట్లో ఐక్యూ టెస్ట్ సాధారణంగా ఒక మనిషి మానసిక వయసును అదే మనిషి కాలక్రమానుసార వయసుతో విభజించి నిర్ణయించేవారు. అయితే కాలం మారుతున్న కొద్దీ ఐక్యూని గణించే పద్ధతి కూడా మారుతూ వచ్చింది. ప్రస్తుతం రకరకాల ఐక్యూ టెస్ట్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే.. వెక్స్లర్ టెస్టును ఎక్కువగా వాడతారు.

 
అత్యధికంగా వాడుకలో ఉన్న వెక్స్లర్ టెస్ట్ ప్రధానంగా ఒక మనిషి శబ్ద గ్రహణ శక్తి, జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకునే శక్తి, జ్ఞాపకశక్తి, ప్రాసెసింగ్ స్పీడ్‌ను పరిగణనలోకి తీసుకుంటుంది. స్టాన్ఫర్డ్-బినెట్ స్కేల్ అనే మరో ఐక్యూ టెస్ట్ ఉంది. ఈ టెస్ట్ కూడా దాదాపు వెక్స్లర్ టెస్ట్ పరిగణనలోకి తీసుకునే అంశాలనే కొలిచినా.. దృశ్య ప్రాదేశిక ప్రాసెసింగ్ వంటి కొత్త అంశాలను కూడా దీని సాయంతో కొలుస్తారు.

 
గణితంలో సామర్థ్యం, పదజాలంలో ప్రతిభను కొలిచే కొన్ని ప్రశ్నలతో ఈ టెస్టులు నిండి ఉంటాయి. అయితే ఈ ప్రశ్నలను నిర్ణీత కాలంలో పూర్తిచెయ్యాలి. ఐక్యూ టెస్ట్‌లు రకరకాల విధానాల్లో మనిషి వయసుకు అనుగుణంగా ఉండేలా రూపొందిస్తారు. ఇన్ని రకాల ఐక్యూ పరీక్షా విధానాలున్నా.. పరిపూర్ణ ఫలితాలు ఇచ్చే టెస్ట్ అంటూ ఏదీ లేదు.

 
బ్రిటన్‌లోని 'మెన్స' అనే సంస్థ ఐక్యూ టెస్టులు పెట్టి, వాటిలో అత్యధికంగా స్కోర్ చేసిన వారందరినీ ఒక చోటకి చేరుస్తోంది. ఈ సంస్థలో సభ్యత్వం కావాలంటే జనాభాలో ఐక్యూ అత్యధికంగా ఉన్న రెండు శాతం మందిలో మీరూ ఉండాలి.

 
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఐక్యూ 160 అనే విషయంలో నిజమెంత?
ప్రస్తుతం ఐన్‌స్టీన్ పేరు మీద ప్రచారం జరుగుతున్న 160 ఐక్యూ స్కోర్‌లో నిజమెంత అనే విషయం ఎవరికీ తెలీదు. ఐన్‌స్టీన్ ఐక్యూ టెస్ట్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారం లేదు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్ వంటి దిగ్గజాల ఐక్యూ స్కోరును సాధారణంగా అత్యధిక స్కోరుగా పరిగణిస్తారు. సాధారణ ప్రజలకు ఐక్యూ టెస్ట్ మొదటిసారిగా అందుబాటులోకి వచ్చింది బినెట్ టెస్ట్ ద్వారానే. ప్రస్తుతం ఉన్న స్టాన్ఫర్డ్-బినెట్ టెస్ట్ తొలి రూపం అది.

 
1905లో మొదట ప్రచురితమైన బినెట్ టెస్ట్ ప్రధాన రూపకర్త ఫ్రెంచ్ సైకాలజిస్ట్ ఆల్ఫ్రెడ్ బినెట్. అయితే.. ఆ సమయానికే ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ భౌతికశాస్త్రంలో మునుపెన్నడూ ఎరుగని విధంగా విప్లవాత్మక సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కానీ.. ఈ బినెట్ టెస్ట్ ప్రాచుర్యంలోకి రావటానికి చాలా సమయం పట్టింది.

 
నిజంగా ఒక మనిషి తెలివితేటలను మనం కొలవగలమా?
ఐక్యూ టెస్టుల ద్వారా మనుషుల తెలివితేటలు గణించడం అనే పద్ధతి చాలా వివాదాస్పదంగా మారిన తరుణం కూడా ఉంది. ఫ్రెంచ్ సైకాలజిస్ట్ బినెట్ ప్రతిపాదించిన టెస్ట్‌ను అమెరికాకు పరిచయం చేసిన ఘనత హెన్రీ హెర్బర్ట్ గొద్దార్డ్‌ది. 19వ శతాబ్దం మొదటి భాగంలో అమెరికాలో ఊపందుకున్న 'యూజెనిక్స్' ఉద్యమానికి ఉపయోగపడేలా ఈ టెస్టును ఆయన అనువదించారు.

 
'యూజెనిక్స్' ప్రకారం మానవ జాతిని అత్యంత ఫలప్రదం చేయాలంటే మనలోని 'అవాంఛనీయ' జన్యువులను నెమ్మదిగా నివారించుకోవాలి. హిట్లర్ కూడా దీన్నే నమ్మి 60 లక్షల మంది యూదు మతస్థుల మరణానికి కారణమయ్యాడు. ఇలాంటి ఐక్యూ టెస్టులను వాడుకుని.. కొందరిని తెలివితక్కువవారిగా పరిగణించటం సులభమైపోయింది.

 
గొద్దార్డ్ ప్రవేశపెట్టిన ఐక్యూ టెస్టుల ద్వారా వచ్చిన కొత్త చట్టాల వల్ల అమెరికాలో లక్షల మంది సంతానోత్పత్తిని నివారించే ఆపరేషన్ చేయించుకున్నారు.