ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 6 జనవరి 2020 (19:51 IST)

ఇరాన్ అణుబాంబును ఎంత కాలంలో తయారు చేయగలదు?

అణు ఒప్పందం పరిమితులు వేటినీ తాము పాటించేది లేదని ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో, ఇరాన్ అణు బాంబు తయారుచేయాలనుకొంటే, ఎంత కాలంలో చేయగలదు? యురేనియం శుద్ధి చేయడం, శుద్ధి స్థాయి, శుద్ధిచేసిన పదార్థం నిల్వపై, పరిశోధన, అభివృద్ధిపై 2015 నాటి ఈ ఒప్పందం ప్రకారం పెట్టిన పరిమితులకు కట్టుబడి ఉండమని ఇరాన్ ఒక ప్రకటనలో తెలిపింది. రాజధాని టెహ్రాన్‌లో మంత్రి మండలి సమావేశం అనంతరం ఇది వెలువడింది.

 
ఈ నెల 3న ఇరాన్ సైనిక ఉన్నతాధికారి కాసిం సులేమానీని ఇరాక్ రాజధాని బగ్దాద్‌లో అమెరికా డ్రోన్ దాడితో చంపేసిన తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
 
క్రమంగా వెనక్కి తగ్గుతూ వచ్చిన ఇరాన్
ఇరాన్‌పై విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేస్తే అణు కార్యకలాపాలను పరిమితం చేస్తామని, అణు కేంద్రాల్లోకి అంతర్జాతీయ పరిశీలకులను అనుమతిస్తామని నాటి ఒప్పందం కింద ఇరాన్ అంగీకరించింది. ఒప్పందం నుంచి అమెరికా 2018 మేలో వైదొలగింది. అణు కార్యక్రమంపై నిరవధిక ఆంక్షలను విధించే, బాలిస్టిక్ క్షిపణులు అభివృద్ధి చేయకుండా అడ్డుకొనే కొత్త ఒప్పందానికి ఇరాన్ అంగీకరించేలా చేయాలనుకొంటున్నానని అప్పట్లో అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు.

 
ట్రంప్ డిమాండ్లను ఇరాన్ తోసిపుచ్చింది. 2015 ఒప్పందం ప్రకారం అంగీకరించిన కట్టుబాట్లపై క్రమంగా వెనక్కి తగ్గుతూ వచ్చింది. సులేమానీ మరణవార్త రాక ముందు, ఒప్పందంపై ప్రస్తుత వైఖరిని ఇరాన్ ఈ వారంతంలో ప్రకటిస్తుందని భావించారు. ఆయన మృతి నేపథ్యంలో ఇరాన్ కాస్త ముందే ఈ ప్రకటన చేసింది.

 
అణు ఒప్పందంలోని పరిమితులేవీ ఇరాన్ ఇక గౌరవించబోదని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆదివారం వెల్లడించింది. ఎలాంటి పరిమితులూ లేకుండా, తన సాంకేతిక అవసరాలను బట్టి ఇరాన్ యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని ఒక ప్రకటన తెలిపింది. ఒప్పందం నుంచి ఇరాన్ వైదొలగుతున్నట్లు పేర్కొనలేదు. ఐక్యరాజ్యసమితికి చెందిన అణు పర్యవేక్షణ విభాగం 'అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ)'కు ఇరాన్ సహకారం కొనసాగుతుందని ఇది తెలిపింది.

 
ఒప్పందం కింద హామీ ఇచ్చిన ప్రయోజనాలన్నీ ఇరాన్‌కు కల్పిస్తే ఒప్పందంలోని పరిమితులను తిరిగి పాటించేందుకు ఇరాన్ సిద్ధమని ఈ ప్రకటన పేర్కొంది. అమెరికా ఆంక్షల వల్ల తన ఆదాయ వనరైన చమురును అమ్ముకోలేకపోవడాన్ని దృష్టిలో ఉంచుకొని ఇరాన్ ఈ విధానాన్ని అనుసరిస్తోంది.

 
ఒప్పందం కుదరడంలో ఒబామా కీలక పాత్ర
తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత ప్రయోజనాల కోసమేనని ఇరాన్ ఎప్పుడూ చెబుతూ వస్తోంది. ఇరాన్ అణు బాంబును తయారుచేయడానికి యత్నిస్తోందనే అనుమానాలతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, అమెరికా, యూరోపియన్ యూనియన్ 2010లో ఇరాన్‌పై కఠినమైన ఆంక్షలను విధించాయి.

 
అణు కార్యక్రమాన్ని నియంత్రిస్తే ఇరాన్‌కు ఆంక్షల నుంచి ఉపశమనం కల్పించేలా ఒప్పందాన్ని రూపొందించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ, ట్రేడింగ్, బ్యాంకింగ్, చమురు తదితర రంగాలపై ఐక్యరాజ్య సమితి, అమెరికా, యూరోపియన్ యూనియన్ విధించిన ఆంక్షలను ఎత్తేస్తే తమ అణు కార్యకలాపాలను తగ్గించేందుకు అంగీకరిస్తూ ఇరాన్ 2015లో దీనిపై సంతకం చేసింది.

 
ఈ ఒప్పందం కుదరడంలో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కీలక పాత్ర పోషించారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, చైనాలతో ఇరాన్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిని 'జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (జేసీపీవోఏ)'గా వ్యవహరిస్తారు. యురేనియం శుద్ధిని 3.67 శాతానికి ఒప్పందం పరిమితం చేసింది. అప్పటికే నిర్మిస్తున్న భారజల రియాక్టర్‌ డిజైన్లో ఇరాన్ ఈ ఒడంబడికకు అనుగుణంగా మార్పులు చేసింది. ఈ రియాక్టర్లో వినియోగించిన అణు ఇంధనంలో బాంబు తయారీకి అనువైన ప్లుటోనియం ఉంటుంది. అణు కేంద్రాల్లో అంతర్జాతీయ పరిశీలనలకు కూడా ఇరాన్ అంగీకరించింది.

 
2015 జులైకు ముందు ఇరాన్ వద్ద పెద్దమొత్తంలో శుద్ధిచేసిన యురేనియం నిల్వలు, దాదాపు 20 వేల సెంట్రిఫ్యూజ్‌లు ఉన్నాయని, ఇవి ఎనిమిది నుంచి 10 అణు బాంబులు తయారు చేయడానికి సరిపోతాయని అమెరికా అధ్యక్ష కార్యాలయం అప్పట్లో చెప్పింది.

 
సంవత్సరమా, ఆరు నెలలా, అంత కంటే తక్కువా?
ఇరాన్ వేగంగా అణు బాంబు తయారుచేయాలని నిర్ణయించుకుంటే అందుకు కావాల్సిన 90 శాతం శుద్ధిచేసిన యురేనియాన్ని తగిన మొత్తంలో ఉత్పత్తి చేయడానికి రెండు మూడు నెలల సమయం పడుతుందని నాడు అమెరికా నిపుణులు అంచనా వేశారు. యురేనియం శుద్ధి ప్రస్తుత స్థాయిలోనే కొనసాగితే అణు బాంబు తయారీకి దాదాపు ఏడాది పడుతుందనే అంచనాలు ఉన్నాయి. ఉదాహరణకు యురేనియం శుద్ధి స్థాయులను 20 శాతానికి పెంచితే ఆరు నెలల్లో లేదా కొన్ని నెలల్లోనే ఈ పని చేయొచ్చు.

 
విదేశీ బలగాలు వెళ్లిపోవాలంటూ ఇరాక్ ఎంపీల తీర్మానం
ఆదివారం సాయంత్రం బగ్దాద్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం లక్ష్యంగా కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. దౌత్య కార్యాలయం దిశగా నాలుగు రౌండ్ల కాల్పులు జరిగినట్లు విశ్వసనీయమైన ఒక వ్యక్తి బీబీసీకి తెలిపారు. సులేమానీ హత్య నేపథ్యంలో, విదేశీ బలగాలు ఇరాక్ విడిచి పెళ్లిపోవాలంటూ ఇరాక్ ఎంపీలు ఆదివారం తీర్మానం చేశారు.

 
ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) గ్రూప్‌పై పోరాడుతున్న అంతర్జాతీయ సైనిక కూటమిలో భాగంగా ప్రస్తుతం ఐదు వేల మంది అమెరికా సైనికులు ఇరాక్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఎంపీల తీర్మానానికి ముందు ఈ కూటమి ఇరాక్‌లో ఐఎస్‌పై పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. సులేమానీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ దాడులకు దిగితే తాము విరుచుకుపడతామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పదే పదే హెచ్చరిస్తున్నారు. దీనిపై ఆయన ట్విటర్లో స్పందించారు.

 
అంతర్జాతీయ సమాజం స్పందన?
2015 ఒప్పందంపై సంతకాలు చేసిన చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ 2018లో అమెరికా వైదొలగిన తర్వాత కూడా దీనిని కొనసాగించేందుకు ప్రయత్నాలు చేశాయి. ఇరాన్ తాజా వైఖరిపై వివిధ దేశాలు స్పందించాయి. ఒప్పందానికి విరుద్ధమైన చర్యలు చేపట్టవద్దని ఇరాన్‌కు పిలుపునిస్తూ జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మేక్రాన్, బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఆదివారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు, సుస్థిరతను తీసుకొచ్చేందుకు అన్ని పక్షాలతో చర్చలు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

 
సులేమానీతో తమ ప్రయోజనాలకు ముప్పు ఉండేదని, ఆయన మరణం పట్ల తమకు విచారం లేదని బ్రిటన్ ప్రధాని వ్యాఖ్యానించారు. అణు ఒప్పందం గురించి, సులేమానీ హత్య అనంతర సంక్షోభాన్ని ఎలా పరిష్కరించాలనేదాని గురించి చర్చించేందుకు బెల్జియంలోని బ్రస్సెల్స్‌కు రావాలని ఇరాన్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ జావద్ జరీఫ్‌ను యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధాన సారథి జోసెఫ్ బోరెల్ ఆహ్వానించారు.

 
బీబీసీ రక్షణ ప్రతినిధి జొనాథన్ మార్కస్ విశ్లేషణ
అమెరికా వైదొలగినప్పటి నుంచి ఈ ఒప్పందం 'లైఫ్ సపోర్ట్'తో ఉంది. తాజా పరిణామాలతో ఇది అంతిమ దశకు చేరినట్లు కనిపిస్తోంది.
 
ఇది ఇరాన్ అణు కార్యక్రమాన్ని నియంత్రిస్తూ వచ్చింది. అంతకంటే ముఖ్యమైనదేమిటంటే- ఇది యుద్ధాన్ని రాకుండా చేసింది. ఒప్పందం కుదరడానికి ముందు, ఇరాన్ అణు కార్యకలాపాలపై భయాందోళనలు పెరుగతూ ఉండేవి. ఇజ్రాయెల్ ఒంటరిగానో లేదా ఇజ్రాయెల్, అమెరికా కలసి ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు నిర్వహించే అవకాశాలు మెండుగా ఉండేవి.

 
ఒప్పందం నుంచి అమెరికా వైదొలగిన తర్వాత, ఇందులోని కీలకమైన పరిమితుల నుంచి ఇరాన్ దూరం జరిగింది. ఇప్పుడు అన్ని పరిమితులకూ తిలోదకాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఇరాన్ ఏ నిర్ణయం తీసుకొంటుందనేది ప్రధానమైన అంశం. ఉదాహరణకు యురేనియం శుద్ధిని 20 శాతానికి పెంచుతుందా అనేది కీలకమైన ప్రశ్న. అదే జరిగితే అణ్వాయుధం తయారీకి అవసరమైన పదార్థం పొందడానికి పట్టే సమయం గణనీయంగా తగ్గుతుంది. మరింత విస్తృతమైన అంతర్జాతీయ పరిశీలనలకు ఇరాన్ కట్టుబడి ఉంటుందా అనేది ఇంకో ముఖ్యమైన ప్రశ్న.
 
ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించడంపై బలమైన దేశాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. అదే సమయంలో, సులేమానీని చంపేయాలన్న ట్రంప్ నిర్ణయం వీటికి దిగ్భ్రాంతి కలిగించింది. ఈ నిర్ణయమే ఇప్పుడు అమెరికా, ఇరాన్‌లను యుద్ధం ముంగిటకు తీసుకొచ్చింది.