గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 3 డిశెంబరు 2019 (18:39 IST)

హైదరాబాద్ అత్యాచారం: 'పురుషులను నిందించండి - సురక్షితమైన నగరాన్ని కాదు'

హైదరాబాద్ నగరంలో ఒక యువ పశువైద్యురాలిపై అత్యాచారం, హత్య మీద ఆగ్రహం పెల్లుబికింది. ఇది మరోసారి ఒక భారతీయ నగరంలో మహిళల భద్రతపై చర్చ జరిగేలా చేసింది. హైదరాబాద్ నగరం శుక్రవారం ఓ హత్యోదంతంతో మేల్కొంది: ఓ 27 ఏళ్ల మహిళ కాలిన శరీరం నగర శివార్లలోని ఒక ఫ్లైఓవర్ కింద కనిపించింది. ఆమెను దహనం చేయడానికి ముందు సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేశారని పోలీసులు శుక్రవారం చెప్పారు. ఈ నేరాలకు సంబంధించి నలుగురు పురుషులను అరెస్ట్ చేశారు.


ఈ ఘటన ప్రజల్లో ఆగ్రహం, నిరసనకు దారితీసింది. మిస్సింగ్ కేసు నమోదు చేయటంలో జాప్యం చేశారన్న ఆరోపణపై ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ కేసును వేగంగా విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. కానీ.. ఈ కేసు ఒక అనివార్య ప్రశ్నను కూడా లేవనెత్తింది - హైదరాబాద్ ఎంత భద్రం? అనేదే ఆ ప్రశ్న.

 
''భయానికి మేం అలవాటుపడ్డాం''
''నగరంలో ప్రయాణించటం సురక్షితంగానే ఉందని నేనెప్పుడూ భావించేదాన్ని. కానీ ఇలాంటి ఘటనలు పిడుగుపాటులా మారాయి. జాగ్రత్తగా ఉండటానికి, పోలీస్ యాప్‌లు వాడటానికి ఇది ఒక మేల్కొలుపు'' అని 31 ఏళ్ల పద్మజా రావు చెప్పారు. ''హైదరాబాద్‌ వ్యాప్తంగా ప్రయాణించటం చాలా సురక్షితమనే నాకు ఎప్పుడూ అనిపించేది. నేను ఒక కార్పొరేట్ కంపెనీలో వేర్వేరు షిఫ్టుల్లో పనిచేస్తాను. రాత్రి షిఫ్టుల్లోనూ నాకు ఎప్పుడూ రక్షణ లేదనే భావన కలగలేదు'' అంటారు 33 ఏళ్ల ఐటీ ఉద్యోగిని తమోలి దాస్.

 
''కానీ.. శివార్లలో లేదా జనం తక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణించటం సురక్షితం కాదని అనిపిస్తుందని చెప్తా'' అన్నారామె. నగర శివార్లలోని ఒక టోల్ ప్లాజా దగ్గర బాధితురాలిపై - (చట్టపరమైన కారణాల రీత్యా ఆమె పేరు వెల్లడించడం లేదు) దాడి జరిగిందని పోలీసులు చెప్పారు. ఆమె అక్కడే తన స్కూటర్‌ని నిలిపారు.

 
ఎనభై లక్షల మందికి పైగా జనాభాతో రద్దీగా ఉండే హైదరాబాద్ నగరం శివారు ప్రాంతాల్లోనూ విస్తరిస్తోంది. 2000 సంవత్సరం తరువాత సాఫ్ట్‌వేర్ సంస్థల రాకతో హైదరాబాద్ వేగంగా విస్తరించింది, అభివృద్ధి చెందింది. దేశం నలమూలల నుంచీ పనిచేసే యువత ఇక్కడికి వచ్చింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్ వంటి కొన్ని ప్రపంచశ్రేణి సంస్థలకు ఇక్కడ విశాలమైన కార్యాలయాలు ఉన్నాయి. భారతదేశంలో తొలి ఐకియా స్టోర్‌ను 2018లో ఇక్కడే ప్రారంభించారు.

 
హైదరాబాద్‌ను ఓ సురక్షితమైన నగరంగా చూసేవారు. దేశంలో మహిళల మీద నమోదైన నేరాల్లో ఈ నగరం వాటా 5.6 శాతంగా ఉంది. ఇది దేశ రాజధాని దిల్లీ (28.3 శాతం)తో పోలిస్తే చాలా తక్కువ. దక్షిణాదిన ఐటీ కేంద్రం బెంగళూరు (8.7)తో పోల్చినా తక్కువే. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2017 నివేదికలో వెల్లడైన గణాంకాలివి. హైదరాబాద్‌లో నమోదైన అత్యాచారం కేసుల సంఖ్య (59) కూడా దిల్లీ (1,168) సహా పలు ఇతర నగరాలతో పోలిస్తే తక్కువ.

 
కానీ ఈ కేసు ప్రజల దృష్టిని ఈ నగరం వైపు మరల్చింది. దీనికి ఒక కారణం.. నగరంలో పనిచేసే చాలా మంది యువతులు - బాధితురాలు ఒక ఉద్యోగిని కావడంతో ఆమె స్థానంలో ఈ నేరం జరిగిన పరిస్థితుల్లో తమను ఊహించుకుని మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. ఆమె పంక్చర్ అయిన తన బైక్ టైర్‌ను బాగు చేయించుకోవటం కోసం టోల్ ప్లాజ్ దగ్గర నిరీక్షిస్తున్నపుడు ఆమెపై దాడి జరిగింది. ఆమె తన చెల్లికి ఫోన్ చేసి.. రోడ్డు పక్కన ఒక నిర్మానుష్య ప్రాంతంలో నిలుచుని ఉన్నానని, తాను చాలా భయపడుతున్నానని చెప్పింది.

 
కొంతమంది.. 2012లో దిల్లీలో ఒక 23 ఏళ్ల ఫిజియోథెరపీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఉదంతంతో ఈ ఉదంతాన్ని పోల్చారు. నాటి ఉదంతంపై ఉవ్వెత్తున నిరసనలు పెల్లుబుకడంతో పాటు భారతదేశంలో అత్యాచార వ్యతిరేక చట్టాల్లో గణనీయమైన మార్పులకు దారితీశాయి. హైదరాబాద్ బాధితురాలి పేరు ట్విటర్‌లో కొన్ని గంటల పాటు అత్యధికంగా ట్రెండ్ అయింది. ఆగ్రహిస్తూ, న్యాయం కావాలని డిమాండ్ చేస్తూ లక్షలాదిగా ట్వీట్లు వెల్లువెత్తాయి.

 
అయితే.. ఈ ఒక్క కేసు ప్రాతిపదిగా మాత్రమే నగర భద్రతపై నిర్ధారణలకు రావద్దని ఈ నగరానికి చెందిన యువతులు అంటున్నారు. హైదరాబాద్ నగరం దిల్లీ కన్నా సురక్షితమైనది కావచ్చు కానీ.. దాని అర్థం - ఇక్కడ జీవిస్తున్న తమకు వెంటపడటం, వేధించటం వంటివి ఎదురవటం లేదని కాదని వారు చెప్తున్నారు. ఏ నగరమైనా కానీ తాము కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటామని వారు అంటారు.

 
''2017లో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తుంది. మేం కొంతమంది బాలికలం సాయంత్రం పొద్దు పోయాక మా స్కూటర్లు నడుపుతున్నాం. మమ్మల్ని కొంతమంది పురుషులు బైకులపై వచ్చి చుట్టుముట్టారు. వాళ్లు మమ్మల్ని వేధిస్తూ, మా చుట్టూ బైకులు తిప్పుతూ, విన్యాసాలు చేస్తూ మమ్మల్ని భయపెట్టటం మొదలుపెట్టారు'' అని వైద్య వృత్తిలో ఉన్న 29 ఏళ్ల ప్రణీత మద్నా చెప్పారు. అప్పుడు అదృష్టవశాత్తూ తాము ఒక పోలీస్ గస్తీ వాహనాన్ని చూసి సాయం కోసం వారి దగ్గరకు వెళ్లామని ఆమె తెలిపారు.

 
బాధితురాలు తన బైక్ మీద ఇంటికి తిరిగి రావటం కోసం వేచి ఉన్నపుడు ఆమె మీద దాడి జరిగిన నేపథ్యంలో సురక్షితమైన ప్రజా రవాణా సమస్యని ఈ ఉదంతం బయటపెడుతోందని కొందరు మహిళలు బీబీసీ తెలుగుతో అన్నారు. ''ప్రజా రవాణా సురక్షిత మార్గం కాదని నాకు అనిపించింది. బైకులు అనేవి అసలు భద్రంగా అనిపించవు. దీంతో ప్రయాణం కోసం నేను సొంతంగా కారు కొనుక్కున్నాను. అయినా కానీ మన సొంత కారులోనే మనం అసౌకర్యంగా ఉండేలా చేయగలరు మగాళ్లు'' అంటారు 31 ఏళ్ల సంయుక్త.

 
''సమస్య హైదరాబాద్ కాదు. రోడ్డు మీద ఉన్న మహిళలను బహిరంగ ఆస్తిగా భావించే పురుషులే అసలు సమస్య. మేం భయానికి అలవాటు పడిపోయాం. నగరాలను నిందించటానికి బదులు ఆలోచనలను సరిచేద్దాం'' అన్నారామె.