గురువారం, 16 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 10 డిశెంబరు 2024 (17:19 IST)

కుటుంబాలను విడదీయను.. ఫ్యామిలీ మొత్తాన్ని అమెరికా నుంచి పంపించేస్తాను: ట్రంప్

donald trump
తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే 2021 నాటి అమెరికా అల్లర్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న వారికి క్షమాభిక్ష ప్రసాదించే విషయం పరిశీలిస్తానని నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డోనల్డ్ ట్రంప్ చెప్పారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ తొలి మీడియా ఇంటర్వ్యూ, ఎన్‌బీసీలో ప్రసారమైన 'మీట్ ది ప్రెస్‌'‌లో మాట్లాడుతూ.. ''వాళ్లు నరకం అనుభవిస్తున్నారు'' అని అన్నారు. అమెరికాలో పుడితే చాలు, అమెరికన్ పౌరసత్వం వచ్చే విధానానికి స్వస్తి పలుకుతానని ట్రంప్ చెప్పారు. అయితే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే అమెరికాకు తీసుకురావడం వల్ల, ఇప్పుడు సరైన పత్రాలు లేని వలసదారులకు సాయమందించే విషయంలో డెమొక్రాట్లతో కలిసి పనిచేస్తానని ఆయన అన్నారు.
 
శుక్రవారం రికార్డ్ చేసిన ఈ సుదీర్ఘ చర్చలో ఆయన.. జనవరి 20న బాధ్యతలు స్వీకరించిన తర్వాత వలసవాదం, ఇంధనం, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వ్యవహారాలతో పాటు ఇంకా చాలా ఆదేశాలు వెలువడతాయని ట్రంప్ తెలిపారు. జో బైడెన్‌పై న్యాయ విచారణ జరిపించకపోయినప్పటికీ, అల్లర్ల ఘటనలో దర్యాప్తు జరిపిన తన రాజకీయ ప్రత్యర్థులు జైలుకి వెళ్లాల్సి ఉంటుందని, వారిలో కొందరు చట్టసభ సభ్యులు కూడా ఉండొచ్చని ఆయన అన్నారు. 2020 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు పార్లమెంట్ భవనంపై దాడికి దిగిన కేసులో దోషులుగా తేలిన వందలాది మంది తన మద్దతుదారులను శిక్ష నుంచి తప్పిస్తారా? అని ట్రంప్‌ను అడిగినప్పుడు, ''అన్ని కేసులను క్షుణ్ణంగా పరిశీలిస్తామని, కానీ, త్వరగానే నిర్ణయం తీసుకుంటాం' అని ఆయన చెప్పారు.
 
''మొదటి రోజే'' అని ట్రంప్ అన్నారు.
''మీకు కూడా తెలుసు, వాళ్లు కొన్ని సంవత్సరాలుగా జైల్లో ఉన్నారు. వాళ్లు శిక్ష అనుభవిస్తున్న ప్రదేశం చాలా దారుణంగా ఉంటుంది. అసలు దానిని నిషేధించాలి'' అన్నారాయన. ఆదివారం ప్రసారమైన ఈ ఎన్‌బీసీ ఇంటర్వ్యూలో ట్రంప్ మరికొన్ని ప్రకటనలు కూడా చేశారు. నేటోలో కొనసాగడంపై స్పందిస్తూ, ''వాళ్లు చెల్లించాల్సిన బిల్లులు సకాలంలో చెల్లిస్తూ, మనతో నిజాయితీగా వ్యవహరిస్తున్నారని అనిపిస్తే, తప్పకుండా నేటోలో కొనసాగుతాం'' అన్నారు. అబార్షన్ పిల్స్‌పై నిషేధం విధించబోనని ట్రంప్ చెప్పారు. దానికి గ్యారంటీ ఏంటని అడిగినప్పుడు, ''ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నా. అయితే, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు'' అన్నారాయన. తాను వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత, బహుశా యుక్రెయిన్ తక్కువ సాయం ఆశించాల్సి రావొచ్చు అని ట్రంప్ అన్నారు.
 
చిన్నారుల వ్యాక్సీన్లకు, ఆటిజం సమస్యకు ఏదైనా సంబంధముందా అనే కోణంలో అధ్యయనం జరగాల్సి ఉంది. ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా కేబినెట్‌లో హెల్త్ సెక్రటరీగా ఎన్నికైన రాబర్ట్ ఎఫ్ కెనడీకి సూచిస్తానని ఆయన చెప్పారు. సామాజిక భద్రతలో భాగంగా అమెరికన్ పౌరులకు అందిస్తున్న సాయంలో ఎలాంటి కోతలూ ఉండవని, వయోపరిమితిని పెంచే ఆలోచన లేదని మరోసారి హామీ ఇచ్చారు. కాకపోతే, ఈ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామన్న ఆయన, అదెలా అనేది వివరించలేదు. విదేశీ వస్తువులపై మరింత పన్నులు విధిస్తామన్న తన ప్రకటన గురించి అడిగినప్పుడు, ''నేను ఇప్పుడే కచ్చితంగా చెప్పలేను, అలాగే రేపటి గురించి హామీ కూడా ఇవ్వలేను'' అన్నారు.
 
వలసవాదం విషయంపై ట్రంప్ స్పందిస్తూ, ఇతర దేశాలకు చెందిన వ్యక్తులకు అమెరికాలో పిల్లలు పుడితే, పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం వచ్చే విధానాన్ని రద్దు చేసేలా ఉత్తర్వులు తీసుకొస్తామని ఆయన చెప్పారు. అయితే, అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం, అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరూ అమెరికా పౌరుడే. 'దీనిని మార్చక తప్పదు. దానికి స్వస్తి పలకాల్సిందే' అని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో తన వాగ్దానం మేరకు, సరైన ధ్రువీకరణ పత్రాలు లేవి వలసదారులను దేశం నుంచి బహిష్కరిస్తామని, ఆ కుటుంబంలోని వారికి అమెరికన్ పౌరసత్వం ఉన్నా ఎలాంటి మినహాయింపులూ ఉండవని ఆయన స్పష్టం చేశారు.
 
ఎందుకంటే, తాను కుటుంబాలను విడదీయాలని అనుకోవట్లేదని, అలా కుటుంబాలు విడిపోకుండా ఉండాలంటే ఆ కుటుంబం మొత్తాన్ని వెనక్కి పంపించాల్సి ఉంటుందని ట్రంప్ అన్నారు. ఒబామా హయాంలో తెచ్చిన డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అమెరికా వచ్చిన వారు లేదా తెచ్చిన వారు) కార్యక్రమం కింద రక్షణ పొందుతున్న, సరైన పత్రాలు లేని వలసదారులకు ఊరట కల్పించే దిశగా కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని అనుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. అలాంటి వారిని అక్కడ డ్రీమర్స్‌గా పిలుస్తారు. ''ఈ విషయంలో డెమొక్రాట్లతో కలిసి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అనుకుంటున్నా'' అని ట్రంప్ చెప్పారు. అలాంటి వారిలో ఇప్పుడు చాలామంది మంచి ఉద్యోగాల్లో ఉన్నారని, వ్యాపారాలు కూడా చేస్తున్నారని ఆయన అన్నారు.
 
రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం తప్పదంటూ ట్రంప్ పదేపదే చేసిన శపథాలను నెరవేర్చుకుంటారా? లేదా? అనే విషయంలో మిశ్రమ సంకేతాలిచ్చినట్లుగా భావిస్తున్నారు. పదవీ విరమణ చేయనున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన కొడుకు హంటర్ బైడెన్‌కు క్షమాభిక్ష ప్రసాదించారు. అలాగే, పదవి నుంచి దిగిపోయే ముందు, తన రాజకీయ మిత్రుల కోసం మరికొందరికి కూడా క్షమాభిక్ష పెట్టే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. తాను గతంలో శపథం చేసినట్లుగా బైడెన్, ఇంకా ఆయన కుటుంబ సభ్యులపై ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించేందుకు సుముఖంగా లేననే సంకేతాలిచ్చారు.
 
''నేను గతాన్ని తవ్వుదామని అనుకోవడం లేదు'' అని ఆయన అన్నారు. దేశాన్ని అగ్రగామిగా నిలపాలని అనుకుంటున్నానని, ఆ విజయమే ప్రతీకారమని ఆయన అన్నారు. అయితే, తనపై విచారణ జరిపిన డెమొక్రటిక్ సభ్యులు జైలుకి వెళ్లాల్సి ఉంటుందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మాజీ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యురాలు లిజ్ చెనీ ఎదురుదాడికి దిగారు. కమిటీ సభ్యులు జైలుకి వెళ్లాల్సి ఉంటుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ''చట్టబద్ద పాలన, గణతంత్ర రాజ్య పునాదులపై ట్రంప్ చేస్తున్న దాడి''గా ఆమె అభివర్ణించారు. తన శత్రువులను వెంబడించమని ఎఫ్‌బీఐని కూడా ఆదేశించబోనని ఎన్‌బీసీ ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పారు. కానీ, ఆయన ఇలా అన్నారు, ''వాళ్లు వంకరగా ప్రవర్తిస్తే, లేదా ఏదైనా తప్పు చేస్తే, చట్టాన్ని ఉల్లంఘిస్తే బహుశా చేయొచ్చు.'' "మీకు తెలుసా వాళ్లు నన్ను వెంటాడారు, కాకపోతే నేనే తప్పూ చేయలేదు కాబట్టి ఏమీ చేయలేకపోయారు."