మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 21 డిశెంబరు 2021 (20:17 IST)

తెలంగాణలోని ఈ ఊరిలో రోజూ సూర్యోదయం ఆలస్యంగా, సూర్యాస్తమయం వేగంగా అయిపోతుంది

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా 'కొదురుపాక' గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే... ఏడాదిలోని 365 రోజులూ సూర్యోదయం కాస్త ఆలస్యంగా, సూర్యాస్తమయం త్వరగా అయ్యే వింత వాతావరణ పరిస్థితులు ఉండే గ్రామం ఇది. తూర్పున గొల్లగుట్ట ఉంది. పడమరన రంగనాయకుల గుట్ట ఉంది, దక్షిణాన పాముబండ గుట్ట, ఉత్తరంలో నంబులాద్రి స్వామి గుట్టలు ఉన్నాయి. ఈ నాలుగు గుట్టల మధ్య కొదురుపాక గ్రామం ఏర్పడిందని స్థానికుడు రాజా గౌడ్ చెప్పారు.

 
ఈ ఊరికి నలువైపులా ఆవరించి ఉన్న గుట్టలు ఇక్కడి సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలపై ప్రభావం చూపిస్తున్నాయి. చుట్టుపక్కల గ్రామాలతో పోలిస్తే వీరికి పగటి సమయం తక్కువ. సాయంత్రం అనేదే లేకుండా నేరుగా రాత్రి మొదలైపోతోందా అనే అనుభూతి వీరికి కలుగుతుంది. అందుకే ఈ గ్రామాన్ని 'మూడుజాముల కొదురుపాక' అని పిలుస్తారు.

 
''మొదలు పొదలపాక అని ఉన్నదట, కొదురుపాక అని పెట్టారు. మూడు జాముల కొదురుపాక... మూడుజాముల కొదురుపాక అంటే నీడే. చుట్టూ గుట్టలే కదా బిడ్డా. చుట్టూ గుట్టలేనాయో, గుట్ట నీడ రాదా? అగో గందుకొరకు మూడు జాముల కొదురుపాక అని పెట్టిండ్రు.'' అని కొండ లచ్చవ్వ వివరించారు.

 
ఈ ప్రత్యేక భౌగోళిక పరిస్థితుల ప్రభావం ఇక్కడి ప్రజల నిత్యజీవితంపై కూడా పడుతోంది. జనం తమ పనులు ముగించుకుని త్వరగా ఇంటికి చేరుకుంటారు. కాంతి సహజ లక్షణాలైన పరావర్తనం, వక్రీభవనాలే కొదురుపాకలో ప్రత్యేక వాతావరణ పరిస్థితులకు కారణమని భౌతికశాస్త్ర నిపుణులు అంటున్నారు. ఈ ప్రత్యేక పరిస్థితుల వల్ల కొదురుపాక గ్రామస్థుల్లో డి- విటమిన్ లోపం సమస్య తలెత్తవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

 
''లక్షణాలు లేకపోయినా వారిలో వంద మందికి పరీక్షలు నిర్వహిస్తే చాలా మందికి డీ-3 తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే, లక్షణాలు లేవు కాబట్టి వారెవరూ వైద్య సలహా కోసం రారు. సూర్యకిరణాల వల్ల డి- విటమిన్ రావట్లేదు కాబట్టి.. పాలు, పాలపదార్థాలు, బాయిల్డ్ ఎగ్ లాంటివి తీసుకుంటూ దానితో పాటు బయటి నుంచి విటమిన్-డీ మాత్రలు వేసుకుంటే లోపం కవర్ చేసుకోవచ్చు.'' అని కరీంనగర్ కరీంనగర్ పట్టణానికి చెందిన‌ జనరల్ ఫిజీషియన్‌ డాక్టర్‌ రఘురామన్ చెప్పారు.