శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : బుధవారం, 1 జులై 2020 (18:18 IST)

భారత్ - నేపాల్ వివాదం: చైనా వల్లే ఓలీ భారత్‌తో ఘర్షణ పడుతున్నారా?

భారత్‌-నేపాల్‌ల మధ్య సంబంధ బాంధవ్యాలు మొదటి నుంచి సవ్యంగానే ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో రెండుదేశాల మధ్య పరిస్థితులు మారిపోయి. తనను పదవి నుంచి దించడానికి భారత్‌, నేపాల్‌లలో కుట్రలు జరుగుతున్నాయని నేపాల్‌ ప్రధాని కె.పి.శర్మ ఓలీ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. జూన్‌ 28న జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా ఓలీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు నేపాల్‌ పత్రిక నేపాల్‌ పత్రిక కాఠ్‌మాండూ పోస్ట్‌ ఓ కథనం ప్రచురించింది.

 
దిల్లీ నుంచి వస్తున్న మీడియా రిపోర్టులు, కాఠ్‌మాండూలోని భారత రాయబార కార్యాలయంతోపాటు వివిధ హోటళ్లలో జరుగుతున్న సమావేశాలనుబట్టి కొందరు తనను పదవి నుంచి తొలగించడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చని, కానీ అవి విజయవంతం కావని ఓలీ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు భారత్‌కు ఎంతో స్నేహశీలిగా పేరున్న ఓలీ ఇప్పుడు భారత్‌పై నేరుగా ఆరోపణలు గుప్పించారు. మరి ఆయనకు పొరుగుదేశంపై ఆగ్రహం పెరగడానికి అసలు కారణం ఏంటి?

 
నేపాల్ కొత్త రాజ్యాంగంతోనే సమస్య మొదలైందా ?
2015లో నేపాల్ కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రధాని సుశీల్ కొయిరాలా రాజీనామా చేయాల్సి వచ్చింది. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన కె.పి.శర్మ ఓలీ కొత్త ప్రధాని అయ్యారు. ఇతర పార్టీల నుంచి కూడా ఆయనకు మద్దతు లభించింది. అయితే జూలై 2016లో ఇతర పార్టీలు మద్దతు ఉపసంహరించుకోవడంతో ఓలీ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఓలీ దీనికి బాధ్యత భారత్‌దేనని ఆరోపించారు.

 
ఓలీ ఆరోపణలకు కారణమేంటి ? ఎందుకంటే నేపాల్‌ కొత్త రాజ్యాంగంపై భారత్‌ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మాధేషి, తారు తెగల డిమాండ్‌లను ఇందులో చేర్చలేదని భారత్ తెలిపింది. ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాధేషి, ఇతర మైనారిటీలు నేపాల్ సరిహద్దును మూసేసినప్పుడు ఓలీ ప్రభుత్వం దీనికి భారతదేశానిదే బాధ్యతని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను భారత్ తిరస్కరించింది.

 
మాధేశీల బంద్‌తో నేపాల్‌కు పెట్రోలు, మందులు, ఇతర సామాగ్రి సరఫరా నిలిచిపోయింది. 135 రోజులపాటు ఆర్ధిక దిగ్బంధనం సాగింది. దీంతో భారత్‌ నేపాల్‌ల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. నేపాల్‌లో భారత వ్యతిరేక భావన పుట్టింది. అప్పటికే నేపాల్‌ అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది.

 
ఈ పరిస్థితుల్లో ఓలీ తన పదవిని వదులుకోవలసి వచ్చింది. కానీ 2017లో ఆయన మళ్ళీ ప్రధాని అయ్యారు. భారత వ్యతిరేక సెంటిమెంట్ కారణంగానే ఆయన ఆ ఎన్నికల్లో గెలిచారని చెబుతారు. భారత్‌-నేపాల్ మధ్య 1950లో జరిగిన ఒప్పందంపై ఓలీకి అభ్యంతరాలున్నాయి. ఈ ఒప్పందం నేపాల్‌కు అనుకూలంగా లేదని ఆయన వాదిస్తారు. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా నేపాల్ ఎన్నికల ప్రచారంలో ఓలీ అనేకసార్లు మాట్లాడారు.

 
భారతదేశంపై ఎందుకంత ఆగ్రహం?
ఈ విషయం ఎన్నికలతో ఆగిపోలేదు. జమ్మూకాశ్మీర్‌, లద్దాఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ భారతదేశం విడుదల చేసిన మ్యాప్‌పై నేపాల్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది.ఈ మ్యాప్‌లో కాలాపానీ, లిపులేఖ్‌ ప్రాంతాలను భారత్‌ తన ప్రాంతాలుగా చూపించిందని, ఇవి తమ దేశంలో భాగమని నేపాల్‌ వాదించింది.

 
ఈ సంవత్సరం ఒక రహదారి విషయంలో రెండు దేశాల మధ్య వివాదం మొదలైంది. ఉత్తరాఖండ్ నుండి లిపులేఖ్ పాస్ వరకు ఈ రహదారిని భారత్ నిర్మించింది. లిపులేఖ్ పాస్ తన భూభాగమని నేపాల్‌ వాదిస్తోంది. నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం ముందు నిరసనలు కూడా జరిగాయి.

 
ఓలీపై సొంత పార్టీలో కూడా విమర్శలు మొదలయ్యాయి. నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం ఆయన తీరును తప్పుబట్టింది. ఓలీ రాజీనామా డిమాండ్ కూడా ఊపందుకుంది. ఆర్థికంగా కూడా దేశాన్ని సరైన మార్గంలో నడిపించలేకపోయారని ఓలీపై విమర్శలున్నాయి. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ఆయన విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 
రాజకీయంగా తనకున్న ఇబ్బందులను జాతీయవాదంతో ఎదుర్కోడానికి ఓలీ ప్రయత్నిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆయన మంత్రివర్గం నేపాల్‌లో కొత్త రాజకీయపటాన్ని గత నెలలో విడుదల చేసింది. ఇది లింపియాధురా, కాలాపానీ, లిపూలేఖ్‌లను నేపాల్‌లో భాగంగా చూపించింది. ఇలా చేయడం ద్వారా ఆయన తన ప్రత్యర్థులైన పుష్పకమల్ ప్రచండ, మాధవ్‌ కుమార్‌లో తనతో కలసిరాక తప్పని స్థితి కల్పించారు.

 
భారతదేశం నుంచి అక్రమంగా వస్తున్న వారివల్లే నేపాల్‌లో వైరస్‌ వ్యాప్తి చెందుతోందని, కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కూడా వీరికి సహకరిస్తున్నారని ఆయన ఓ ప్రకటన చేశారు. 'చైనా, ఇటలీలకన్నా భారత వైరస్ ప్రమాదకరం' అని ఆయన అన్నారు.

 
ఓలీ చైనాకు దగ్గరవుతున్నారా ?
నేపాల్‌ను చైనాకు చేరువ చేసేందుకు ఓలీ ఆసక్తి కనబరుస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి తోడు నేపాల్‌లో చైనా ఉనికి కూడా పెరిగింది. తన మొదటి విడత పదవిలో ఉన్నప్పుడు ఓలీ చైనా వెళ్లి 'ట్రాన్సిట్ ట్రేడ్' ఒప్పందంపై సంతకం చేశారు.

 
చైనా తన రోడ్‌ నెట్‌వర్క్‌ను టిబెట్‌ వరకు విస్తరించాలని, భారత్‌పై ఆధారపడకుండా దాన్ని నేపాల్‌కు అనుసంధానించాలని ఓలీ కోరుకుంటున్నారు. ఆర్థిక దిగ్బంధనం తరువాత, నేపాల్ భారతదేశంపై ఆధారపడటాన్ని తగ్గించింది. ఆ సమయంలో ఓలీ ప్రభుత్వం చైనా సహాయం తీసుకుంది.

 
చైనా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 'వన్ బెల్ట్ వన్ రోడ్'ను భారత్ వ్యతిరేకిస్తోంది. ఓలీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంటోంది. చైనాతో సంబంధాలను మరింత పెంచుకునే క్రమంలో భారతదేశపు ఆందోళనలను ఓలీ పట్టిచుకోకపోవచ్చని అంటున్నారు.

 
నేపాల్‌ ప్రజలు తాము స్వేచ్ఛగా ఉన్నందుకు గర్విస్తున్నారని, వలస రాజ్యంగా ఉండదలచుకోరని నిపుణులు అంటున్నారు. అందువల్ల నేపాల్ సార్వభౌమత్వాన్ని ఎవరైనా బలహీనపరిచినప్పుడు అక్కడి ప్రజలు ఆగ్రహం ప్రకటిస్తారు. 2006 సంవత్సరం తరువాత నేపాల్ అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి భారత్‌ ప్రయత్నిస్తున్నట్లు ఒక అభిప్రాయం ఉంది. అందుకే నేపాల్ సార్వభౌమదేశమని, అది ఏ దేశ నియంత్రణలోనూ ఉండదని ఓలీ తేల్చి చెప్పదలుచుకున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.