మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 28 సెప్టెంబరు 2020 (13:33 IST)

ఐపీఎల్ 2020: రాజస్థాన్ రాయల్స్ రికార్డ్ చేజింగ్ విక్టరీ, సిక్సర్లతో చెలరేగిన రాహుల్

రాహుల్ తేవతియా కలకలం సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాహుల్ బ్యాటింగ్ చూసి తీరాల్సిందే. 18వ ఓవర్లో రాహుల్ బ్యాట్ ధాటికి మ్యాచ్ స్వరూపమే మారిపోయింది.

 
కింగ్స్ లెవెన్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తుపాన్ వేగంతో చేసిన సెంచరీ, నికొలస్ పూరన్ అద్భుత ఫీల్డింగ్, పంజాబ్ బౌలర్ షెల్డన్ కాట్రెల్‌ మెరుపులను మించిపోయి రాహుల్ మొత్తం క్రికెట్ అభిమానులను తన వైపునకు తిప్పుకున్నాడు. ప్రత్యర్థి జట్టు ఆశల మీద ఆ ఒక్క ఓవర్లో పూర్తిగా నీళ్లు చల్లాడు. క్రికెట్లో గెలుపు ఓటములు ఎప్పుడు ఎలా తారుమారవుతాయో చెప్పడం కష్టం అనడానికి నిన్నటి షార్జా మ్యాచ్ మరో ఉదాహరణ.

 
అప్పటిదాకా నెమ్మదిగా ఆడుతున్న రాహుల్ తేవతియా 17 బంతుల్లో 23 పరుగులు మాత్రమే చేశాడు. మూడు ఓవర్లలో 51 పరుగులు చేయాల్సిన రాజస్థాన్ రాయల్స్ ఓటమి దాదాపు ఖరారైనట్లే కనిపించింది. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 18వ ఓవర్‌ వేయడానికి కాట్రెల్‌ను రంగంలోకి దింపాడు. ఆ ఓవర్‌ను తేవతియా, కాట్రెల్‌కు తన జీవితంలో మరిచిపోలేని ఓవర్‌గా మార్చేశాడు.

 
మొదటి బంతికి సిక్సర్. ఆ తరువాత రెండు, మూడు బంతులకు కూడా వరసగా సిక్సర్లు. నాలుగో బంతి టాస్ బాల్. దాన్ని కూడా తేవతియా మైదానం వెలుపలికి నేరుగా కొట్టాడు. అయిదో బంతికీ సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను పూర్తిగా పంజాబ్ నుంచి లాక్కున్నాడు. ఆ తరువాత ఓవర్లో మహమ్మది షమీ బౌలింగులో మరో సిక్సర్ కొట్టి ఐపీఎల్‌లో తన తొలి అర్థ సెంచరీని నమోదు చేశాడు. రాహుల్ ఆ తరువాత బంతికి ఔట్ అయినప్పటికీ 31 బంతుల్లో 53 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ విజయాన్ని పక్కా చేశాడు.

 
కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు నిర్దేశించిన 224 పరుగులు భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక పరుగుల చేజింగ్ విజయం.

 
ఈ మ్యాచ్ తరువాత రాహుల్ మీద ప్రశంసల వర్షం కురిసింది. క్రికెట్ లో చివరి క్షణం వరకూ ఆశ కోల్పోకూడదని ఈ మ్యాచ్ మరోసారి గుర్తు చేసిందని మాజీ క్రికెటర్, కామెంటేటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ట్వీట్ చేశారు.
 
మొదట్లో సరిగా ఆడలేకపోయిన తేవతియా కాసేపట్లోనే మ్యాచ్ తీరునే మార్చేశాడు. పిచ్ మీద అద్భుత ధైర్య సాహసాలు ప్రదర్శించాడు అని ప్రశంసించాడు.