శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 23 సెప్టెంబరు 2020 (14:20 IST)

ఐపీఎల్ : సిక్సర్ల యుద్ధంలో ఓడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌-రాజస్థాన్‌ రాయల్స్‌ ఘన విజయం

షార్జాలో మంగళవారం రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్ మధ్య మ్యాచ్‌ సిక్సర్ల యుద్దంలా కనిపించింది. చివరకు ఈ యుద్ధంలో రాజస్థాన్‌ రాయల్స్ గెలిచింది. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి సంజు శాంసన్‌, స్టీవ్‌స్మిత్‌, జోఫ్రా ఆర్చర్‌ త్రయం 17 సిక్సర్లు కొట్టింది. దీనికి సమాధానంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ నుంచి ఫాఫ్‌ డుప్లెసిస్‌, షేన్‌ వాట్సన్‌, సామ్‌ కరన్‌, మహేంద్ర సింగ్‌ ధోనిలు 16 సిక్సర్లు కొట్టారు. ఈ మ్యాచ్‌లో మొత్తం 33 సిక్సర్లు నమోదయ్యాయి.
 
చివరి ఓవర్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 38 పరుగులు చేయాల్సి ఉంది. కెప్టెన్‌ ధోనీ మూడు సిక్సర్లు కొట్టాడు. కానీ అది సరిపోలేదు. ఓటమి తప్పలేదు. 217 పరుగుల విజయ లక్ష్యానికి చెన్నై జట్టు 17 పరుగుల దూరంలో ఆగిపోయింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మురళీ విజయ్, షేన్‌ వాట్సన్‌లు మంచి ఓపెనింగ్‌ను ఇచ్చారు. తొలి వికెట్‌కు వీరిద్దరు 56 పరుగులు జోడించారు. వాట్సన్‌ 4 సిక్సర్లు కొట్టాడు. 33 పరుగులు చేసి, రాహుల్‌ టియోటియా బంతికి బౌల్డ్ అయ్యాడు.
 
21 బంతుల్లో 21 పరుగులు చేసిన మురళీ విజయ్‌ కూడా తరువాతి ఓవర్లో అవుటయ్యాడు. సామ్‌ కరన్‌ ఆరు బంతుల్లో 17 పరుగులు చేశాడు. రాహుల్‌ అతన్ని స్టంపవుట్‌ చేయగా, అంబటి రాయుడు స్థానంలో వచ్చిన రుతురాజ్‌ గైక్వాడ్‌ ఖాతా తెరవలేక పోయాడు. కేదార్‌ జాదవ్ 16 బంతుల్లో 22 పరుగులు చేసిన క్రీజులో నిలిచాడు.
 
37 బంతుల్లో 72 పరుగులు చేసిన డుప్లెసిస్‌ ఏడు సిక్సర్లు సాధించాడు. అతను జట్టును విజయం వైపు తీసుకెళుతున్నట్లు కనిపించాడు. కానీ సాధ్యం కాలేదు. కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనితో కలిసి ఆరో వికెట్‌కు 65 పరుగులు జోడించాడు. చివరి ఓవర్లో ధోనీ కూడా జట్టును గెలిపించేందుకు గట్టిగా ప్రయత్నించినా కుదరలేదు. ధోనీ 17 బంతుల్లో 29 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు.
 
శాంసన్‌ తుపాను
షార్జాకు వస్తే తుపానులు గుర్తొస్తాయి. మంగళవారం కూడా అదే జరిగింది. షార్జా మైదానంలో సిక్సర్ల తుపాను కురిసింది. దీన్ని సృష్టించినవాడు వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాట్స్‌మన్‌ సంజు శాంసన్‌. 32 బంతులు ఆడిన శాంసన్‌ 9 సిక్సర్లు, ఒక ఫోర్‌ సాయంతో 74 పరుగులు చేశాడు.
 
టాస్ ఓడిన రాజస్థాన్‌ రాయల్స్‌ ముందు బ్యాటింగ్ చేసింది. కానీ ఆ టీమ్‌కు మంచి ఓపెనింగ్‌ దొరకలేదు. తొలి మ్యాచ్ ఆడుతున్న యశస్వి జైస్వాల్ కేవలం ఆరు పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే అతను అవుట్‌ కావడమే చెన్నై సూపర్‌ కింగ్స్‌కు శాపంగా మారింది.
 
శాంసన్‌ రావడం రావడమే తుపానులా వచ్చాడు. తన బ్యాటింగ్‌ సత్తా ఏంటో చూపించాడు. ప్రపంచంలో బెస్ట్‌ బ్యాట్స్‌ మన్‌లలో ఒకడైన కెప్టెన్‌ స్మిత్‌ అండగా ఉండటంతో ఇంకా శాంసన్‌ చెలరేగిపోయాడు. తన కెప్టెన్‌కన్నా దూకుడుగా ఆడాడు.
 
విసిరిన ప్రతిబాల్‌ను కసిగా కొట్టిన శాంసన్‌ కేవలం 19 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. ఎన్గిడి 12వ ఓవర్‌లో శాంసన్‌ను అవుట్‌ చేసే సమయానికి రాజస్థాన్‌ రాయల్స్‌ స్కోరు 132 పరుగులు. ఇందులో 121 పరుగులును స్మిత్‌, శాంసన్‌లే సాధించారు.
 
ఆదుకున్న స్మిత్-ఆర్చర్
శాంసన్‌ చెలరేగి ఆడటంతో దూసుకుపోయిన రాజస్థాన్‌ రాయల్స్‌ స్కోరు, అతను అవుటయ్యాక మందగించింది. అయితే కెప్టెన్‌ స్మిత్‌ ఒక పక్కన స్థిరంగా ఆడుతుండగా, చెన్నై బౌలర్లు ఒక్కొక్క వికెట్ తీస్తూ వెళ్లారు. స్మిత్ 47బంతుల్లో 69 పరుగులు చేశాడు. ఇందులో 4ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి.
 
జట్టు స్కోరు 178 పరుగుల వద్ద స్మిత్‌ అవుటయ్యాక ఆ జట్టు 200 పరుగులు చేయడం కూడా అనుమానమే అనిపించింది. అయితే ఆ తర్వాత వచ్చిన ఆర్చర్‌ జట్టును ఆదుకున్నాడు. చివరి ఓవర్‌లో నాలుగు సిక్సులు కొట్టిన ఆర్చర్‌ జట్టు స్కోరును 216కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. 8 బంతుల్లో 27 పరుగులు చేసిన ఆర్చర్‌ నాటౌట్‌గా మిగిలాడు.
 
రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మెన్లు 9 ఫోర్లు, 17 సిక్సర్లతోనే 138 పరుగులు సాధించారు. రాజస్థాన్‌ రాయల్స్‌ దూకుడు ముందు చెన్నై వెలవెలబోయింది. ఆ జట్టు బౌలర్లలో నాలుగు ఓవర్లు వేసిన ఇంగిడి 56 పరుగులు, పీయూష్‌ చావ్లా 55 పరుగులు ప్రత్యర్ధి జట్టుకు సమర్పించుకున్నారు.