శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (17:44 IST)

పీరియడ్స్ ఆపే మాత్రలు వేసుకోవడం మంచిదా? కాదా?

"డాక్టర్ గారూ మా అమ్మాయి పెళ్లి వచ్చే వారం, ఏదయినా ఇంజక్షన్ చేసి రేపటి కల్లా పీరియడ్స్ వచ్చేట్టు చూడండీ, మీకు పుణ్యం వుంటుంది.పెళ్లి టైముకి ఆ కాస్తా అడ్డం పడకుండా చూడండీ ప్లీజ్" అని అడుగుతోంది విమల.
 
"చూడమ్మా విమలా! పీరియడ్స్‌ని ఆపడానికయినా, ముందుగా రావడానికయినా వాడే మాత్రలు ఒకటే. అవి హార్మోన్ మాత్రలు. అవి వేసుకున్నంత కాలం నెలసరి రాదు, ఆపిన రెండు నుంచి వారం రోజుల లోపు ఏ రోజైనా నెలసరి రావచ్చు, నీ కెప్పుడు కావాలంటే అప్పుడు నెలసరి తప్పించడం కుదరదు, కావాలంటే నీకే తేదీలో వస్తే అడ్డమో ఆ తేదీకి మూడురోజుల ముందు నుంచి హార్మోన్ మాత్రలు వాడటం మొదలు పెట్టి, ఆ తేదీ దాటి పోయేవరకూ మాత్రలు వాడటమొక్కటే మార్గం. నెలసరి ఆపడానికి గానీ, రావడానికి గానీ ఇంజక్షన్లు లేవు" అన్నారు డాక్టర్.
 
"అదేంటండీ, మా పక్కింటావిడ తనకు తెలిసిన ఆర్‌ఎంపీ డాక్టర్ దగ్గరకెళితే ఒక ఇంజక్షన్ చేసి, మాత్రలు ఇచ్చి నెలసరి నాలుగో రోజు కల్లా వచ్చేట్టు చేశాడని చెప్పిందే!" అంది విమల.
 
"సారీ అమ్మా, అలాంటిది సాధ్యం కాదు, నువ్వు చెప్పిన దాంట్లోనే మాత్రలిచ్చారన్నావు చూశావా, అవి మూడు రోజులు వాడి ఆపగానే నాలుగో రోజున నెలసరి వచ్చి వుండవచ్చు" అన్నారు డాక్టర్.
 
ఇంకో చోట...
 
"డాక్టర్ గారు! నేను, మావారు, పిల్లలు దక్షిణ దేశ యాత్ర చేయబోతున్నాం, ఒక నెల నాకు బహిష్ఠు రాకుండా ఏవైనా మందులు చెప్పండి. మీ మేలు మర్చిపోలేను" అంది అమల.
 
"అయ్యో మూడు, నాలుగు వారాలు ఆపడానికి మందులు వాడకూడదు. మొత్తం మీద పది, పధ్నాలుగు రోజులకి మించి వాడకూడదు. అదీగాక నీకు 35 ఏళ్లు దాటాయి. పైగా బీపీ, షుగరూ రెండూ వున్నాయి కదా. నువ్వీ మందులు అస్సలు వాడకూడదమ్మా" అని చెప్పింది డాక్టర్ కమల.
 
"అయ్యో అదేంటి డాక్టర్ గారూ, దేవుడి దగ్గరకు వెళుతున్నాం కదా, ఇబ్బందిలో ఉంటే ఎలా వెళ్లేది? ఏదో ఒకటి చేద్దురూ?" కంగారుగా అడిగింది అమల.
 
"సారీ అమ్మా, మూర్ఖంగా మాత్రలు వాడితే రక్తంలో గడ్డలు ఏర్పడి ప్రాణానికే ప్రమాదం రావచ్చు, దయచేసి అర్థం చేసుకోండి. రుతుచక్రాన్ని మీ చేతుల్లోకి తీసుకుని ఎలా అంటే అలా, ఎప్పుడు పడితే అప్పుడు మందులు వాడి డిస్టర్బ్ చేస్తే, గర్భసంచిలో మార్పులు రావడమే కాదు, హార్మోన్ల సమతౌల్యం దెబ్బతిని బహిష్ఠులు నెలవారీ రాకుండా ఎప్పుడుపడితే అప్పుడు ఇర్రెగ్యులర్‌గా వచ్చి చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది" అని చెప్పారు డాక్టర్.
 
మరో చోట...
 
కొత్తగా పెళ్లయిన కరుణ, కార్తీక్‌ల కథ వేరే. వాళ్లిద్దరూ ఇప్పుడే పిల్లల్ని కనొద్దనుకున్నారు. షాపులో అడిగి ఏమైనా మాత్రలు తెచ్చి వేసుకుందామనుకుంది కరుణ. అలా కాదు, డాక్టర్‌ను అడిగి, తమకు ఎలాంటి గర్భనిరోధక సాధనం మంచిదో తెలుసుకుని అలా చేద్దామన్నాడు కార్తీక్. ఇద్దరూ కలిసి ఫామిలీ డాక్టర్ని కలిసి వాళ్ల సమస్య వివరించారు. ఒక అయిదేళ్ల వరకూ పిల్లలు వద్దనుకుంటున్నామని డాక్టర్‌తో చెప్పారు.
 
"కొత్తగా పెళ్లయిన వారికి సూటయ్యేవి "ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్సే. కానీ అవి ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలకి మించి వాడకూడదు" అని చెప్పింది డాక్టర్. అది విని "అవును, నిజమే డాక్టర్. మా బంధువుల్లో ఒకామె తెలియక ఆపరేషన్ అంటే భయమని ఈ పిల్స్ వాడటం వలన, రక్తం గడ్డలు కట్టి పక్షవాతానికి గురైంది" అన్నాడు కార్తీక్.
 
ఎన్ని రకాలుగా పని చేస్తాయి?
ఎవరు వాడాలి? ఎవరు వాడకూడదు?
దుష్ఫలితాలు ఏమైనా ఉంటాయా?
ఇవన్నీ ఒక్కసారి తెలుసుకుందాం.
 
ఈ హార్మోన్ మాత్రలన్నీ స్త్రీల కోసం ఉద్దేశించినవే. వీటిలో కూడా రకాలుంటాయి. ప్రొజెస్టిరాన్ మాత్రలు, ఈస్ట్రోజన్+ప్రొజెస్టిరాన్ మాత్రలు అంటే కంబైన్డ్ ఓసీ పిల్స్. వీటిలో ప్రొజెస్టిరాన్ పిల్స్‌ని ప్రధానంగా బహిష్ఠు కొంతకాలం ఆపడానికి, "మినీ పిల్" పేరుతో గర్భ నిరోధానికి కూడా వాడతారు. రెండూ కలిసిన కంబైన్డ్ పిల్‌ని ప్రధానంగా గర్భ నిరోధానికి వాడతారు. ఒకటి బహిష్ఠు వలన ఇబ్బంది. రెండోది అవాంఛిత గర్భం. ఈ రెంటినీ నిరోధించగలిగితే వారు వారి వారి రంగాల్లో సమర్థంగా పనిచేయగలుగుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే హార్మోన్ పిల్స్ తయారు చేశారు.
 
హార్మోన్ పిల్స్‌ని ఎప్పుడు వాడతారు?
బహిష్ఠుని కొంతకాలం రాకుండా ఆపడానికి 
గర్భ నిరోధానికి
నెలసరి సక్రమంగా రానప్పుడు, రుతుచక్రం సరిగా వచ్చేట్టు చెయ్యడానికి
పీరియడ్స్‌లో అధికరక్త స్రావాన్ని అరికట్టడానికి
పాలీసిస్టిక్ ఓవరీ డిసీజ్‌లో
ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్‌లో
ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధి చికిత్సకు
తీవ్రమైన మొటిమలు నివారించడానికి
రక్తహీనతను నివారించడానికి ఓ ఉపకరణంగా
గర్భసంచీకి, అండాశయాలకి, చుట్టుపక్కల కణజాలాలకి సోకిన ఇన్ఫెక్షన్ నివారణలో భాగం గానూ ఈ హార్మోన్ మాత్రలను, మరీ ముఖ్యంగా కంబైన్డ్ ఓసీ పిల్స్‌ని వాడతారు.
 
బహిష్ఠుని ఆపడం - ముందొచ్చేలా చేయడం
దీనికి వాడే ప్రొజెస్టిరాన్ ఉన్న పిల్‌ 5 మి.గ్రా.ల డోసులో రోజుకి మూడుసార్లు, పీరియడ్ రావడానికి మూడురోజుల ముందునుంచి ప్రారంభించి పది రోజుల పాటు వాడవచ్చు. అంతకు మించి వాడకూడదు. మాత్రలు ఆపిన మర్నాటి నుంచి పది రోజుల లోపు పీరియడ్ వస్తుంది. పీరియడ్ ముందొచ్చేట్టు చేయమని చాలా మంది అడుగుతూ ఉంటారు. దేనికైనా వాడేవి అవే మాత్రలు. ఎప్పుడాపితే అప్పుడు ఒక వారం, పది రోజుల్లో ఎప్పుడైనా రావచ్చు. కచ్చితంగా చెప్పలేం కాబట్టి అడ్డం అనుకున్న రోజుకి మూడురోజులు ముందు నుంచి మాత్రలు వాడి పీరియడ్స్ వాయిదా వేసుకోవడమే సరైన పధ్ధతి.
 
ఇంకొంత మంది రోజుకొక టాబ్లెట్ చాలదా, ఇదివరకు అలా వాడాం అంటుంటారు. ఇది కూడా సరికాదు. రోజుకు రెండు,లేక మూడు మాత్రలు డాక్టర్ సలహాపై వాడటమే కరెక్ట్. ఎందుకంటే లివర్ సమస్యలు, గుండె సమస్యలు, బీపీ, షుగర్, కిడ్నీ వ్యాధులున్నవారు, రక్తం గడ్డకట్టే జబ్బులున్నవారు ఈ మాత్రలు వాడకూడదు. పాలిచ్చే తల్లులు వాడితే పాలు తగ్గిపోతాయి.
 
గర్భ నిరోధక మాత్రలు - కంబైన్డ్ ఓసీ పిల్స్
వీటినే సింపుల్‌గా "పిల్" అని వ్యవహరిస్తారు. 1960ల నుంచీ వీటిని గర్భం రాకుండా నివారించడానికి నోటిమాత్రలుగా ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లు పైబడి వాడుతున్నారంటే వీటి అవసరం ఎంతుందో గమనించవచ్చు. 15-44 సంవత్సరాల మధ్య వయసు వారికి వీటి అవసరం ఎక్కువ. అన్ని దేశాలలోనూ వీటి వినియోగం ఎక్కువే అయినా ఆశ్చర్యకరంగా జపాన్‌లో కేవలం 3% జనాభా మాత్రమే వీటిని వాడుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి అత్యవసర మందుల జాబితాలో ఈ ఓసీ పిల్స్ చోటు చేసుకున్నాయంటే వాటి అవసరం ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. వీటి వాడకం విద్యార్థినులు, ఉద్యోగినుల జీవితంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చింది. వారు మరింత సమర్థంగా వారి వారి రంగాలలో కృషిచేయడానికి తోడ్పడింది.
 
ఇవి ఎలా పని చేస్తాయి?
కంబైన్డ్ పిల్ ప్రస్తుతం అందుబాటులో వున్న గర్భనిరోధక సాధనాలన్నింటిలో అత్యంత సమర్ధమైనది.
 
అయితే, అసలు రుతుక్రమం ఎలా వస్తుంది? మహిళ మెదడులోని హైపోథాలమస్ నుంచి, పిట్యూటరీ గ్రంథుల నుంచి వెలువడే హార్మోన్లు అండాశయం మీద ప్రభావం చూపి, అండం ఎదిగి, అండాశయం నుంచి విడుదలవుతుంది. అలా విడుదలైనపుడు అండాశయం నుంచి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్లు కూడా విడుదలై గర్భాశయంలో పొరలు పెరగడానికి, తిరిగి పిట్యూటరి, హైపోథలామస్ నుంచి వచ్చే హార్మోన్ల స్థాయి నియత్రించడానికీ కూడా పనిచేస్తాయి. దీనినే "హైపోథలామో పిట్యూటరీ ఒవేరియన్ యాక్సిస్" అంటారు. ఇదంతా సక్రమంగా జరిగితేనే అండం విడుదలై, వీర్యకణంతో కలిసి గర్భం వస్తుంది. ఈ గొలుసుకట్టులో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే అండం విడుదల ఆగిపోతుంది. ఈ సూత్రం మీద ఆధారపడి ఓసీ పిల్స్ పనిచేస్తాయి.
 
ఇప్పుడు మనం కృత్రిమంగా తయారుచేసిన "పిల్స్"లో ఉన్న ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ - మెదడు మీద పనిచేసి అండం ఎదుగుదలకి, విడుదలకి అవసరమైన హార్మోన్లు (LH, FSH ) రాకుండా ఆపుతాయి. దీంతో అండం విడుదల ఆగిపోతుంది. అండం లేదు కాబట్టి, గర్భం రాదు. ఇదీ.. పిల్స్ పనిచేసే విధానం. అంతేకాదు, గర్భాశయ ద్వారం దగ్గర చిక్కటి మ్యూకస్ పొర తయారుచేసి వీర్యకణాన్ని నిరోధించి గర్భం రాకుండా చేస్తాయి. ఇంకా గర్భాశయం లోపలి గోడ పలచగా మారడం వలన ఒక వేళ పిండం ఏర్పడ్డా గర్భాశయంలో సరిగ్గా అతుక్కోలేక బయటకు వచ్చేస్తుంది.
 
ఓసీ పిల్స్ వల్ల లాభాలు
సరిగ్గా వాడితే ఈ విధానం మిగతా విధానాలకంటే అత్యంత సమర్థమైనది.
99% విశ్వసనీయమైనది. వాడిన వెయ్యిమందిలో ముగ్గురికి మాత్రమే గర్భం వచ్చే అవకాశముంది.
తేలికగా నోటి మాత్రలుగా తీసుకోవచ్చు.
కలయికకు అడ్డంరాదు.
 
మాత్రలు ఆపిన వెంటనే పునరుత్పత్తి శక్తి పునరుధ్ధరణ జరుగుతుంది. అంటే ఆపిన వెంటనే గర్బం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
మాత్రలు వాడేటపుడు వచ్చే బ్లీడింగ్ తక్కువగా వుంటుంది. మహిళలకు పెద్దగా అసౌకర్యంగా ఉండదు. ఇది అసలు నిజమైన పీరియడ్ కాదు, దీన్ని "విత్ డ్రాయల్ బ్లీడింగ్ "అంటారు.
బహిష్ఠు కడుపు నొప్పి ఉండదు.
రక్తస్రావం ఎక్కువ ఉండదు కాబట్టి రక్త హీనతని నివారిస్తుంది.
గర్భాశయ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.
కీళ్లవాతం నుంచి రక్షణ దొరుకుతుంది.
ఈ పిల్‌లో ఏముంటాయి?
ఈస్ట్రోజన్ - ఇథనైల్ ఈస్ట్రడయాల్ లేక మెస్టృనాల్ రూపంలో ఉంటుంది.
ప్రొజెస్టిరాన్ - నార్ ఇథిస్టరోన్, నార్ జస్ట్రిన్, డ్రోస్ పెరినోన్ రూపంలో ఉంటుంది.
ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్స్‌లో ఈస్ట్రోజన్ అతి తక్కువ మోతాదులో వాడుతున్నారు. అందువల్ల దానితో కలిగే వికారం, బరువు పెరగడం వంటి సైడ్ ఎఫెక్ట్స్‌ను గణనీయంగా తగ్గించగలిగారు.
 
ఎలా వాడాలి?
ఈ మాత్రలు సాధారణంగా ప్యాకెట్లుగా దొరుకుతాయి. ఒక్కో ప్యాకెట్లో 21 లేదా 21+7=28 మాత్రలుంటాయి. 21 హార్మోను మాత్రలు, మిగతా ఏడూ మందు లేని ఖాళీలు ఉంటాయి. బహిష్ఠు అయిన 5 రోజుల లోపు ఎప్పుడైనా మొదలు పెట్టవచ్చు. ఆలస్యమైతే ఇంకేదయినా ఇతర విధానంతో కలిపి వాడాలి. ఉదా: కాండోమ్, ఓసీ పిల్స్.. రెండూ వాడటం. ప్రతి రోజూ ఒక మాత్ర వేసుకోవాలి. ఒకే సమయానికి వేసుకోవాలి. ఒక రోజు రాత్రి వేసుకోవడం మొదలుపెడితే ప్రతిరోజూ రాత్రే వేసుకోవాలన్న మాట. అప్పుడే అవి అత్యంత సమర్థంగా పనిచేస్తాయి.
 
ఒక రోజు మాత్ర మరిచిపోతే, గుర్తు రాగానే వేసుకుని మర్నాడు వేసుకోవలసిన మాత్ర అదే సమయానికి వేసుకోవాలి. రెండుకంటే ఎక్కువ మాత్రలు మరిచిపోతే రక్షణ ఉండదు. గర్భం రావచ్చు. అలాంటప్పుడు డాక్టర్ని కలిసి సలహా తీసుకోవాలి. ఇరవై ఒక్క మాత్రలువేసుకున్నాక, పీరియడ్ వస్తుంది. అది వచ్చిన ఐదవ రోజు నుంచి బ్లీడింగ్ తగ్గక పోయినా ఇంకో ప్యాకెట్ మొదలుపెట్టాలి. కొంతమంది డాక్టర్లు రెండు, మూడు ప్యాకెట్లు వరసగా గ్యాప్ లేకుండా వాడించాక, ఏడు రోజులు విరామం ఇస్తారు. అప్పుడు పీరియడ్ వస్తుందన్న మాట. ఇంకో ముఖ్యమైన విషయం.. ఈ ప్యాకెట్ మొదలుపెట్టాక భార్యాభర్త మధ్యలో కలవక పోయినా మాత్రలు ఆపకూడదు. పూర్తిగా వాడాలి, కొంతమంది తెలియక ఆపుతూ ఉంటారు.
 
పిల్స్ వాడకం వలన ఇబ్బందులున్నాయా?
తలనొప్పి, వికారం, వాంతులు
చిరాకు, డిప్రెషన్, ఉద్వేగం, ఆందోళన
బరువు పెరగడం
నెల మధ్యలో బ్లీడింగ్ మొదటి మూడునెలల్లో కనపడి తర్వాత సర్దుకుంటుంది
వ్యాధినిరోధక శక్తి తగ్గడం వలన జననావయవాల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావచ్చు
రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ
పాలిచ్చే తల్లులలో పాలు తగ్గుతాయి
షుగర్ లెవల్స్ పెరుగుతాయి అందుకే డయాబెటిక్స్ ఇవి వాడకూడదు.
లివర్ సమస్యలు, గాల్ బ్లాడర్ సమస్యలు తలెత్తవచ్చు
గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ వ్యాధి ఉన్న వారు వాడకూడదు
టీబీ మందులతో కలిపి వాడకూడదు.
బీపీ ఉన్నవారు వాడకూడదు
రక్తం గడ్డ కట్టే లక్షణాలు ఉన్న వారు వాడకూడదు.
35 ఏళ్లు పైబడ్డ వారిలో ఇబ్బందులు రావచ్చు
పొగ తాగేవాళ్లలో కూడా ఇబ్బందులు రావచ్చు
 
ఇలాంటి వారు అసలు వాడకూడదు...
40 సంవత్సరాలు వయసు పైబడినవారు
ఊబకాయం ఉన్నవారు
బీపీ, షుగర్, గుండెజబ్బులు
లివర్ సమస్య, కిడ్నీ సమస్యతో బాధపడేవారు
రక్తానికి సంబంధించిన సమస్యలు, వ్యాధులున్నవారు
కేన్సర్ జబ్బులున్నప్పుడు
టీబీ మందులు వాడేటప్పుడు
ఏదైనా ఆపరేషన్ ప్లాన్ చేసుకునే సమయంలో
పాలిచ్చే తల్లులు
పొగతాగేవారు.
 
ఈ పిల్స్‌లో ఇంకా ఏమైనా రకాలున్నాయా?
మినీ పిల్
ఇందులో ప్రొజెస్టిరాన్ మాత్రమే లీవో నార్ జెస్ట్రిల్ రూపంలో కానీ, నార్ ఇథిండోన్ రూపంలో కానీ, డిసో జెస్ట్రిల్ రూపంలో కానీ ఉంటుంది. ఈస్ట్రోజన్ ఉండదు. అందుకే పాలిచ్చే తల్లులు, వికారం, తలనొప్పితో బాధపడేవారు కూడా ఈ పిల్ వాడుకోవచ్చు. అయితే ఫెయిల్యూర్ రేటు ఎక్కువ. ప్రొజెస్టిరాన్ తక్కువ మోతాదులో ఉంటుంది. గర్భాశయ ముఖద్వారం వద్ద మ్యూకస్‌ పొరను చిక్కగా చేయడం వలన వీర్యకణాన్ని నిరోధించి గర్భం రాకుండా నిరోధిస్తుంది.
 
హార్మోనల్ పాచెస్
వీటిని చర్మానికి రెగ్యులర్‌గా అంటించుకుంటే అవి హార్మోన్లను విడుదల చేసి గర్భ నిరోధానికి తోడ్పడతాయి.
 
ఎమర్జన్సీ కాంట్రసెప్టివ్ పిల్
కంబైన్డ్ పిల్ గానీ, ఈస్ట్రోజన్, సింథటిక్ ఆండ్రాయిడ్ పిల్ గానీ, ఎక్కువ డోస్‌లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రెండు డోసులు పన్నెండు గంటల వ్యవధిలో, కలయిక జరిగిన 72గంటల లోపు వాడి గర్భాన్ని నిరోధించ వచ్చు. 24గంటల లోపే వాడితే 95 శాతం సమర్ధంగా పనిచేస్తాయి.
ఈ మాత్రలన్నీ కూడా డాక్టర్ సలహాపై ఎలాంటి ఇతర వ్యాధులు లేనివారు మాత్రమే వాడాలి.
 
చివరగా, 1960 తర్వాత వైద్య రంగంలోనూ, ప్రపంచ ప్రజల లైంగిక జీవితంలోనూ పెను మార్పు తీసుకొచ్చినవి ఈ "ఓరల్ పిల్స్" అని చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళల లైంగిక జీవితంలో రక్షణ, భద్రత కలిగించిన తేలికైన విధానంగా ఇది పరిణమించింది. అయితే వీటివల్ల ఉపయోగాలతో పాటు, నష్టాలు కూడా ఉన్నాయనే విషయాన్ని ప్రజలు గుర్తించాలి. ఎవరు, ఎప్పుడు వీటిని వాడవచ్చో, ఎవరు వాడితే ప్రమాదాలు సంభవిస్తాయో తెలుసుకుని డాక్టర్ సలహాపై వాడటం చాలా ముఖ్యం అనే విషయాన్ని మరవరాదు.
 
ఎవరుపడితే వాళ్లు ముఖ్యంగా యువత వీటిని విశృంఖలంగా వాడటం వలన గర్భ సంచీలోను, పీరియడ్లు వచ్చే క్రమంలోను అనేక దుష్పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదముంది. రక్తంలో గడ్డలు ఏర్పడటం, బీపీ, షుగర్ లాంటి వ్యాధులు ఎక్కువవడం, బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశాలు పెరగడం లాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. అయితే డాక్టర్ సలహాపై ఈ హార్మోన్ మాత్రలు సక్రమంగా ఉపయోగించడం వలన సురక్షితమైన, సౌకర్యవంతమైన జీవితం మహిళ సొంతమవుతుంది.
 
-డాక్టర్ రొంపిచెర్ల భార్గవి
బీబీసీ కోసం