ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ రామస్వామి గురించి తమిళ స్టార్ నటుడు రజినీకాంత్ చేసిన ఓ ప్రసంగంపై తమిళనాడులో వివాదం రేగుతోంది. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తన పార్టీ కూడా బరిలో ఉంటుందని రజినీకాంత్ ఇదివరకు ప్రకటించారు. దాదాపు ఓ వారం క్రితం తుగ్లక్ అనే తమిళ మ్యాగజీన్ 50వ వార్షికోత్సవంలో రజినీకాంత్ పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా దీనికి హాజరయ్యారు.
రజినీ ఏం అన్నారంటే..
తమిళనాడులోని సేలంలో జరిగిన ఓ ర్యాలీలో సీతారాముల నగ్న విగ్రహాలకు చెప్పుల దండలు వేసి పెరియార్ ఊరేగించారని రజినీ తన ప్రసంగంలో చెప్పారు. ''ఈ వార్తను ఏ పత్రికా ప్రచురించలేదు. (తుగ్లక్ వ్యవస్థాపకుడు) చో రామస్వామి మాత్రమే ఈ చర్యను తీవ్రంగా తప్పుపట్టారు. తమ మ్యాగజీన్ కవర్ పేజీపైనా దీన్ని ప్రచురించారు'' అని రజినీ చెప్పారు.
''డీఎంకేకు అది చెడ్డ పేరు తెచ్చింది. అందుకే ఆ మ్యాగజీన్ కాపీలను అడ్డుకున్నారు. కానీ, ఆ ఎడిషన్‌ను తుగ్లక్ మళ్లీ అచ్చు వేసింది. 'బ్లాక్ మార్కెట్'లోనూ ఆ మ్యాగజీన్ అమ్ముడైంది. 'కరుణానిధి తుగ్లక్‌కు ఇలా ప్రాచుర్యం తెచ్చారు' అంటూ ఓ వ్యాఖ్యను తర్వాత ఎడిషన్ కవర్ పేజీపై రామస్వామి అచ్చువేయించారు. ఈ ఉదంతం తర్వాత చో రామస్వామికి దేశవ్యాప్తంగా పేరు వచ్చింది'' అని రజినీ అన్నారు.
ఈ ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ద్రవిడార్ కళగం, ఇతర పెరియార్ భావజాల సంస్థలు రజినీకాంత్ వ్యాఖ్యలను తప్పుపడుతూ ఆందోళన ప్రదర్శనలు చేపట్టాయి. తంతాయి పెరియార్ ద్రవిడార్ కళగం అనే సంస్థ.. రజినీకాంత్ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలోని చాలా మంది నాయకులు కూడా రజినీకాంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
'ఆ ర్యాలీలో నేనున్నా'
పెరియార్ నిర్వహించిన ర్యాలీలో తాను పాల్గొన్నానని, రజినీకాంత్ వాస్తవాలను వక్రీకరిస్తూ చెబుతున్నారని ద్రవిడార్ కళగం ప్రధాన కార్యదర్శి కలి పూంగుండ్రన్ బీబీసీతో అన్నారు. ''1971 జనవరి 24న మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ జరిగింది. అప్పట్లో ప్రముఖ ఆవిష్కర్త జీడీ నాయుడు దాన్ని ప్రారంభించారు. ర్యాలీలో పెరియార్ ఓ ట్రక్కులో వెళ్తున్నారు. జన సంఘ్ వాళ్లు ర్యాలీకి నిరసనగా నల్ల జెండాలు ప్రదర్శించేందుకు అనుమతి తీసుకున్నారు. వాళ్లు పెరియార్ వాహనంపైకి ఓ చెప్పు విసిరారు. అది వాహనం వెనుకవైపు తగిలింది. ఆగ్రహంతో ద్రవిడార్ కళగం సభ్యులు.. ఆ ట్రక్కుల్లో ఉన్న శ్రీరాముడి ఫొటోను కొట్టడం మొదలుపెట్టారు'' అని ఆయన చెప్పారు.
చో రామస్వామి చేసింది దుష్ప్రచారామని, దాన్ని చాలా మంది నమ్మారని ద్రావడ ఇయక్య తమిళ్ పెరవై వ్యవస్థాపకుడు వీరపాండియన్ అన్నారు. ''జనాలు పెరియార్ దిష్టి బొమ్మలను, ఫొటోలను తగులబెట్టారు. 'శాంతించండి కామ్రేడ్స్' అంటూ పెరియార్ అప్పుడో లేఖ రాశారు. ఆ నిరసనలు రాముడికి అనుకూలమూ కాదని, తనకు వ్యతిరేకమూ కాదని పెరియార్ అందులో చెప్పారు. 'నన్ను తగులబెట్టినా, ఆందోళనపడొద్దు. ఇవేమీ మనకు కొత్త కాదు' అని అన్నారు. తమిళ ప్రజల కోసం, ద్రవిడ సిద్ధాంతం కోసం నిందలను భరించేందుకు పెరియార్ అప్పుడు సిద్ధపడ్డారు. చో రామస్వామికి, రజినీకాంత్‌కి ఇది ఎప్పటికీ అర్థం కాదు'' అని వ్యాఖ్యానించారు.
పెరియార్‌పై చేసిన వ్యాఖ్యలపై రజినీకాంత్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, సంఘ్ పరివార్ ఎజెండాలో ఆయన బలిపశువు కావొద్దని వీసీకే పార్టీ ఎంపీ తిరమళవన్ అన్నారు. ''ఊహాజనిత ఘటన గురించి చెబుతూ రజినీకాంత్ జనాలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడో 50 ఏళ్ల క్రితంనాటి విషయం గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం? అసలు అలాంటి ఘటనే జరగలేదని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనం ప్రచురించింది. అక్కడి జనాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగానే ఆ కథనం రాశానని చో రామస్వామి కోర్టులోనూ అంగీకరించారు. అంతకుమించి ఆయనకేమీ తెలియదు'' అని రాష్ట్ర మంత్రి, బీజేపీ మిత్ర పక్షం అన్నాడీఎంకే నాయకుడు జయకుమార్ వ్యాఖ్యానించారు.
'క్షమాపణలు చెప్పను'
పెరియార్ గురించి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పబోనని రజినీ స్పష్టం చేశారు. ''నేను చెప్పిన ఆ ఘటన జరగలేదని చాలా మంది అంటున్నారు. 'ద హిందూ' గ్రూప్‌కు చెందిన అవుట్‌లుక్ మ్యాగజీన్ 2017లో ప్రచురించిన ఓ ఆర్టికల్‌లోనూ ఈ ఘటనను ప్రస్తావించింది. సీతారాముల విగ్రహాలను కొట్టి.. చెప్పుల దండలు వేసి ఊరేగించారని అందులో రాసింది. నేనేమీ జరగని విషయం చెప్పలేదు. ఇది ఊహ కాదు. ఇదివరకు జనాలు చెప్పింది, మీడియాలో వచ్చిందే నేను చెప్పాను. నా వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పబోనని వినమ్రంగా స్పష్టం చేస్తున్నా'' అని రజినీకాంత్ అన్నారు. అవుట్‌లుక్ మ్యాగజీన్ హిందూ గ్రూప్‌ది కాదు. ఈ విషయం గురించి కూడా రజినీకాంత్‌ను కొందరు సోషల్ మీడియాలో ఎద్దేవా చేస్తున్నారు.
'ఆ ఆర్టికల్ నేనే రాశా'
రజినీ చెప్పిన అవుట్‌లుక్ ఆర్టికల్‌ను రాసిన జీసీ శేఖర్‌తో బీబీసీ మాట్లాడింది. తమిళనాడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కార్టూన్ వేసినందుకు ఓ వ్యక్తిని అరెస్టు చేసిన సందర్భంగా, 'ద తమిళ్ గజ్ రాజ్' పేరుతో శేఖర్ ఈ ఆర్టికల్‌ను రాశారు. 1971లో ర్యాలీలో తప్పుడు సమాచారాన్ని ఫొటోలతో సహా ముద్రించినందుకు చో రామస్వామిపై తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆ ఆర్టికల్‌లో శేఖర్ రాశారు.
సేలం నుంచి తనకు వచ్చిన సమాచారం ఆధారంగా ఈ వార్త రాశానంటూ అప్పట్లో కోర్టుకు చో రామస్వామి క్షమాపణలు కూడా చెప్పారు. ''చాలా ఏళ్ల క్రితం నేను టెలిగ్రాఫ్ కోసం పనిచేస్తున్న సమయంలో చో రామస్వామిని ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లా. ఆయన చాలా జ్ఞాపకాలను నాతో పంచుకున్నారు. 1971- సేలం ర్యాలీ గురించి వార్త ప్రచురించినందుకు.. తాను, తుగ్లక్ మ్యాగజీన్ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆయన చెప్పారు. ఆ ఎడిషన్‌ను కూడా నేను ఆయన కార్యాలయంలో చూశా'' అని శేఖర్ బీబీసీతో చెప్పారు.