గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 4 మార్చి 2023 (12:46 IST)

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీసీల వాటా పెరుగుతోందా, తగ్గుతోందా?

babu - jagan
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటేనే కులాల కుంపటి అనేది సాధారణంగా ఉండే అభిప్రాయం. కానీ, ఆ కులాల్లో కూడా కొందరికే అవకాశం దక్కడం స్పష్టంగా గమనించవచ్చు. అత్యధిక సంఖ్యలో ఉన్న కులాలకు, అందులోనూ వెనుకబడిన కులాలకు అవకాశాలు తగిన మోతాదులో దక్కడం లేదని 7 దశాబ్దాల రాజకీయ చరిత్ర చెబుతోంది. ఇటీవల శాసనమండలిలో కొన్ని కులాలకు అవకాశం కల్పించడం ద్వారా తాము బీసీలకు పెద్ద పీట వేస్తున్నట్టు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి రాజకీయ పార్టీలు. నిజంగానే ఏపీ రాజకీయాల్లో బీసీల ప్రాధాన్యం పెరుగుతోందా.. అసెంబ్లీకి కాకుండా మండలికి అవకాశాలు కల్పించడం దేనికి సంకేతం?
 
మూడు పదులు దాటడం లేదు...
తొలుత మద్రాస్ రాష్ట్రంలోనూ, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌గానూ ఉన్న ప్రాంతంలో మొత్తం 15 మార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2009 వరకూ 184 స్థానాలుండేవి. అప్పట్లో జరిగిన పునర్విభజన కారణంగా 175 నియోజకవర్గాలు మిగిలాయి. 1972 పునర్విభజనకు ముంందు 187 సీట్లు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. 1952 నుంచి 2019 ఎన్నికల వరకూ చూస్తే అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ నుంచి బీసీల ప్రాతినిధ్యం ఎన్నడూ మూడు పదుల సంఖ్యను దాటలేదు. అత్యధికంగా 34 మంది ఎమ్మెల్యేలు సభలో ఉన్నారు. 1972, 85, 2004, 2019 ఎన్నికల్లో 34 మంది చొప్పున బీసీ కులాలకు చెందిన వారు అసెంబ్లీలో అడుగుపెట్టారు. అత్యల్పంగా తొలి ఎన్నికల్లో కేవలం 19 మందికి మాత్రమే సీమాంధ్ర ప్రాంతం నుంచి మద్రాస్ రాష్ట్ర అసెంబ్లీలో అవకాశం దక్కింది. 1978లో 28 మంది బీసీలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వగా , టీడీపీ ఆవిర్భావం తర్వాత ప్రతీ ఎన్నికల్లోనూ బీసీ ఎమ్మెల్యేల సంఖ్య 30 అంతకన్నా ఎక్కువకు పెరిగింది.
 
జనాభాకు, ప్రాతినిధ్యానికి పొంతన లేదు
ఆంధ్రప్రదేశ్ జనాభాలో కులాల ప్రాతిపదికన లెక్కలు లేకపోయినప్పటికీ అంచనా ప్రకారం దాదాపుగా 45 శాతం పైబడి బీసీలుంటారు. బీసీలుగా గుర్తించిన కులాల సంఖ్య 140. ఇది 2005 నాటికి 93 మాత్రమే. బీసీలను ఆరు కేటగిరీలుగా విభజించారు. అందులో 'ఏ' కేటగిరీలో 54, 'బీ' 28, 'సీ'లో 1, 'డి' లో 47, 'ఈ'లో 14 కులాల చొప్పున ఉన్నాయి. విద్య, ఉద్యోగాల్లో బీసీలకు కేటాయించిన 25% రిజర్వేషన్లను కేటగిరీల వారీగా పంచుతారు. కానీ చట్ట సభలకు మాత్రం రిజర్వేషన్లు వర్తించడం లేదు. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం చట్టసభలకు రిజర్వేషన్లున్నాయి. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అనే డిమాండ్ నెరవేరకపోవడంతో ఏపీ అసెంబ్లీలో బీసీలు 20 శాతం లోపు మాత్రమే ఉంటున్నారు.జనాభాలో సగ భాగం ఉన్న బీసీలకు ఆ ప్రాతిపదికన ప్రాతినిధ్యం లభించడం లేదని బీసీ ఉద్యమ నేత డాక్టర్ అల వెంకటేశ్వర రావు అన్నారు.
 
"బీసీ జనాభాకు అనుగుణంగా సీట్లు కేటాయించాలని ప్రతీ ఎన్నికల సమయంలో ఆయా కుల సంఘాల తరుపున కోరడం, పార్టీలు అరకొరగా సీట్లు కేటాయించడం జరుగుతోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కారణంగా కొంత మార్పు వచ్చింది. అందరికీ అవకాశాలు వస్తున్నాయి. పార్లమెంట్ నుంచి రాష్ట్రాల అసెంబ్లీల వరకూ అందుకు విరుద్ధంగా నామమాత్రపు ప్రాతినిధ్యంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది"అని ఆయన అభిప్రాయపడ్డారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించడం కన్నా బీసీ రిజర్వేషన్లు చట్టసభలకు వర్తింపజేయడం ద్వారా ఎక్కువ మేలు జరుగుతుందని ఆయన బీబీసీతో అన్నారు.
 
యూపీ, బిహార్‌తో పోలిస్తే సుదూరంగా
ఏపీలో బీసీల సంఖ్యకు, ఆ కులాలకు చెందిన ఎమ్మెల్యేల సంఖ్యకు పొంతన లేదు. కానీ ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల్లో బీసీలకు రాజకీయ ప్రాధాన్యం లభిస్తోంది. తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా బీసీలు ముఖ్యమంత్రి పీఠాలకు చేరుకున్నారు. ఉత్తరాదిన వచ్చిన ఫలితాలతో ఏపీలో కూడా బహుజనులను ఐక్యం చేసే పేరిట కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఓట్లు మావి, సీట్లు మీవా అనే నినాదాలు కూడా వినిపించాయి. కానీ అవి ఆచరణలో రాజకీయ ఫలితాలను సాధించలేకపోయాయి. 1990వ దశకంలోనే యూపీ, బిహార్ ప్రభావం ఏపీని తాకినా అది ఆశించిన రీతిలో ముందుకు సాగలేదు. తొలుత బీఎస్పీ, తదుపరి ప్రజారాజ్యం వంటి పార్టీలు బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాయి. కానీ, ఆ ప్రయోగాలు సత్ఫలితాలను ఇవ్వలేకపోయాయి. బీసీల ప్రాతినిధ్యం పెంచాలనే డిమాండ్‌కి బలం పెరగకపోవడానికి ఆయా ప్రయోగాలు విఫలం కావడం కూడా కారణమనే వాదన ఉంది.
 
"యూపీ, బిహార్‌లో రామ్ మనోహర్ లోహియా ఉద్యమాల ప్రభావం ఉంది. దాని నుంచి కొత్త నాయకత్వం ఉద్భవించింది. జనతా ప్రయోగం, మండల్ ఉద్యమాలు కూడా తోడ్పడ్డాయి. తొలుత కాంగ్రెస్, తర్వాత బీజేపీలకు ప్రత్యామ్నాయంగా బీసీ నాయకులు నిలబడ్డారు. ఆయా రాష్ట్రాల్లో బీసీల నుంచి వచ్చిన నాయకత్వం రాష్ట్ర వ్యాప్త ప్రభావం చూపడానికి రాజకీయ కారణాలు కూడా తోడ్పడ్డాయి" అంటూ సీనియర్ జర్నలిస్ట్ మేరుగుమల నాంచారయ్య అన్నారు. ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఉత్తరాది కన్నా ముందు నుంచే ఉన్నాయని ఆయన అన్నారు. కానీ, కార్పొరేషన్లు, కుల సంఘ భవనాల కోసం డిమాండ్ చేసే స్థాయి నుంచి ఇక్కడి నుంచి నాయకులు ముందుకెళ్లలేదని అభిప్రాయపడ్డారు. "తెలుగునాట బీసీల రాజకీయ ఉద్యమాలు కరువయ్యాయి. పైగా యూపీ, బిహార్ మాదిరిగా ఎస్సీలను కలుపుకుని ముందుకు సాగలేకపోయారు. ఫలితంగా బీసీలలోని అనేక కులాలు అవకాశాలకు దూరంగా ఉండిపోయాయి" అంటూ ఆయన బీబీసీకి వివరించారు. 
 
రెండు కులాల చుట్టూనే...
ఏపీలో అధికార వైఎస్సార్సీపీకి నాయకుడిగా సీఎం హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. ప్రతిపక్ష టీడీపీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. రెడ్డి, కమ్మ కులాలకు చెందిన ఈ ఇద్దరు నాయకులే ప్రస్తుతం రాజకీయంగా చక్రం తిప్పుతున్నారు. అంతకుముందు కూడా 1978 నుంచి ఈరెండు కులాల వారు మినహా మరొకరికి అధికారం దక్కడం లేదు. వైఎస్సార్ మరణం తర్వాత కొద్దికాలం వైశ్య కులస్థుడు కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నారు. కానీ, అది చాలా స్వల్పకాలం.
 
‘‘ఆ రెండు కులాలకే కాకుండా తాము కూడా అవకాశం దక్కించుకోవాలని కాపు కులానికి చెందిన చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో, ఆయన తమ్ముడు పవన్ కల్యాాణ్‌ జనసేన పేరుతో చేసిన ప్రయోగాలు కూడా ఫలించలేదు. అందుకే ఏపీలోనే ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణాలు కీలకం’’అని ఆంధ్రా యూనివర్సిటీ రాజనీతిశాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ బి. ప్రియాంక అన్నారు. "ఏపీలో బీసీల ప్రాబల్యం కేవలం ఉత్తరాంధ్రలోనే కనిపిస్తోంది. ఇతర భాగమంతా రెండు కులాలకు చెందిన వారిదే ఆధిపత్యం. దానికి ఆర్థిక కారణాలు ఉన్నాయి. భూములు, పరిశ్రమలు, ప్రస్తుతం సేవా రంగంలో కూడా ఆ కులాలదే పెత్తనం. రియల్ ఎస్టేట్ వంటివి విస్తరించిన తర్వాత ఇతర కులాలకు కొంత అవకాశం వస్తోంది. కానీ, ఆర్థిక ఆధిపత్యంతో దక్కిన సామాజిక పెత్తనం కొనసాగుతున్నంత కాలం రాజకీయంగా ఆ రెండు కులాలను ఎదుర్కోవడం చిన్న విషయం కాదు" అంటూ ఆమె అభిప్రాయపడ్డారు. బీసీలలో ముఖ్యంగా ఎంబీసీలకు ప్రాధాన్యం దక్కకపోవడానికి సంఖ్య కన్నా ఆర్థిక స్థిరత్వం లోపించడమే ప్రధాన కారణమని బీబీసీతో అన్నారు. సుదీర్ఘకాలం పాటు చేతివృత్తుల్లో ఉండిపోవడం మూలంగా ఆయా కులాలకు రాజకీయ అవకాశాలు అందుకోవడం కష్టమైందని చెప్పారామె.
 
అసెంబ్లీకి బదులుగా మండలికి...
ఏపీలో ప్రస్తుతం 140 బీసీ కులాలుంటే ఇప్పటి వరకూ అసెంబ్లీలో 28 కులాలకు చెందిన వారు మాత్రమే అడుగుపెట్టారు.
సంఖ్య రీత్యా ఆయా కులాల ఎమ్మెల్యే సంఖ్య:
కొప్పుల వెలమ- 84 ( అత్యల్పం 1952లో ఒక్కరు, అత్యధికం 1985లో 11 మంది గెలిచారు)
తూర్పు కాపు- 63 ( అత్యల్పం 1955లో ఇద్దరు, 2004లో ఏడుగురు)
గౌడ - 47 ( 1972లో ఒక్కరే గెలవగా, 2014లో ఐదుగురు గెలిచారు)
పోలినాటి వెలమ - 40 ( తొలి మూడు ఎన్నికల్లో ఒక్కరు చొప్పున గెలిచారు, అత్యధికం 1983లో ఐదుగురు)
యాదవ - 39 ( తొలి 4 ఎన్నికల్లో ఒక్కరూ లేరు. 1983లో ఆరుగురు)
చేనేత- 34 ( 2014,19 ఎన్నికల్లో ప్రాతినిధ్యం లేదు. అత్యధికంగా 1955లో ఆరుగురు)
కాళింగ- 31 ( తొలి రెండు ఎన్నికల్లో ఒక్కరూ గెలవలేదు. కానీ 1962లో అత్యధికంగా నలుగురు)
మత్స్యకారులు-21 ( తొలి రెండు ఎన్నికల్లో ప్రాతినిధ్యం లేదు. 2009,14,19లో ముగ్గురు చొప్పున గెలిచారు)
శెట్టిబలిజ - 17 (తొలి రెండు ఎన్నికలతో పాటుగా 1983,95,94లో ప్రాతినిధ్యం లేదు. 2004లో అత్యధికం నలుగురు)
గవర - 13 ( తొలి రెండు ఎన్నికల్లో గెలవలేదు.1999లో ఇద్దరు.)
కురబ - 13 ( 1994,99,2004లో ఒక్కరూ లేరు. 2019లో ఇద్దరు)
బోయ - 10 ( 2014లో ఇద్దరు)
రెడ్డిక - 8 ( 1962లో ఇద్దరు. 2009,14లో ప్రాతినిధ్యం లేదు. 2019లో ఒక్కరు)
కళావంతులు- 7 ( 1985లో ఇద్దరు గెలిచారు. 1989 తర్వాత ఒక్కరూ లేరు)
నగరాలు - 7, గాండ్ల -6, పెరిక- 3, లింగాయత్ - 2, వడ్డి- 2, జంగమ, విశ్వబ్రాహ్మణ, ముదిరాజ్, ఉప్పర, ఒక్కళిగ కులాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఏపీ అసెంబ్లీకి ప్రాతినిధ్యం దక్కించుకున్నారు. ఇటీవల శాసనమండలికి వడ్డెర కులానికి చెందిన ఏసురత్నం అనే నాయకుడికి అవకాశం కల్పిస్తున్నట్టు వైఎస్సార్సీపీ ప్రకటించింది. గతంలో ఆయనకు అసెంబ్లీ టికెట్ కూడా ఆ పార్టీ కేటాయించింది. అంంతకుముందు కూడా ఆ కులానికి చెందిన వారు ఎన్నికల బరిలో నిలిచినా అసెంబ్లీకి ఎన్నిక కాలేదు.
 
"ఇటీవల మండలికి గతంలో ఎన్నడూ చట్టసభలో చోటు దక్కని వారికి ప్రాతినిధ్యం ఇస్తున్నారు. బీసీలలో కూడా కొన్ని కులాల ఆధిపత్యం కారణంగా అత్యధికులు అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం దక్కించుకోలేకపోతున్నారు. ఉదాహరణకు ఒకనాడు పెద్ద సంఖ్యలో కనిపించిన చేనేత కులాలకు ప్రస్తుతం అవకాశాలు రాకపోవడం అందుకు నిదర్శనం. కానీ ఆ కులాల వారు మండలిలో ఉన్నారు. అసెంబ్లీలో చోటు లేని వారికి మండలిలో అవకాశం ఆహ్వానించదగినదే" అని రాజకీయ విశ్లేషకుడు శివ రాచర్ల అన్నారు. ‘‘వడ్డిలకు కూడా అసెంబ్లీలో పదేళ్లుగా చోటు దక్కలేదు. ఇప్పుడు మండలిలో అవకాశం ఇచ్చారు. మండలిలో వివిధ కులాలకు ప్రాధాన్యం పెరుగుతుండడం ఆహ్వానించాలి’’అని ఆయన బీబీసీతో అన్నారు. రాజకీయ ప్రయోజనాల మూలంగానే కొన్ని కులాలకు అయా పార్టీలు అవకాశం ఇస్తున్నట్టు శివ అభిప్రాయపడ్డారు.