ఇషాన్ కిషన్: ‘అతనొక భయం తెలియని ఆటగాడు’... విరాట్ కోహ్లీ ఈ మాట ఎందుకన్నాడు
అతను భయమంటే తెలియని ఆటగాడు... భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ అన్న మాటలు ఇవి. కోహ్లీ పొగిడిన ఆ ఆటగాడు ఎవరో కాదు... ఇషాన్ కిషన్. బంగాళఖాతంలోని మాండౌస్ తుపానులా బంగ్లాదేశ్‌ను నేడు ఇషాన్ కిషన్ చుట్టిముట్టిన తీరును చూస్తూ చాలా మంది విరాట్ కోహ్లీ మాటలతో అంగీకరిస్తారేమో. తుపాను వల్ల తెలుగు రాష్ట్రాల్లో వానలు పడుతుంటే ఇషాన్ కిషన్ తుపాన్ ఇన్నింగ్స్ వల్ల బంగ్లాదేశ్ ఆటగాళ్లు సిక్సులు, ఫోర్లతో తడిసి ముద్దయ్యారు. తుపాన్ తీరం దాటిన తరువాత ఎంతటి ప్రశాంతత ఉంటుందో ఇషాన్ కిషన్ అవుట్ అయిన తరువాత చిట్టగాంగ్‌లోని స్టేడియంలో అంతే ప్రశాంతత ఆవరించింది.
కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ, విరాట్ కోహ్లీ సెంచరీతో భారత్ భారీ స్కోరు చేసింది. బంగ్లాదేశ్ ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. తన తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్ ఇలాంటి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. 2021 మార్చిలో ఇంగ్లండ్ మీద రెండో టీ20లో కేవలం 32 బంతుల్లో 4 సిక్సులు, 5 ఫోర్ల సాయంతో 56 పరుగులు చేశాడు ఇషాన్ కిషన్. నాడు విరాట్ కోహ్లీతో కలిసి టీం ఇండియాను విజయ తీరాలకు చేర్చాడు. ఆ మ్యాచ్ సందర్భంగానే ఇషాన్ కిషన్ గురించి మాట్లాడుతూ విరాట్ కోహ్లీ... అతను భయమంటే తెలియని ఆటగాడు అని అన్నాడు. నేడు బంగ్లాదేశ్ మీద కూడా ఇషాన్ కిషన్ తుపానులా విరుచుకుపడుతున్నప్పుడు అతనికి మరొక ఎండ్‌లో జోడీగా నిలబడింది విరాట్ కోహ్లీనే. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేయగానే విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేశాడు.
టీం ఇండియాకు కావాల్సింది ఈ ధైర్యమే
ఇప్పుడు బంగ్లాదేశ్ మీద అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మరొకసారి తనకు భయం లేదని నిరూపించుకున్నాడు ఇషాన్ కిషాన్. ఇప్పుడు భారత్‌కు కావాల్సింది ఇలాంటి భయం లేని ఆటగాళ్లు అంటూ మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు. టీం ఇండియా ఇప్పుడు అందిపుచ్చుకోవాల్సి ఆట తీరు ఇదేనంటూ మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ అన్నారు. క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషాన్‌ను అభినందిస్తూ ట్వీట్ చేసిన సందర్భంగా ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రెండు చేతులతో పట్టేశాడు
అవకాశం వచ్చినప్పుడు ఒడిసి పట్టుకోవాలి... తలుపు తట్టినప్పుడే తీయాలి... అంటూ చాలా మంది చెబుతుంటారు కదా... ఇప్పుడు ఇషాన్ కిషన్ అదే చేశాడు అని టీం ఇండియా మాజీ కోచ్ రవి శాస్త్రి అన్నారు. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నావ్ అంటూ ఇషాన్ కిషన్‌ను ప్రశంసిస్తూ ఆయన ట్వీట్ చేశారు. టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం కావడం వల్ల మూడో వన్డేకు దూరం కావడంతో ఇషాన్ కిషన్‌కు అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని అతను చక్కగా వినియోగించుకున్నాడు. 2021 మార్చిలో టీ20లలోనూ ఇషాన్ కిషన్‌కు అవకాశం దక్కింది ఇలాగే. ఇంగ్లండ్‌తో జరిగిన ఆ సిరీస్‌లో టీం ఇండియా ఓపెనర్ శిఖర్ ధవన్, తొలి మ్యాచ్‌లో విఫలం కావడంతో ఇషాన్ కిషన్‌కు అవకాశం దక్కింది. ఫలితం... 32 బంతుల్లో 56 పరుగులు. వచ్చిన అవకాశాన్ని ఇషాన్ కిషన్ ఎలా వినియోగించుకుంటున్నాడో ఈ గణాంకాలు చూస్తే అర్థమవుతుంది.
డబుల్‌తోనే సెంచరీల బోణీ
బంగ్లాదేశ్ మీద ఇషాన్ కిషన్ చేసింది ఒక్క డబుల్ సెంచరీనే కానీ ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. వన్డేలలో ఇది అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ. 126 బంతుల్లో 200 పరుగులు చేశాడు ఇషాన్ కిషన్. ఇందులో 9 సిక్సులు, 23 ఫోర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు వన్డేలలో వేగవంతమైన డబుల్ సెంచరీ క్రిస్ గేల్ పేరు మీద ఉండేది. 2015 వరల్డ్ కప్‌లో భాగంగా జింబాబ్వే మీద గేల్ 138 బంతుల్లో 200 పరుగులు చేశాడు. ఇక డబుల్ సెంచరీ చేసిన నాలుగో భారత క్రికెటర్ ఇషాన్ కిషన్. ఇంతకు ముందు సచిన్ తెందూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ మాత్రమే డబుల్ సెంచరీలు చేశారు. అంతర్జాతీయంగా చూస్తే డబుల్ సెంచరీ చేసిన 7వ ఆటగాడు ఇషాన్ కిషన్. ఇక వన్డేలలో సెంచరీ చేయకుండానే నేరుగా డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా కూడా ఇషాన్ కిషన్ నిలిచాడు.
మరొక ఝార్ఖండ్ డైనమైట్
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ వచ్చిన జార్ఖండ్ రాష్ట్రం నుంచే 24ఏళ్ల ఇషాన్ కిషన్ క్రికెట్ కెరియర్‌ను ప్రారంభించాడు. బిహార్‌లో పుట్టినా కొన్ని కారణాల వల్ల జార్ఖండ్‌కు ఆడటం ప్రారంభించాడు. తొలి నుంచి కూడా అటాకింగ్ ప్లేయర్‌గా అతనికి పేరు ఉంది. 2015 అక్టోబరులో రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర మీద 69 బంతుల్లో 87 పరుగులు చేయడం ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఇషాన్ కిషన్ ఆకర్షించాడు. అండ్-19 టీమ్‌కు కెప్టెన్‌గాను వ్యవహరించాడు. ఇషాన్ కిషన్‌లోని దూకుడుని చూసే 2016లో గుజరాత్ లయన్స్ రూ.35 లక్షలకు కొనుగోలు చేసింది. అప్పటికి అతని వయసు 17ఏళ్లు. ఆ తరువాత ముంబయి ఇండియన్స్ అతన్ని సొంతం చేసుకుంది.
2022 ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ రికార్డు స్థాయిలో రూ.15.25 కోట్లు ఇచ్చి ఇషాన్ కిషన్‌ను మళ్లీ సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లో అతనికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. 2020 ఐపీఎల్ సీజన్‌లో ముంబయి ఇండియన్స్ తరపున అత్యంత ఎక్కువ పరుగులు చేశాడు ఇషాన్ కిషన్. 14 మ్యాచుల్లో 516 పరుగులు చేశాడు. అండర్-19 క్రికెట్ ప్రపంచకప్(2016)లో ఇషాన్ కిషన్ నేతృత్వంలోని టీం ఇండియా ఫైనల్స్‌కు సైతం చేరుకుంది.