ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 8 జులై 2022 (16:54 IST)

‘కాకతీయ వైభవ సప్తాహం’: కాకతీయుల వారసుడొచ్చారా? ఆ వంశం ప్రతాపరుద్రునితో అంతం కాలేదా?

Chandrabhanj Dev
తెలుగు నేల నుంచి దక్షిణ భారతంలో బలమైన సామ్రాజ్య నిర్మాతలుగా ఎదిగిన కాకతీయుల వైభవాన్ని చాటుతూ జులై 7 నుంచి 13 వరకు 'కాకతీయ వైభవ సప్తాహం' పేరుతో వరంగల్ కేంద్రంగా వారం రోజులపాటు ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. గతంలోనూ ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఇలాంటి ఉత్సవాలు జరిపారు. ఈసారి నిర్వహిస్తున్న ఉత్సవాలకు కాకతీయుల వారసుడిగా చెబుతున్న ఛత్తీస్‌గడ్ రాజకుటుంబానికి చెందిన 'కమల్ చంద్ర భంజ్‌దేవ్'ను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. దీంతో 'మలి కాకతీయులు', కాకతీయ వారసులు మరోసారి చర్చల్లో నిలిచారు. ఓరుగల్లు ప్రధాన కేంద్రంగా సాగిన కాకతీయుల పాలనలో వారి రాజ్యం నేటి తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల వరకు విస్తరించింది.

 
వ్యవసాయ, సాంస్కృతిక, విదేశీ వాణిజ్యపరంగా గొప్పగా ఎదిగిన సువిశాల కాకతీయ సామ్రాజ్యం ఎలా పతనమైంది? కాకతీయ వంశంలో చివరి రాజు రెండో ప్రతాపరుద్రుని మరణం వెనుక మిస్టరీ, ఆ తర్వాతి కాలంలో కాకతీయ వంశస్తులు ఏమయ్యారు అన్నదానిపై చరిత్ర పరిశోధకుల్లో 700 ఏళ్ల తర్వాత కూడా ఏకాభిప్రాయం లేదు.

 
కాకతీయ చివరి రాజు-రెండవ ప్రతాపరుద్రుడు
రాణి రుద్రమ దేవికి కొడుకులు లేకపోవడం తో తన కూతురు 'ముమ్మడమ్మ' కొడుకు ప్రతాపరుద్రుడిని దత్తత తీసుకుని పట్టాభిషేకం చేసింది. కాకతీయ పాలకుల్లో చివరి రాజు (రెండవ )ప్రతాపరుద్రుడు. చారిత్రక ఆధారాల ప్రకారం ప్రతాపరుద్రుని చివరి కాలంలో కాకతీయ సామ్రాజ్యం వరుసగా ముస్లిం రాజుల దాడులకు లోనయింది. వాటిలో ప్రధానమైనవి ఖిల్జీ, తుగ్లక్ వంశాలకు చెందిన దిల్లీ సుల్తానులు జరిపినవి. క్రీ.శ. 1323లో 'ఘియాజుద్దీన్ తుగ్లక్' సైనిక అధికారి (కొడుకు) 'ఉలుగ్ ఖాన్' నేతృత్వంలో జరిగిన దాడిలో కాకతీయ సామ్రాజ్యం పతనం అయింది. ఇక్కడి వరకు చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం కనిపిస్తుంది.

 
అయితే ఆ తర్వాత ఏం జరిగిందన్న దానిపై పరిశోదకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా రెండవ ప్రతాపరుద్రుని మరణంపై ఏకాభిప్రాయం లేదు. రెండో ప్రతాపరుద్రున్ని బందీ పట్టుకుని దిల్లీకి తరలిస్తున్న క్రమంలో ఆయన నర్మద నదిలో ప్రాణత్యాగం చేశారన్న వాదన ఒకటి ఉంది. అయితే ఆయన వారి చెర నుండి తప్పించుకున్నడన్నది మరో వాదన. ఆ తర్వాత చాలాకాలం ప్రతాపరుద్రుడు బతికే ఉన్నాడని ప్రస్తుత భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద చనిపోయాడన్నది మరో కథ. తన తమ్ముడు అన్నమదేవుడి సహాయంతో బస్తర్ కేంద్రంగా ఆదివాసీ ప్రాంతాల్లో రాజ్య స్థాపన చేశాడన్నది ప్రచారంలో ఉన్న మరో కథనం. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ చరిత్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ హైమవతి కాకతీయ సామ్రాజ్య పతనంపై ‘బీబీసీ తెలుగు’తో మాట్లాడారు.

 
''వీరభద్రారెడ్డి భార్య రెడ్డిరాణి 'అనితల్లి దేవి' వేయించిన 'కలువ చెరువు' దానశాసనం ప్రకారం 'సోమోద్బవ నది' లోదూకి ప్రతాపరుద్రుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ప్రతాపరుద్రుని మరణం తర్వాత సుమారు వంద సంవత్సరాల కాలానికి ఈ శాసనం వేయించారు. దీంతో ప్రతాపరుద్రుని మరణంపై నాకూ పలు అనుమానాలు ఉన్నాయి'' అన్నారు హైమవతి. ''17 వ శతాబ్ధంలో ఏకామ్రనాథుడు రాసిన 'ప్రతాపరుద్ర చరిత్ర', ఇతర ఐతిహాసాల ప్రకారం బందీగా దిల్లీ తీసుకెళ్తున్న ప్రతాపరుద్రుడిని కాకతీయ సేనానాయకుల్లో కొందరు పెద్దపల్లి జిల్లా రామగిరి ఖిల్లా నుంచి తప్పించారు. ఆ తర్వాత కొంత కాలానికి ఆయన నేటి కాళేశ్వరం సమీపంలో గోదావరినది లో తన భార్య 'విశాలాక్షి' సహా ప్రాణత్యాగం చేశారు. బందీగా దిల్లీకి చేరితే మతమార్పిడికి గురవుతానన్న మానసిక సంఘర్షణ ఆయనలో ఆనాడు ఉంది'' అని హైమవతి తెలిపారు.

 
మలి కాకతీయులు
ప్రతాపరుద్రుని మరణం తర్వాత మలి కాకతీయ సామ్రాజ్యం ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ కేంద్రంగా కొనసాగిందన్న వాదన కొందరు చరిత్రకారుల నుంచి వినిపిస్తుంటుంది. కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత ప్రతాపరుద్రుని తమ్ముడు 'అన్నమదేవుడు' ఛత్తీస్‌గఢ్ అడవుల్లోకి వెళ్లి ఆదివాసీల మధ్య గడుపుతూ అక్కడే తన రాజ్యాన్ని స్థాపించాడని.. అదే మలికాకతీయ సామ్రాజ్యం అని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. దీనితో ఏకీభవించేవారు, దీనికి భిన్నమైనఅభిప్రాయాలు కలవారూ ఉన్నారు. కాకతీయ సామ్రాజ్యంపై విస్తృత పరిశోధన, అధ్యయనం కొనసాగించిన రిటైర్డ్ ప్రొఫెసర్ హైమవతి చెబుతున్న ప్రకారం… ప్రతాపరుద్రుని పాలన కాలం నాటికే బస్తర్ ప్రాంతం కాకతీయ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. ఆ ప్రాంతానికి ప్రతాపరుద్రుని తమ్ముడు అన్నమదేవుడు పాలకుడిగా ఉన్నారు.

 
''కాకతీయ రాజ్యం అనే పేరుమీదుగా పరిపాలన సాగలేదు. కాబట్టి మలి కాకతీయుల పాలన అని అనలేం. కానీ అక్కడ పరిపాలించింది కాకతీయ వంశస్తులే. అది ఆ ప్రాంతంలోని శాసనాల ఆధారంగా తెలుస్తోంది. అన్నమ దేవుని తర్వాత వచ్చిన పాలకుడైన 'దిక్పాల దేవుడు' (1680-1708) హయాంలో వేసిన 'దంతేశ్వర శాసనం'లో తాము అన్నమదేవుని వారసులమని చెప్పుకున్నారు. దండకారణ్యప్రాంత ఆదివాసీల ఐతిహ్యాల్లో కూడా 'కాకతీయుల వారసులను మా తల్లి(ఆదివాసీల దేవత) కాపాడింది' అని ఉంది'' అన్నారు హైమవతి. ''ఏకామ్రనాథుడి 'ప్రతాపరుద్ర చరిత్ర'లో రెండవ ప్రతాపరుద్రునికి 'వీరభద్రుడు' అనే కొడుకు ఉన్నాడని రాసి ఉంది. అయితే దానికి ఎలాంటి ఆధారాలు లేవు. శాసనాలూ ఈ అంశాన్ని కొట్టిపారేస్తున్నాయి.

 
కాకతీయ సైన్యం లో 'లెంక సైన్యం' పేరుతో ఆత్మహుతి దళాన్ని పోలిన విభాగం ఉండేది. సైనిక ప్రతిజ్ఞలో భాగంగా తాము కాకతీయ పుత్రులమని, రాజు సేవ కోసమే బతుకుతామని వారు ప్రతిజ్ఞ చేసేవారు. ప్రతాపరుద్రుని కొడుకు వీరభద్రుడు అనే భావన ఇలాంటిదే కావొచ్చు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో ఇప్పటికీ 'లెంక' అన్న ఇంటిపేరు కనిపిస్తుంది.'' ''చాళుక్యులు శాఖలుగా విడిపోయినా పశ్చిమ, తూర్పు, బాదామి,కల్యాని చాళుక్య పేర్లతో తమ వంశ నామాన్ని కొనసాగించారు. చాళుక్యులు తమ పూర్వీకులని వీరంతా చెప్పుకొన్నారు. ప్రతాపరుద్రుని తర్వాత అలా కాకతీయ వంశం పేరుతో పాలన సాగలేదు.'' ''కాకతీయ సామ్రాజ్య పతనం అనంతరం తెలుగు నేలతో వారికి సంబంధాలు కొనసాగలేదు. బస్తర్ ప్రాంతంలో తమను బలపరిచిన స్థానికులతోనే సంబంధాలు కొనసాగించారు. ఒడిశా ప్రాంత రాజకుటుంబాలతో వారికి వివాహ సంబంధాలు కొనసాగాయి. తెలుగు నేలపై బహమని సుల్తానుల బలమైన రాజకీయ జోక్యం వల్ల అన్నమదేవుడు, ఆ తర్వాత ఆయన వారసులు తెలుగు ప్రాంతాలతో సంబంధాలు కొనసాగించలేకపోయారు.''

 
మలి కాకతీయులు అన్న అంశంపై ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్ (ICHR) మాజీ చైర్మన్ ప్రొఫెసర్ వై.సుదర్శన్ రావ్‌ను బీబీసీ సంప్రదించింది. ''ప్రతాపరుద్రుని తర్వాత కాకతీయ సామ్రాజ్యం అంతరించింది. కానీ వారి వంశం ఉండవచ్చు. అన్నమదేవుడు బస్తర్ అడవుల్లోకి వెళ్లినట్టుగా కథనాలు ఉన్నాయి. శాసనాలు, సమకాలీన సాహిత్య ఆధారాలు అంత బలంగా కనపడవు. అయినా 'భంజ్‌దేవ్'లు కాకతీయుల వారసులన్న క్లెయిమ్స్ గత కొన్నేళ్లుగా వింటున్నాం. ఇన్ని తరాల తర్వాత ఈ క్లెయిమ్స్ గుర్తించడం కష్టమే. అలా అని కాదని అనలేం. విజయనగర కృష్ణదేవరాయల వారసులుగా ప్రస్తుత కుటుంబం ఆనెగుందిలో ఉంది. వారిని గుర్తించి గౌరవించుకుంటున్నాం. ఇప్పటి తరం ప్రజలు గతంలోని మహనీయులను, వారి వంశజులను గౌరవించడం ద్వారా ఆ వంశానికి మనం కృతజ్ఞత చెప్పుకొన్నట్లు అవుతుంది. అది ఇప్పటి తరం కర్తవ్యం, బాధ్యత'' అన్నారు సుదర్శన్ రావ్.

 
''ప్రతాపరుద్రుడిని తుగ్లక్ సైన్యం దిల్లీకి తీసుకుపోయిందని, నర్మద తీరంలో తనువు చాలించారనే వాదన ఉంది. అదే సందర్భంలో ఆయన్ను దిల్లీ పాలకుడు విడుదల చేసి తిరిగి పంపారని ఆ తర్వాత గోదావరి తీరంలో బస్తర్ ప్రాంతంలో మరణించారని.. తదనంతరం వారి కుటుంబ వారసులు బస్తర్ ప్రాంతంలో కొంతకాలం రాజ్యం చేశారని చెప్పుకుంటారు. అందుకు తగినట్లు కథనాలు ఉన్నాయి'' అని ప్రొఫెసర్. సుదర్శన్ రావ్ అన్నారు. కాకతీయ యూనివర్సిటీ చరిత్ర విభాగం సీనియర్ ప్రొఫెసర్ విజయ్ బాబు దీనిపై మాట్లాడారు

 
''మలికాకతీయులు పేరుతో సామ్రాజ్యం ఏదీ లేదు. ఆ తర్వాతి వారసులు ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో చిన్న ఆదివాసీ రాజ్యాన్ని పాలించారు. బలమైన శత్రువు చేతిలో ఓడిపోయినప్పుడు, కాలం అనుకూలించనప్పుడు అటవీ ప్రాంతాల్లో షెల్టర్ తీసుకోవడం అన్ని కాలాల్లో కనిపిస్తుంది. కాలం అనుకూలించాక అక్కడే సైన్యాన్ని నిర్మించుకుని తిరిగి రాజ్యాలను విస్తరించారు. అయితే కాకతీయులుగా చెప్పుకున్న బస్తర్ ప్రాంత 'భంజ్‌దేవ్'లకు ఒరిస్సా ప్రాంతానికి చెందిన రాజకుటుంబాలతో వివాహ సంబంధాలు ఉన్నాయనడానికి ఆధారంగా కొన్ని డాక్యుమెంట్లను వార్తాపత్రికాల్లో చూశాను.'' అని ప్రొ.విజయ్ బాబు అన్నారు.

 
బస్తర్ చరిత్ర కారుల అభిప్రాయంలో..
తెలుగు ప్రాంత చరిత్ర పరిశోధకులు, అధ్యాపకుల అభిప్రాయాలు ఇలా ఉన్న నేపథ్యంలో... మలి కాకతీయ రాజ్యం, కాకతీయుల వారసులు అన్న అంశాలపై ‘బీబీసీ తెలుగు’ ఛత్తీస్‌గఢ్ బస్తర్ ప్రాంతానికి చెందిన చరిత్రకారుడు 'రాజీవ్ రంజన్ ప్రసాద్'తో మాట్లాడింది. బస్తర్ ప్రాంత చరిత్ర, సంస్కృతిపై అధ్యయనం చేసిన రాజీవ్ రంజన్ ప్రసాద్ ''ఆమ్ చో బస్తర్'' (మా బస్తర్) పేరుతో పుస్తకం రాశారు. అందులో బస్తర్‌కు సంబంధించిన వివరాలు తెలిపారు. ''దిల్లీ సుల్తానుల దాడిలో ఓరుగల్లు పతనమయ్యాక ప్రతాపరుద్రుడి తమ్ముడు అన్నమ దేవుడు 200 అశ్వాల సైన్యంతో గోదావరిని దాటి దండకారణ్యంలోకి ప్రవేశించాక మొదట భూపాలపట్నం వద్ద అక్కడి నాగవంశీకులైన(చిందక్ నాగులు) ఆదివాసీలను ఓడించాడు. దీంతో క్రీ.శ. 760 నుండి 1324 వరకు ఆప్రాంతంలో సాగిన నాగవంశం పాలనకు తెరపడింది. ఆ తర్వాత కాలంలో 'కాంకేర్' ప్రాంతంలో 'పైరీ నదీ తీరం'లో చంద్రవంశీయుల రాజ్యం చేజిక్కించుకుని విస్తరించారు.

 
దట్టమైన అడవులతో నిండిన బస్తర్ ప్రాంతం బ్రిటిషర్ల పాలన వరకు బాహ్యప్రపంచంతో వేరుగా ఉన్న శత్రుదుర్బేద్య ప్రాంతం. దీంతో వారికి సహజసిద్ద రక్షణ లభించింది. స్థానిక ఆదివాసీలతో సత్సంబంధాలను వారు కొనసాగించారు. వారి సంస్కృతిలో కలిసిపోయారు. నాగులు(ఆదివాసీలు) మణికేశ్వరి దేవిని ఆరాధిస్తే వీరు 'దంతేశ్వరి దేవి'ని పూజించారు. ''వీరి వంశానికి సంబంధించి కొంత అస్పష్టత ఉంది. అన్నమదేవుడు తన తండ్రి తరఫున చాళుక్యుడు, తల్లి తరపున కాకతీయ వంశానికి చెందిన వారు. బస్తర్ ఆదివాసీ జానపదాల్లో వీరి గురించి 'చాళుక్య వంశ్ కీ రాజా-డిండిబీ బాజా'' అన్న కవితాపంక్తులు దీనికి ఉదాహరణ''. తర్వాతి తరంలో వచ్చిన రాజులు జగదల్ పూర్‌లో 'కాకతీయ విద్యాలయ' పేరుతో విద్యాసంస్థను నెలకొల్పారు.'' అయితే వీరి పేరులో 'భంజ్ దేవ్" అనేది ఎలా చేరిందన్న దానిపై కొంతమంది పరిశోధించారు.

 
తర్వాతి తరాల్లో వచ్చిన 'రాజా రుద్రప్రతాప్ దేవ్'కు మగసంతానం లేదు. ఆయన కుమార్తే 'ప్రఫుల్ల కుమారి దేవి'కి ఒడిశాలోని మయూర్ భంజ్ ప్రాంతానికి చెందిన ప్రఫుల్ల కుమార్ భంజ్‌దేవ్‌తో వివాహం జరిపించాకే వారి ఇంటి పేరులో 'భంజ్‌దేవ్' చేరిందన్నది వారి వాదన. భంజ్‌దేవ్ వంశం గురించి మాట్లాడే సందర్భంలో బస్తర్ ప్రాంత ఆదివాసీల్లో పేరుపొందిన 'రాజా ప్రవీర్ చంద్ర భంజ్ దేవ్' గురించి మాట్లాడుకోవాలి. ఆయనే ఈ వంశ చివరి పాలకుడు. ఆదివాసీలతో కలిసి ఆయుధాలతో ప్రభుత్వంపై తిరుగుబాటుకు కుట్ర పన్నారన్న ఆరోపణలతో 1966లో జగదల్‌పుర్ కోటలో ఆయన్ను పోలీసులు కాల్చి చంపారు.

 
''ఆదివాసీల సమస్యలపై ప్రవీర్ చంద్ర్ భంజ్ దేవ్ అహింసా పద్దతిలో పోరాటాలు చేశారు. పలుమార్లు దిల్లీ కేంద్రంగా నిరాహార దీక్షల రూపంలో కూడా ఈ పోరాటాలు సాగాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. 'మహారాజా పార్టీ' పేరుతో ఆయన ఓ ప్రాంతీయ పార్టీని కూడా స్థాపించారు. సీట్లు గెలిచారు. కాంగ్రెస్‌ను ఆ ప్రాంతంలో అడ్డుకున్నారు’’ అని రాజీవ్ రంజన్ ప్రసాద్ వెల్లడించారు. ‘‘డి.పి.మిశ్రా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజా ప్రవీర్ చంద్రదేవ్‌కు మతిస్థితిమితం తప్పిందని స్విట్జర్లాండ్‌కు బలవంతంగా చికిత్స కోసం పంపారు. 1964లో బస్తర్ దసరా వేడుకల్లో పొందే రాజా హోదాను తొలిగించి ఆయన తమ్ముడు 'విజయ్ చంద్ర భాంజ్ దేవ్'ను రాజుగా ప్రకటించారు.


ప్రవీర్ చంద్ర దేవ్ తో పాటు పది మందికి పైగా ఆదివాసీలు పోలీస్ కాల్పుల్లో మరణించిన రోజు రాత్రి నుండి తెల్లవారు జాము 4 గంటల ప్రాంతం వరకు రాజ్ మహల్ వద్ద కాల్పులు జరిగాయి. ఆ తర్వాత ఆయన మరణంపై ఏకసభ్య కమీషన్‌ను నియమించారు'' అని రాజీవ్ రంజన్ ప్రసాద్ తెలిపారు. కాగా.. రాజా ప్రవీర్ చంద్ర భంజ్ దేవ్ తమ్ముడు విజయ్ చంద్రభంజ్ దేవ్ మనవడే కాకతీయ సప్తాహ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించిన కమల్ చంద్ర భంజ్‌దేవ్.