కాలాపానీ విషయంలో నేపాల్‌లో నిరసనలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ ప్రధాని కేపీ ఓలీ తొలిసారి బహిరంగంగా స్పందించారు. కాలాపానీ తమ దేశంలో భాగమని ఆయన అన్నారు. నేపాల్, భారత్, టిబెట్‌ల మధ్య కాలాపానీ ఒక కూడలి అని, వెంటనే అక్కడి నుంచి భారత్ తన సైనికులను ఉపసంహరించుకోవాలని ఓలీ వ్యాఖ్యానించారు.
అక్టోబర్ 31న భారత ప్రభుత్వం జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత అధికారికంగా దేశానికి సంబంధించిన ఒక మ్యాప్ విడుదల చేసింది. ఈ మ్యాప్‌లో ఉత్తరాఖండ్, నేపాల్ మధ్య ఉన్న కాలాపానీ, లిపు లేఖ్ ప్రాంతాలు భారత్‌లో ఉన్నట్టు చూపించారు. ఇవి తమ ప్రాంతాలని నేపాల్ అంటోంది. ఆదివారం నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ యువ విభాగం నేపాల్ యువ సంగమ్‌ను ఉద్దేశించి కేపీ ఓలీ ప్రసంగించారు.
''మా భూమిలో ఒక్క అంగుళం కూడా ఇతరుల ఆక్రమణలో ఉండటాన్ని మేం అనుమతించం. భారత్ వెంటనే అక్కడి నుంచి వైదొలగాలి'' అని అన్నారు. నేపాల్ కూడా సవరించిన మ్యాప్‌ను విడుదల చేయాలన్న సూచనను ఓలీ తోసిపుచ్చారు. ''మన భూభాగం నుంచి భారత్ సైన్యాన్ని ఉపసంహరించుకున్న తర్వాత ఆ విషయం గురించి మాట్లాడుకుందాం'' అని అన్నారు.
కాలాపానీని భారత మ్యాప్‌లో చూపించడంపై వారం రోజులుగా నేపాల్‌లో నిరసనలు జరుగుతున్నాయి. ఈ విషయంలో ఆ దేశ అధికార పార్టీతో పాటు, విపక్షాలు ఒకే అభిప్రాయంతో ఉన్నాయి. నేపాల్ విదేశాంగ శాఖ నవంబర్ 6న ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. కాలాపానీ నేపాల్‌లో భాగమని అందులో పేర్కొంది.
"కాలాపానీ ఒక వివాదాస్పద ప్రాంతం. దానిని ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. ఏకపక్ష తీర్మానాలు నేపాల్‌కు ఆమోదయోగ్యం కాదు. చారిత్రక దస్తావేజులు, సాక్ష్యాల ఆధారంగా, దౌత్యపరంగా ఈ అంశాన్ని పరిష్కరించుకోడానికి నేపాల్ కట్టుబడి ఉంది" అని తెలిపింది. అయితే, కొత్త మ్యాప్‌లో సరిహద్దులకు సంబంధించి ఎలాంటి సవరణలూ లేవని, కేవలం జమ్మూకశ్మీర్ విషయంలో వచ్చిన మార్పులను మాత్రమే చూపించామని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ చెప్పారు.
"కొత్త మ్యాప్‌లో నేపాల్‌తో భారత సరిహద్దులను సవరించలేదు. నేపాల్‌తో ఉన్న సరిహద్దు పరిమితులు ఇంతకు ముందున్న వ్యవస్థ ప్రకారమే ఉన్నాయి. మా మధ్య ఉన్న సన్నిహిత, స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలతో చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు కట్టుబడి ఉంటామని మరోసారి చెబుతున్నాం" అని అన్నారు.
"ఈ మ్యాప్‌ను మేం ఏకపక్షంగా ప్రచురించలేదు. ప్రతి ఏటా మేం మ్యాప్ విడుదల చేస్తుంటాం. 2018, లేదంటే అంతకు ముందు ఉన్న మ్యాప్‌లు చూడండి. కాలాపానీ భారత్‌లోనే కనిపిస్తుంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటిలానే.. దేశంలో కొత్త రాష్ట్రాలు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినపుడు మేం వాటిని మ్యాప్‌లో చూపించాల్సి ఉంటుంది" అని సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కుమార్ చెప్పారు.
''తాజా మ్యాప్ గతంలో ఉన్న వాటికంటే ఒక్క దగ్గర మాత్రమే వేరుగా ఉంది. జమ్మూకశ్మీర్ అక్టోబర్ 31న జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్ పేర్లతో రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారింది. ఆ ఒక్క తేడానే మ్యాప్‌లో చూపించాం. సరిహద్దుల్లో ఒక్క మిల్లీమీటర్ కూడా మారలేదు" అని అన్నారు. తాజా మ్యాప్‌లో పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని గిల్గిత్ బాల్టిస్తాన్‌తోపాటు మరికొన్ని భాగాలను కూడా భారత్ ఎప్పటిలానే తమవిగా చూపించుకుంది.
భారత్‌తో తాము శాంతినే కోరుకుంటున్నామని ఓలీ అన్నారు. ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని చెప్పారు. ''మా ప్రాంతం నుంచి విదేశీ సైనికులు వెనక్కి వెళ్లాలి. మా భూమిని రక్షించుకోవడం మా బాధ్యత. ఇంకొకరి ప్రాంతం మాకు అవసరం లేదు. మా పొరుగువారు కూడా మా ప్రాంతంలో ఉన్న సైనికులను వెనక్కి పిలిపించుకోవాలి'' అని ఓలీ అన్నారు.
''మ్యాప్‌ను సవరించి విడుదల చేయాలని కొందరు అంటున్నారు. మనం అలా చేయొచ్చు. కానీ, విషయం మ్యాప్ గురించి కాదు. మన భూమిని తిరిగి మనం తీసుకోవడం గురించి. మా ప్రభుత్వం ఆ భూమిని తిరిగి తీసుకుంటుంది. అందరం ఐకమత్యంగా ఈ అంశాన్ని లేవనెత్తాం. ఈ ఐకమత్యం చాలా అవసరం'' అని ఓలీ అన్నారు. ''ఒత్తిడి తెస్తే సమస్యలు పరిష్కారమైపోవు. ఈ వివాదాన్ని వాడుకుని కొందరు హీరోలు అవుదాం అనుకుంటున్నారు. ఇంకొందరు తమ అతి దేశభక్తిని చూపించాలని తహతహలాడుతున్నారు. కానీ, ప్రభుత్వం అలా చేయదు. మా భూమిలో ఒక్క ఇంచును కూడా ఎవ్వరినీ తీసుకోనివ్వం'' అని అన్నారు.
వివాదం ఏంటి?
కాలాపానీ ఉత్తరాఖండ్‌లోని పిథోరాగఢ్ జిల్లాలో ఉంది. దీని విస్తీర్ణం 35 చదరపు కి.మీ.లు. ఇక్కడ ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు దళం సిబ్బంది మోహరించి ఉన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం నేపాల్‌తో 80.5 కి.మీ.లు, చైనాతో 344 కి.మీ.ల పొడవున సరిహద్దు పంచుకుంటోంది. కాలీ నది పుట్టే ప్రాంతమే కాలాపానీ. భారత్ విడుదల చేసిన తాజా మ్యాప్‌లో ఈ నదిని కూడా చూపించారు.
1816లో ఈస్ట్ ఇండియాతో చేసుకున్న సుగౌలీ ఒప్పందం ప్రకారం కాలాపానీ, లిపు లేఖ్ తమకు చెందుతాయని నేపాల్ అంటోంది. 1962లో చైనాతో భారత్ యుద్ధం చేసినప్పుడు కాలాపానీని ఓ స్థావరంగా చేసుకుంది. ఈ యుద్ధానికి ముందు 1961లో కాలాపానీలో తాము జనాభా లెక్కలు చేపట్టినప్పుడు భారత్ అభ్యంతరం వ్యక్తం చేయలేదని నేపాల్ చెబుతోంది. కాలాపానీ భారత్‌లో ఉండటం సుగౌలీ ఒప్పందాన్ని ఉల్లంఘించడం అవుతుందని అంటోంది.
''చైనాతో యుద్ధం తర్వాత భారత్.. కాలాపానీ మినహా, నేపాల్ ఉత్తర బెల్టులో ఉన్న తమ సరిహద్దు పోస్టులన్నీ తొలగించింది. 2014లో భారత్-చైనా లిపు లేఖ్ ద్వారా ద్వైపాక్షిక వాణిజ్య కారిడార్ నిర్మించడానికి అంగీకరించుకున్నప్పుడు దీనిపై వివాదం మొదలైంది" అని నేపాల్ అధికారులు అంటున్నారు.