ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : ఆదివారం, 11 ఆగస్టు 2019 (11:24 IST)

కేరళ: తొమ్మిది జిల్లాల్లో రెడ్ అలర్ట్.. ‘నలభై ఏళ్ల తర్వాత ఇంత విధ్వంసం చూస్తున్నాం’

భారీ వరదల విధ్వంసాన్ని చవిచూసి ఏడాది గడిచిందో లేదో, కేరళలో మళ్లీ జల ప్రళయం వచ్చింది. ఉత్తర కేరళ - కోజికోడ్, వాయనాడ్, మలప్పుఱం ప్రాంతాలు దారుణంగా వరదల బారిన పడ్డాయి. శనివారం సాయంత్రం నాటికి 57 మంది వరదల వల్ల మరణించగా, వారిలో 19 మంది మలప్పుఱం ప్రాంతానికి చెందినవారే.

 
జిల్లా కంట్రోల్ రూమ్ వివరాల ప్రకారం ఎక్కువ మరణాలు కొండ చరియలు విరిగిపడడం (ల్యాండ్ స్లైడ్స్) వల్లే జరిగాయి. గత రెండు రోజుల్లో ఎనిమిది జిల్లాల్లో మొత్తం 80 చోట్ల కొండ చరియలు విరిగిపడ్డట్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ మీడియాకు ప్రకటించారు. మలప్పుఱం, కవలప్పర, మెప్పాడి, వాయనాడ్‌లలో ఎక్కువ ఘటనలు జరిగాయి.

 
కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు, అగ్నిమాపక శాఖ, స్వచ్ఛంద సేవకులు, మత్స్యకారులు కలసి చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. విధి నిర్వణలో ఉన్న కేరళ విద్యుత్ బోర్డు ఇంజినీరు బైజు ప్రాణాలు కోల్పోయారు. త్రిశ్సూర్ లోని పుణ్యారుకులంలో ఒక స్తంభం కూలడంతో బిజు మరణించినట్టు కేరళ విద్యుత్ మంత్రి ఎంఎం మణి సోషల్ మీడియాలో ప్రకటించారు.

 
దాదాపు 55 వేల కుటుంబాలకు చెందిన లక్షా 96వేల మందిని తరలించి 1,318 సహాయ శిబిరాల్లో ఉంచారు. ఒక్క కోజికోడ్ లోనే 287, వాయనాడ్ లో 197 క్యాంపులు ఉన్నాయి. మేం కన్నూరు జిల్లాలో పర్యటించాం. ఇక్కడ జిల్లా వ్యాప్తంగా 91 క్యాంపులు ఉన్నాయి. పావనూర్ ప్రాంతానికి చెందిన మయ్యిల్ గ్రామస్తులు ఉన్న క్యాంపును బీబీసీ బృందం సందర్శించింది. ఆ ఊరు మొత్తం వరదల్లో చిక్కుకుంది.

 
ఎక్కడి నుంచి వచ్చారంటూ మేరీ అనే ఒక వృద్ధురాలిని పలకరించగా, కన్నీటి పర్యంతం అయింది. "మా ఊరు మొత్తం నీటిలో ఉందిప్పుడు. మా అందరి ఇళ్లూ పోయాయి. మా కళ్ల ముందే వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. మేం ఏం చేయలేకపోయాం" అన్నారామె. చాలా మంది దగ్గర సహాయక శిబిరాల్లో ఇచ్చిన ఒకట్రెండు జతల బట్టలున్న సంచులు మాత్రమే ఉన్నాయి.

 
ఈ క్యాంపుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో వరద నీటితో మునిగిన, నీటిలో నానిన గుర్తులు కనిపించిన ఇళ్ళు ఉన్నాయి. నిన్నటి దాకా ఆకుపచ్చగా ఉన్న వరి చేలు, అరటితోటలు ఇప్పుడు వరద నీటిలో మునిగిపోయాయి. "ఇంత దారుణం మేమెప్పుడూ చూడలేదు. గతేడాది వరదల్లో మా కన్నూర్ జిల్లాలో పెద్ద ఇబ్బంది రాలేదు. కానీ ఈసారి అలా కాదు"అంటూ మునిగిపోయిన పంటవైపు దీనంగా చూస్తూ చెప్పారు పావనూరుకు చెందిన అశోక్ కుమార్. మరో రెండు రోజుల పాటూ భారీ వర్ష సూచనతో కన్నూరు జిల్లా రెడ్ అలర్ట్ మీదే ఉంది.

 
భారత వాతావరణ కేంద్ర హెచ్చరికల ప్రకారం ఉత్తర కేరళలోని తొమ్మిది జిల్లాలకు మరో రెండు రోజులు రెడ్ అలర్ట్ ఉంది. ఎర్నాకుళం, ఇదుక్కి, త్రిశ్శూర్, పాలక్కడ్,మలప్పుఱం, కోజికోడ్, వాయనాడ్, కన్నూరు, కస్సర్ గోడె జిల్లాలకు ఈ ముంపు పొంచి ఉంది. శనివారం వడకర, కోజికోడ్ లలో అత్యధికంగా 296 మిల్లీ మీటర్ల వాన కురిసింది.

 
నిజానికి కేరళలో గత వారంలో భారీ వర్షాలు కురిసాయి. కానీ జూన్ ఒకటి నుంచి ఆగస్టు 10 వరకూ ఉండే నైఋతి ఋతుపవనాలు ప్రకారం చూస్తే.. సాధారణం కంటే తక్కువ వానలే కురిపించాయి. గతేడాదితో పోల్చినా ఈ వానలు తక్కువే.

 
వాతావరణ శాఖ లెక్కల ప్రకారం సాధారణ వర్షపాతం 2515.73 మిల్లీ మీటర్లు కాగా, 2018లో 2039.6 మిల్లీ మీటర్ల వాన మాత్రమే కురిసింది. ఈ ఏడాది అయితే జూన్ 1 నుంచి ఆగస్టు 19 మధ్య సాధారణంగా 1527.2మిమీ సాధారణం కాగా, కేవలం 1406.82 మిమీ వాన మాత్రమే కురిసింది.

 
ఋతుపవనాలు, వర్షపాతం మారుతుండడంతో కేరళ ప్రజలు బాధలు పడుతున్నారు. కొండ చరియలు విరిగిపడ్డ ప్రాంతాల్లో ప్రజలను రక్షించేందుకు సహాయక చర్యలు జరుగుతున్నాయి.