శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 25 నవంబరు 2019 (14:20 IST)

మహారాష్ట్ర: ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రాజ్యాంగబద్ధంగానే జరిగిందా?

''రాజకీయాల్లో, క్రికెట్‌లో ఏ క్షణం ఏదైనా జరగొచ్చు''. మహారాష్ట్రలోని రాజకీయ పరిస్థితుల గురించి కొన్ని రోజుల క్రితం బీజేపీ సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్య ఇది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎం కాబోతున్నారన్న వార్త విని నవంబర్ 22 రాత్రి చాలా మంది నిద్రలోకి జారుకున్నాక, ఆయన చెప్పిన ఆ మాటలు నిజమయ్యాయి. తెల్లవారేసరికి బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు తోడుగా ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

 
సామాన్య ప్రజలే కాదు, చీమ చిటుక్కుమన్నా పసిగట్టగల బడా పాత్రికేయులు, రాజకీయ నాయకులు కూడా ఈ పరిణామాన్ని చూసి ఆశ్చర్యపోయారు. నెమ్మదిగా ఈ వ్యవహారం గురించి ఒక్కొక్కటిగా వార్తలు బయటకు వచ్చాయి. రాత్రికి రాత్రే అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని తెలిసింది. దీని తర్వాత మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను ఎత్తివేసే ప్రక్రియను గవర్నర్ మొదలుపెట్టారు. తెల్లవారు జామున పాలన అధికారాలను దేవేంద్ర ఫడణవీస్‌కు అప్పగించారు.

 
రాత్రికి రాత్రి కథ ఎలా మారింది?
ప్రభుత్వం ఏర్పాటు చేయగల బలం రాత్రికే రాత్రే ఒక పక్షం నుంచి మరో పక్షానికి మారడం ఆసక్తికర పరిణామం. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం, రాజకీయ క్రీడ మొత్తం నవంబర్ 22 సాయంత్రం మొదలైంది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ 54 మంది ఎమ్మెల్యేల సంతకాలు ఉన్న లేఖతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ దగ్గరికి వెళ్లారు. అనంతరం దేవేంద్ర ఫడణవీస్ గవర్నర్‌ను కలిసి, ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వమని కోరారు. తమకు ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న విషయాన్ని కూడా తెలియజేశారు.

 
ఆ తర్వాత ఈ అంశం దిల్లీకి చేరింది. తాజా పరిణామాలను కోశ్యారీ కేంద్రానికి తెలియజేశారు. ఇదే సమాచారం రాష్ట్రపతి భవన్‌కు చేరింది. శనివారం (నవంబర్ 23) ఉదయం 5.47కు రాష్ట్రపతి పాలన తొలగింపు గురించి కేంద్రం తెలియజేసింది. నవంబర్ 12న దీన్ని విధించారు. రాష్ట్రపతి పాలన తొలగింపుతో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఉదయం 7.30 గంటలకు రాజ్‌భవన్‌లో దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణ స్వీకారం చేశారు.

 
ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఏర్పడిందా?
రాత్రికే రాత్రే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తీరు రాజ్యాంగ విరుద్ధమని విపక్ష పార్టీలు అంటున్నాయి. ''మహారాష్ట్ర చరిత్రలో ఇదొక మచ్చ. అంతా హడావిడిగా చేసేశారు. ఇందులో ఎదో ఒక మతలబు ఉంది. ఇంతకంటే సిగ్గుపడే విషయం మరోటి ఉండదు'' అని కాంగ్రెస్ ఎంపీ అహ్మద్ పటేల్ వ్యాఖ్యానించారు.

 
పీటీఐ వార్తాసంస్థ కథనం ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రసాదించిన హక్కులు ఉపయోగించుకుని 2019, నవంబర్ 12న మహారాష్ట్రలో విధించిన రాష్ట్రపతి పాలనను నవంబర్ 23న తొలగించాలని ఆదేశిస్తున్నట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన ఆమోదపు లేఖలో రాసి సంతకం చేశారు. రాజ్యాంగం ప్రకారం చూస్తే, ఈ వ్యవహారంలో తప్పేమీ లేదని మహారాష్ట్ర రాజకీయాలను దగ్గరగా గమనించే రాజ్యాంగ నిపుణుడు ఉల్హాస్ భట్ అంటున్నారు.

 
''ఏ పక్షాన్నైనా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే హక్కు గవర్నర్‌కు ఉంది. ఏదైనా పక్షం తమ బలాన్ని నిరూపించుకోగలదని అనిపిస్తే గవర్నర్ ఆహ్వానం పంపుతారు. అయితే, గవర్నర్ కోశ్యారీ ఇదివరకే అవకాశం ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని బీజేపీ చెప్పింది. నైతికంగా చూస్తే మళ్లీ వారికి ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వడం తప్పు'' అని ఉల్హాస్ అన్నారు.

 
కేబినెట్ ఆమోదం ఎలా వచ్చింది?
రాష్ట్రపతి పాలనను తొలగించేందుకు కేబినెట్ ఆమోదం అవసరం. రాత్రికి రాత్రే కేబినెట్ ఆమోదం ఎలా వచ్చిందన్నది ఇక్కడ ఉదయిస్తున్న ప్రశ్న. కాంగ్రెస్ నాయకుడు రణ్‌దీప్ సుర్జేవాలా పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి ఇదే అంశాన్ని లేవనెత్తారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. 'అలకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్'లోని రూల్ నెం.12 కింద ఈ నిర్ణయం తీసుకున్నామని, న్యాయపరంగా ఇది పూర్తి సమ్మతమైన చర్యేనని ఆయన అన్నారు.

 
అత్యవసర పరిస్థితుల్లో (ఎక్స్‌ట్రీమ్ ఎమర్జెన్సీ), ఊహకు అందని సంకట పరిస్థితి ఏర్పడే అవకాశాలు (అన్‌ఫోర్సీన్ కాంటిజెన్సీ) ఉన్నప్పుడు ప్రధానికి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందని రూల్ నెం.12 చెబుతుంది. ''రాష్ట్రపతి ఏ నిర్ణయమైనా, కేబినెట్ అనుమతితోనే తీసుకుంటారని రాజ్యాంగం చెబుతుంది. ఈ వ్యవహారానికి సంబంధించి కేబినెట్ సమావేశం జరిగిందా అన్నదానిపై స్పష్టత లేదు. నిబంధనల ప్రకారం ప్రధాని ఒక్కరే ఆమోదం తెలిపినా, దాన్ని కూడా కేబినెట్ ఆమోదంగా పరిగణిస్తారు'' అని ఉల్హాస్ అన్నారు.

 
మహారాష్ట్రలో సాగిన రాజకీయ నాటకంలో గవర్నర్ పోషించిన పాత్రపై కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎన్సీపీలోని ఏయే ఎమ్మెల్యేలు ఫడణవీస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ లేఖలు పంపారు? దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని వచ్చినప్పుడు, తెల్లవారే దాకా గవర్నర్ ఎందుకు వేచి చూడలేదు?

 
అమిత్ షా ప్రయోజనాల కోసమే గవర్నర్ పనిచేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఉల్హాస్ భట్ కూడా ఈ వాదనతో ఏకీభవిస్తున్నారు. ''ప్రజాప్రయోజనార్థం పనిచేస్తానని గవర్నర్ ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ, వాస్తవం అలా కాదు'' అని ఆయన అన్నారు. గవర్నర్ పదవి ప్రధాని అభీష్టం మీద ఆధారపడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వమే వారిని నియమిస్తుంది కాబట్టి, వారు కూడా కేంద్రానికి అనుకూలంగా నడుచుకుంటుంటారు. ఇందిరాగాంధీ కాలం నుంచి ఉన్న పరిస్థితే మోదీ హయాంలోనూ కొనసాగుతోంది.

 
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్సీపీలోని అత్యధిక మంది ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని శరద్ పవార్ అంటున్నారు. బీజేపీ బలాన్ని నిరూపించుకోగలదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ''సంతకాలు చేసిన ఎమ్మెల్యేలందరినీ రాజ్‌భవన్‌లో హాజరుపరచాలని దేవేంద్ర ఫడణవీస్‌ను గవర్నర్ అడగాల్సింది. ఇలాంటి తీరే ప్రశ్నలు తలెత్తేందుకు కారణమవుతుంది'' అని ఉల్హాస్ భట్ అన్నారు.

 
ఫడణవీస్ ప్రమాణ స్వీకారం అంశం ఇప్పుడు సుప్రీం కోర్టుకూ చేరింది. ఫడణవీస్, అజిత్ పవార్‌ల ప్రమాణ స్వీకారాలను సవాలు చేస్తూ శివసేన పిటిషన్ వేసింది. ఆ రాత్రి ఎన్ని నియమాలను కేంద్రం పాటించింది, వేటిని పాటించలేదు అన్నది ఇక సుప్రీం కోర్టు తేలుస్తుంది.