మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 4 మే 2020 (16:51 IST)

కరోనావైరస్: కమ్యూనిటీ కేసులు లేవని ప్రకటించి లాక్‌డౌన్ సడలించిన న్యూజీలాండ్

కరోనావైరస్‌ను సమర్థంగా తరిమేశామని, తమ దేశంలో కోవిడ్-19 కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ లేదని న్యూజీలాండ్ ప్రకటించింది. “గత కొద్ది రోజులుగా నమోదవుతున్న కరోనా కేసులు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి, ఆదివారం ఒకే కేసు నమోదైంది, ప్రస్తుతానికి వైరస్‌ను తరిమికొట్టాం’ అని న్యూజీలాండ్ ప్రధాన జసిండా ఆర్డర్న్ చెప్పారు.

 
అయితే, దీనిపై ఏమాత్రం నిర్లక్ష్యం వద్దని, ప్రధాని అలా చెప్పినంత మాత్రాన కరోనావైరస్ పూర్తిగా అంతమైనట్లు అనుకోకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. కఠిన స్థాయిలో విధించిన సామాజిక నిబంధనలను ఎత్తివేసే కొన్ని గంటల ముందు న్యూజీలాండ్ ప్రధాని ఈ ప్రకటన చేశారు.

 
న్యూజీలాండ్‌లో మంగళవారం నుంచి వైద్య, విద్యా కార్యక్రమాలతోపాటు కొన్ని సాధారణ వ్యాపార కార్యకలాపాలు కూడా తిరిగి ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దేశంలో కొత్తగా 15 కేసులు, ఒక మరణం సంభవించింది. కానీ, దేశంలోని చాలామంది అన్ని రకాల సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, ఇప్పటికీ ఇళ్లలోపలే ఉండాల్సి ఉంటుంది.

 
“మేం ఆర్థిక వ్యవస్థను తెరుస్తున్నాం. ప్రజల సామాజిక జీవితాలను కాదు” అని ప్రధాని ఆర్డెర్న్ చెప్పారు. ఆదివారం నాటికి న్యూజీలాండ్‌లో కరోనావైరస్ కేసుల సంఖ్య 1500 లోపే ఉంది. 20 మరణాలు నమోదయ్యాయి. “గత కొన్ని రోజులుగా కొత్త కేసులు సంఖ్య తగ్గిపోయాయి. దాన్ని తరిమికొట్టాలనే మా లక్ష్యాన్ని చేరుకున్నామని అది మాలో ఆత్మవిశ్వాసం నింపింది” అని న్యూజీలాండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ యాష్లే బ్లూంఫీల్డ్ అన్నారు.

 
“వైరస్‌ను తరిమికొట్టినంత మాత్రాన కొత్త కేసులు ఉండవని కాదు. కానీ ఇప్పుడు కొత్త కేసులు ఎక్కడినుంచి వస్తున్నాయో మాకు తెలిసిపోతుంది” అన్నారు. “కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ విస్తృతంగా జరిగినట్లు న్యూజీలాండ్‌లో ఎక్కడా గుర్తించలేదు. మేం యుద్ధం గెలిచాం. కానీ దాన్ని అలాగే ఉంచేలా మనం అప్రమత్తంగా ఉండాలి” అని ప్రధాని ఆర్డెర్న్ చెప్పారు.

 
మహమ్మారి పూర్తిగా వ్యాపించకముందే, దేశంలో కేసులు పదుల సంఖ్యలో ఉండగానే న్యూజీలాండ్ ప్రపంచంలోనే అత్యంత కఠిన ప్రయాణ ఆంక్షలు విధించింది. సరిహద్దులను మూసివేసిన ప్రభుత్వం, దేశంలోకి వచ్చేవారందరినీ క్వారంటైన్‌కు తరలించింది. కఠినమైన లాక్‌డౌన్‌తోపాటూ విస్తృత పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్ ఆపరేషన్లు నిర్వహించింది.

 
న్యూజీలాండ్‌లో మార్చి 26న బీచ్‌లు, ఓడ రేవులు, క్రీడామైదానాలు, కార్యాలయాలు, స్కూళ్లు మూసివేశారు. బార్లు, రెస్టారెంట్లు మూతవేశారు. ఫుడ్ డెలివరీలను కూడా అడ్డుకున్నారు. “త్వరగా లాక్‌డౌన్ విధించకుండా ఉంటే న్యూజీలాండ్‌లో రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదై ఉండేవి. అలా ఎంత నష్టం జరిగుండేదో దేశం ఊహించడమే కష్టం. కానీ మా సమష్టి చర్యలతో జరగబోయే ఘోరాన్ని తప్పించాం” అని ప్రధాని చెప్పారు.

 
కరోనా మహమ్మారి వ్యాపించిన సమయంలో మారుమూల ఉండడం, సులభంగా మూసివసే సరిహద్లులు కలిగి ఉండడం న్యూజీలాండ్‌కు లాభించాయని నిపుణులు చెబుతున్నారు. కానీ, సంక్షోభ సమయంలో తమ సందేశాన్ని ప్రజల్లోకి చాలా స్పష్టంగా తీసుకెళ్లగలిగినందుకు న్యూజీలాండ్ ప్రభుత్వాన్ని కూడా ప్రశంసిస్తున్నారు.

 
“స్థానిక కాలమానం ప్రకారం సోమవారం అర్థరాత్రి నుంచి న్యూజీలాండ్ నాలుగో స్థాయి లాక్‌డౌన్ నుంచి మూడో స్థాయికి వెళ్తుంది. అంటే దేశంలో రెస్టారెంట్లు, టేకవేలతోపాటూ ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ ఉండని చాలా వ్యాపారాలు మళ్లీ తెరుచుకుంటాయి. జనం ఆరు అడుగుల దూరాన్ని కొనసాగించాలని న్యూజీలాండ్ ప్రజలకు సూచించారు. ఎక్కువమంది గుమిగూడే కార్యక్రమాలపై ఆంక్షలు కొనసాగుతాయి. షాపింగ్ కాంప్లెక్సులు మూసి ఉంటాయి. చాలా మంది పిల్లలు స్కూళ్లకు వెళ్లడం కుదరదు. న్యూజీలాండ్ సరిహద్దులు మూసివేత కొనసాగుతుంది.

 
ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది?
ఆస్ట్రేలియాలో కూడా కరోనా కేసులు సంఖ్య గత కొన్ని వారాల నుంచీ తగ్గింది. ఆదివారం దేశంలో 16 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. కరోనా సంక్షోభంపై న్యూజీలాండ్ ప్రభుత్వం స్పందించిన తీరును చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఒపీనియన్ పోల్స్ లో ఆ దేశ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం పెరిగినట్లు కూడా కనిపించింది.

 
న్యూజీలాండ్‌లో కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలను సడలించారు. కొన్ని రాష్ట్రాలు బహిరంగ కార్యక్రమాలను అనుమతించేందుకు సామాజిక దూరం నియమాలను కూడా సడలించాలని భావిస్తున్నాయి. శనివారం నుంచి క్వీన్స్ లాండ్‌లో బట్టలు కొనుగోలు చేయడానికి, ఇంటి నుంచి 40 నిమిషాల దూరంలో పిక్నిక్, పార్క్, బీచ్‌కు వెళ్లడానికి స్థానికులను అనుమతిస్తున్నారు.

 
దక్షిణ ఆస్ట్రేలియాలోలాగే పశ్చిమ ఆస్ట్రేలియా కూడా గతంలో బయటి కార్యక్రమాల్లో ఇద్దరు కలిసేందుకు మాత్రమే ఉన్న పరిమితిని పది మందికి పెంచారు. అయితే, ముఖ్యమైన పనులు, షాపింగ్, వ్యాయామం లాంటివి ఉంటే తప్ప, ఎక్కువ మంది ఆస్ట్రేలియన్లు ఇంటి పట్టునే ఉండాల్సి వస్తోంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం కరోనావైరస్ కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్‌ను విడుదల చేసిన కొన్ని గంటల్లోనే దేశంలో పది లక్షల మందికి పైగా దానిని డౌన్లోడ్ చేసుకున్నారు.

 
కోవిడ్-19 పాజిటివ్ అయిన ఒక యూజర్ దగ్గర ఈ యాప్ ఉన్న మరొకరు 15 నిమిషాలకంటే ఎక్కువ సమయం ఉంటే అది వారిని హెచ్చరిస్తుంది. ఇరు దేశాల మధ్య రాకపోకలు ప్రారంభించాలని కూడా ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.