శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 17 ఆగస్టు 2024 (12:03 IST)

నుసంతారా: మునిగిపోతున్న రాజధానికి బదులుగా అడవిలో నిర్మిస్తున్న ఈ మహానగరం ఎలా ఉంటుంది?

malaysia
ప్రపంచంలోనే అత్యంత వేగంగా మునిగిపోతున్న నగరం ఇండోనేషియా రాజధాని జకార్తా. అందుకే ఆ దేశం అడవి మధ్యలో కొత్త రాజధాని నగరం నిర్మించే పని పెట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును త్వరలో పదవీ విరమణ చేయనున్న ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో మానసపుత్రికగా చెబుతారు. ఈ కొత్త రాజధాని నగరం గురించి 2019లో తొలిసారి ప్రకటన చేశారు. 2022 మధ్యలో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే కొత్త రాజధాని నగరం మొదటి దశ పనులు పూర్తి చేసుకుని సిద్ధం కానుంది. కొద్దివారాల్లోనే కొంతమంది నగరానికి తరలివచ్చేలా ప్రణాళికలను సిద్ధం చేశారు.
 
''నుసంతారా నగరం భవిష్యత్తుకి రాజధాని. రాజధాని నగరాన్ని, తొలి ఇటుక నుంచి నిర్మించుకునే అవకాశం, సామర్థ్యం అన్ని దేశాలకూ ఉండదు.'' అని అధ్యక్షుడు విడోడో గత వారం నూతన రాజధాని నగరంలో జరిగిన తొలి కేబినెట్ భేటీ సందర్భంగా అన్నారు. 1600లలో డచ్ వలసరాజ్యంగా ఉన్నప్పటి నుంచి ఇండోనేషియాకు జకార్తా రాజధానిగా ఉంటూ వచ్చింది. అత్యంత రద్దీ నగరాల్లో ఒదొకటి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా మునిగిపోతున్న నగరంతో పాటు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన నగరాల్లోనూ దీనికి చోటుంది. ఈ మహానగరంలోని 40 శాతం భూభాగం, దాదాపు కోటి 5 లక్షల మంది జనాభా నివసిస్తున్న ప్రాంతం సముద్ర మట్టానికి దిగువన ఉంది.
 
మునక ప్రమాదం ముంచుకొస్తుండటంతో కొత్త రాజధాని దిశగా 2019 నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇండో నేషియా. ఆధునిక నగరాల్లోని అన్ని సదుపాయాలతో పాటు ప్రకృతితో సమ్మిళితమైన గ్రీన్, హైటెక్ సిటీగా నుసంతారాను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నగర విస్తీర్ణంలో 60 శాతానికి పైగా వాకింగ్ ట్రాక్‌లు, బైక్ ట్రాక్‌లతో కూడిన హరిత ప్రదేశాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచించారు. అయితే, ఇప్పటికి ఈ నగరం నిర్మాణ దశలోనే ఉంది. బీబీసీ ఇటీవల ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు వేలమంది కార్మికులు నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ట్రక్కులు, ఎక్స్‌కవేటర్ల పనులతో రహదారి వెంట దుమ్ము మేఘాలు అలుముకున్నాయి.
 
ఈ ప్రాజెక్టును ఐదు దశలుగా విభజించారు. మొదటి దశ పనులు ఆగస్టులో దేశ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి పూర్తి కావాల్సి ఉంది. కానీ, ఆలస్యమై ఈ ఏడాది చివరికి పూర్తయ్యేలా కనిపిస్తున్నాయి. ''మేం ట్రాక్‌లోనే ఉన్నాం. పనులు అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి'' అని నిర్మాణ పనులను సందర్శించేందుకు వెళ్లినప్పుడు నుసంతారా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్ డానిస్ సుమదిలాగ బీబీసీతో చెప్పారు. మొదటి దశ పనులు 90 శాతం పూర్తయినట్లు ఆయన తెలిపారు. ''మేం ఆగస్టులోనే ఎలాగైనా పనులు పూర్తి చేయాలని చేసుకుపోవడం లేదు. ఇది అభివృద్ధి పనుల్లో భాగం, దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్న పనులు ఇవి'' అన్నారాయన. పనుల్లో పురోగతి ఉన్నప్పటికీ, ప్రతిష్టాత్మకమైన ఈ మెగా ప్రాజెక్టుపై ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి.
 
కొత్త రాజధాని నగర నిర్మాణానికి 33 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2.77 లక్షల కోట్లు) ఖర్చవుతుంది. అందులో ఐదో వంతు మాత్రమే భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మిగిలిన నిధులను ప్రైవేటు పెట్టుబడుల ద్వారా ఆకర్షించేందుకు కష్టపడుతోంది. కొత్త నగరంలో పెట్టుబడి పెట్టేలా ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు 190 ఏళ్ల వరకూ భూమి హక్కులతో సహా పలు ప్రోత్సాహకాలను అధ్యక్షుడు విడోడో ప్రకటించారు. గత ఏడాది నవంబర్‌లో, భారత్‌లో జరిగిన జీ20 సదస్సుతో సహా అనేకమంది వివిధ దేశాధినేతలతో నుసంతారా నగర ప్రస్తావన తీసుకొచ్చినప్పటికీ, ఇప్పటివరకూ ఆ దిశగా కీలక ఒప్పందాలేవీ జరగలేదు.
 
''80 శాతం ప్రైవేటు పెట్టుబడులపై ఆధారపడడమనేది ఇబ్బందికరమైన విషయం. పెట్టుబడిదారులు ఆర్థిక పరిస్థితులు, సాధ్యాసాధ్యాలు, నిరంతర అభివృద్ధి వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు.'' అని మొనాష్ యూనివర్సిటీ అర్బన్ డిజైన్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌ ఎకా పెర్మానసరి అన్నారు. అనేకమంది విదేశీ పెట్టుబడిదారుల పెట్టుబడి ప్రణాళికలు వివిధ దశల్లో ఉన్నాయని ప్లానింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ్ నుసంతారా అథారిటీ డిప్యూటీ హెడ్ అగుంగ్ వికాక్సోనో తెలిపారు. ''మౌలిక సదుపాయాలు సిద్ధమై, జనం రావడం మొదలైతే తమకు మార్కెట్ ఏర్పడుతుందని వారు భావిస్తున్నారు. అయితే, అప్పటి వరకూ వాళ్లు వేచివుండరు. పని జరుగుతోంది.'' అని వికాక్సోనో చెప్పారు. ఇప్పుడు ఆయన బృందం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. దాని ప్రకారం ప్రభుత్వం పెట్టుబడుల్లో భాగస్వామిగా ఉండడంతో పాటు నష్టాలనూ పంచుకుంటుంది. ఈ ప్రాజెక్టును కొనసాగిస్తుంది.
 
అడవిలో హైటెక్ నగరం
ఈ కొత్త రాజధాని నగరం జావా ద్వీపంలో ఉన్న ప్రస్తుత రాజధాని జకార్తాకి 12 వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. వరదలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాల ప్రమాదం తక్కువగా ఉండే బోర్నియో ఐల్యాండ్ (మూడు దేశాలు మలేషియా, ఇండోనేషియా, బ్రూనైలలో విస్తరించి ఉన్న ద్వీపం)లోని ఈస్ట్ కాలిమంతన్‌ అటవీ ప్రాంతంలో ఈ కొత్త నగరం నిర్మితమవుతోంది. భౌగోళికంగా ఇండోనేషియాలో వ్యూహాత్మక ప్రాంతంలో ఈ నుసంతారా ఉంది. జావా ద్వీపానికి, జకార్తాకి దూరంగా ఉన్న ఈ నగరం కోసం, విస్తారమైన ద్వీపసమూహం(17,500 ద్వీపాలు)లోని సంపద, వనరులు అన్ని ప్రాంతాలకూ పంపిణీ జరిగేలా అత్యంత జాగ్రత్తగా రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశారు.
 
ఇండోనేషియా జాతీయ ఆర్థిక వ్యవస్థలో 60 శాతా వాటా అత్యంత జనసాంద్రత కలిగిన జావా ద్వీపానిదే. ''ఇప్పటి వరకూ అభివృద్ధి అంతా జావా చుట్టూనే కేంద్రీకృతమై ఉంది, అందువల్ల రాజధాని నగరాన్ని జావాకి దూరంగా దేశంలోని మధ్యభాగానికి తరలించడంపై సానుకూల వాతావరణం ఉంది.'' అని అర్బన్ ఎక్స్‌పర్ట్ ఎకా పెర్మానసరి చెప్పారు. ఈ మెగా ప్రాజెక్ట్ సుమారు 1000 చదరపు మైళ్ల మేర విస్తరించి ఉంది. జకార్తా కంటే నాలుగు రెట్లు, న్యూయార్క్ నగరం కంటే రెండు రెట్లు ఎక్కువ ఉంటుంది. అయితే, ప్రణాళికల నాటి నుంచే ఈ ప్రాజెక్టుపై పర్యావరణవేత్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నూతన నగర నిర్మాణంతో పర్యావరణం దెబ్బతింటుందని, అంతరించిపోతున్న జంతుజాతులైన ఒరంగుటాన్లు, పొడవాటి ముక్కు ఉండే కోతుల ఆవాస ప్రాంతాలు తగ్గిపోతాయని అంటున్నారు.
 
కానీ, ప్రభుత్వం ఈ ఆందోళనలను కొట్టిపారేస్తోంది. గతంలో యూకలిప్టస్ తోటలున్న భూముల్లో నుసంతారా నిర్మిస్తున్నామని, ఈ తోటల వల్ల భవిష్యత్తులో పర్యావరణానికి ప్రమాదముందని పర్యావరణవేత్తలే గతంలో వాదించారని ప్రభుత్వం అంటోంది. ఈ నగరం రెన్యువబుల్ ఎనర్జీ ఆధారితమని, స్మార్ట్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ కూడా ఉంటుందని అధికారులు అంటున్నారు. కొత్త రాజధానిలో ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. 2045 నాటికి జీరో కార్బన్ ఎమిషన్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించినట్లయితే, పర్యావరణపరంగా ఇండోనేషియా తమ జాతీయ లక్ష్యాన్ని 15 ఏళ్ల ముందే చేరుకున్నట్లు అవుతుంది.
 
నివాసం ఉండేది ఎవరు?
నుసంతారాలో నివాసం ఉండబోయేవారితో సహా ఇండోనేషియన్లలో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. పరిపాలనా నగరంలో 2045 నాటికి 19 లక్షల మందికి నివాసం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వీరిలో ఎక్కువ మంది ప్రభుత్వ అధికారులు, వారి కుటుంబాలు. మొదటి విడతలో భాగంగా సెప్టెంబర్‌లో సుమారు 10 వేలమంది న్యూ సంతారాకు వస్తారని భావిస్తున్నారు. తమ వివరాలు వెల్లడించకూడదన్న షరతుతో బీబీసీతో మాట్లాడడానికి అంగీకరించిన కొందరు అధికారులు, నుసంతారాకు వెళ్లడానికి తమ అయిష్టతను తెలియజేశారు. ''మౌలిక సదుపాయాలు లేవు. మా పిల్లలను స్కూల్‌కి ఎక్కడికి పంపించాలి? ఇతర సదుపాయాలన్నీ అందుబాటులో ఉన్నాయా, ఎంటర్‌టైన్‌మెంట్ సంగతేంటి ?'' అని ఓ వ్యక్తి బీబీసీతో అన్నారు.
 
అక్కడికి ఒంటరిగా వెళ్లాలనుకుంటున్న మరో అధికారి, ఇతరులతో కలిసి ఒక ఫ్లాట్‌లో ఉండాల్సిరావడం గురించి ఆందోళన చెందుతున్నారు. నుసంతారాలో ప్రస్తుతం నిర్మిస్తున్న నివాస భవనాల్లో అన్నీ మూడు పడక గదుల ఇళ్లే. ఉంటే కుటుంబం, లేకపోతే ఇతరులతో కలిసి ఉండాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అయితే, తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామని నుసంతారా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన స్థానికులు చెబుతున్నారు. గవర్నమెంట్ జోన్ కారణంగా ఇప్పటికే వంద మంది నిర్వాసితులయ్యారు. రోడ్ల నిర్మాణం, నూతన విమానాశ్రయం కారణంగా మరింత మంది నిర్వాసితులుగా మారుతారనే ఆందోళనలు పెరిగాయి.
 
తమ సాంస్కృతిక గుర్తింపుకి ముప్పుగా మారిన పట్టణీకరణ గురించి ఇక్కడికి సమీప గ్రామంలో నివసించే కొందరు ఆందోళన చెందుతున్నారు. 2019లో రాజధాని తరలింపు ప్రకటన చేసినప్పటి నుంచి నుసంతారా ఉన్న పెనాజామ్ పాసర్ రీజెన్సీలో జనాభా పెరుగుదల కనిపించింది. ''మా గ్రామాన్ని పునర్నిస్తామని, పర్యాటక ప్రాంతంగా మారుస్తామని హామీ ఇచ్చారు. కానీ అవి ఒట్టి హామీలు అవుతాయేమోనని భయంగా ఉంది. మా ఇళ్లు అలాగే ఉంటాయనేందుకు ఎలాంటి భరోసా లేదు'' అని పాండి అనే వ్యక్తి అన్నారు. ఇది, స్థానికులను పట్టించుకోకుండా....కేవలం ఉన్నతవర్గాల కోసం నిర్మించిన ప్రత్యేక నగరంగా నుసంతారా మారొచ్చనే అభిప్రాయం కూడా ఏర్పడొచ్చని ఎకా పెర్మనసారి అభిప్రాయపడ్డారు. వాళ్లు కేవలం ప్రేక్షకులుగా మారుతున్నారు. ఇక్కడ వస్తున్న భవనాలు, జనాన్ని చూస్తున్నారు. ప్రత్యేకమైన నగరాన్ని నిర్మిస్తే, అది కూడా జకార్తా మాదిరిగా సామాజిక, ఆర్థిక అసమానతలకు కారణమవుతుంది'' అని ఆమె అన్నారు.