శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 5 ఆగస్టు 2023 (20:36 IST)

తోలుబొమ్మలాట: అంతరించిపోతున్నఈ కళను నిమ్మలకుంట దళవాయి వంశస్థులు ఎలా కాపాడుతున్నారంటే?

image
తోలుబొమ్మలాట అనే మాట కూడా బహుశా ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. పాతతరం వారికి వినోదం అందించిన తోలుబొమ్మలాట ఇప్పుడు ఒక అంతరించిపోతున్న కళ. అయితే, తోలుబొమ్మలాట కళాకారుల కుటుంబాలు ఈ కళను ప్రపంచానికి కొత్తరూపంలో పరిచయం చేస్తున్నాయి. వాటి ద్వారా జీవనోపాధి పొందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామంలో ఈ తోలుబొమ్మలాట కళాకారుల కుటుంబాలు స్థిరపడ్డాయి.
 
నిమ్మలకుంటలో ఇప్పుడు దాదాపు 150 కుటుంబాలు నివసిస్తున్నాయి. వారి జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది. శతాబ్దాల క్రితం మహారాష్ట్రలో తోలుబొమ్మలు ఆడిస్తూ జీవించిన తమ కుటుంబాలు మొగలుల దాడులతో ఆంధ్రకు వలస వచ్చాయని వారు చెప్పారు. ఏళ్ల పాటు సంచార జీవితం గడిపి చివరకు నిమ్మలకుంటలో స్థిరపడినట్లు వారు వెల్లడించారు. ఈ కళాకారుల కుటుంబాలు కాలంతోపాటు మారుతూ తోలు బొమ్మల ద్వారానే జీవనోపాధి పొందుతున్నాయి.
 
తోలుబొమ్మలంటే ఏంటి...
పశువుల చర్మాల మీద పురాణ పాత్రల చిత్రాలు వేసి వాటికి రంగులు అద్ది, కత్తిరించిన తరవాత వాటికి తాళ్లు కట్టి ఆడించడమే తోలుబొమ్మల ఆట. ఎక్కువగా రామాయణం, మహాభారతానికి సంబంధించిన పాత్రలతో ఈ తోలుబొమ్మలు తయారు చేస్తారు. పురాతన సంగీత వాయిద్యాలను వాయిస్తూ పాట, శ్లోకాలు, పద్యాలు, సంభాషణల ద్వారా కథను చెబుతూ వాటిని తెల్లని తెర వెనుక దీపం కాంతిలో ఆడించేవారు.
 
గృహోపకరణాలుగా తోలుబొమ్మలు
తోలుబొమ్మలాట అంతరించి దశాబ్దాలు గడిచిపోయినా, దానిని ఇప్పటికీ సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు నిమ్మలకుంటలోని దళవాయి వంశానికి చెందిన కళాకారులు. ఇప్పుడు తోలుబొమ్మల ప్రదర్శనలు లేకపోయినా, వాటిని ఈ తరానికీ గుర్తుండిపోయేలా తమ వంతు కృషి చేస్తున్నామని దళవాయి కుల్లాయప్ప చెప్పారు. ‘‘తోలుబొమ్మలను ప్రదర్శించడమే కాదు, వాటిని తయారు చేయడం కూడా ఒక కళే. శ్రీరాముడు ఇలాగే ఉంటాడు అనుకుని మొదట ఒక చిత్రం వేసుకోవాలి. దానికి తర్వాత రంగులు అద్దుతాం. తోలుబొమ్మలు అంటే ఆడించేవి మాత్రమే అనుకుంటారు. కానీ, వీటిని ఇళ్లలో అలంకరించుకోవచ్చు. గృహోపకరణాలుగా కూడా ఉపయోగించడానికి వీలుగా మేం తోలుబొమ్మలు తయారు చేస్తున్నాం. అలా మా కళ కొనసాగుతుంది’’ అని కుల్లాయప్ప చెప్పారు.
 
తోలుబొమ్మలను తయారు చేసి విక్రయించడం ద్వారా ప్రస్తుతం వీరు ఆదాయం పొందుతున్నారు. భారతదేశంలోని దాదాపు 600 హస్తకళల్లో తోలుబొమ్మలాట మొదటి పది కళల్లో ఒకటిగా ఉంటుంది. ప్రస్తుతం నిమ్మలకుంటలో ఉంటున్న 150 కుటుంబాల్లో ఎంతోమంది జాతీయ అవార్డులు కూడా అందుకున్నారని కుల్లాయప్ప తెలిపారు. ‘‘దేశంలోని 600 హస్తకళల్లో టాప్ టెన్‌లో తోలుబొమ్మలు ఉంటాయి. ఇక్కడ 150 కుటుంబాలు దీనిపైన ఆధారపడి బతుకుతున్నాయి. అలాగే దాదాపుగా నాతోపాటు 12 మందికి జాతీయ అవార్డులు వచ్చాయి. మా పెదనాన్నకు పద్మశ్రీ వచ్చింది.
 
నేను మలేసియాలో యునెస్కో అవార్డు తీసుకున్నా. వియత్నాం యూనివర్సిటీలో డాక్టరేట్ తీసుకున్నా. ఇలా చాలామంది అవార్డ్స్ తీసుకున్నారు. అంత ప్రముఖమైన తోలుబొమ్మల కళను ఇప్పుడు గృహోపకరణాలుగా అందిస్తున్నాం’’ అని కుల్లాయప్ప చెప్పారు. ప్రస్తుతం ప్రాచీన జానపద కళలను ఆదరించే పరిస్థితి లేదని అందుకే కాలానికి తగినట్లు తాము కూడా మారామని కుల్లాయప్ప చెప్పారు. ‘‘గత 15, 20 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు జీవనశైలి మారింది. టెక్నాలజీ వచ్చింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ఎన్నో రకాల ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలు ఉన్నాయి. ఇప్పడు ప్రాచీన కళలను ఆదరించే పరిస్థితి లేదు.
 
పెద్దపెద్ద ఈవెంట్లలో జానపద కళను చూడాలనుకుంటే తప్ప, ఎక్కడా తోలుబొమ్మలాట ప్రదర్శించే పరిస్థితి లేదు. నిజానికి ఈ తోలు బొమ్మలను హాండీక్రాఫ్ట్‌గా మార్చుకుని అమ్ముకోకపోతే మేం కూడా దాన్ని వదిలేయాల్సిన పరిస్థితి. అందుకే తోలుబొమ్మలను గృహోపకరణాలుగా మార్చేశాం. వీటివల్లే ఇప్పుడు మాకు చాలా గుర్తింపు వస్తోంది. వీటిని అమ్ముకోవడం వల్లనే జీవనం కొనసాగిస్తున్నాం’’ అని ఆయన చెప్పారు.
 
జంతువుల చర్మాలపై చిత్రాలు
తమ పూర్వీకులు వేటకు వెళ్లి చంపి తీసుకొచ్చిన జంతువుల చర్మాలపై చిత్రాలు రూపొందించి తోలుబొమ్మలాటను ప్రదర్శిస్తే... ఇప్పుడు తాము చర్మాలు కొనుగోలు చేసి, వాటిని గృహోపకరణాలుగా మారుస్తున్నామని కుల్లాయప్ప చెప్పారు. “మేం కొన్ని విధానాలు మార్చుకొని ఇంకా త్వరగా, మంచి నాణ్యత ఉండేలా తోలుబొమ్మలు తయారు చేస్తున్నాం. అప్పుడూ, ఇప్పుడూ మా తోలుబొమ్మల తయారీలో మేం ఎలాంటి మెషీన్లను వాడటం లేదు. చర్మం క్లీన్ చేయడంలో మా పూర్వీకుల పద్ధతినే మేం అనుసరిస్తున్నాం. అప్పట్లో సహజ సిద్ధమైన రంగులు వాడేవాళ్లు. ఇప్పుడు సహజసిద్ధ రంగులకు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకులు వాడుతున్నాం తప్ప పెద్దగా మార్పులు చేయడం లేదు’’ అని ఆయన వివరించారు. ఒక తోలుబొమ్మ తయారీ ఎలా ఉంటుందో దళవాయి చలపతి చెప్పారు. దళవాయి చలపతి తోలుబొమ్మలపై చిత్రాలు గీయడంలో సుప్రసిద్ధులు. కేంద్రప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
 
‘‘మొదట మేక చర్మం తీసుకొచ్చాక, దాన్ని కట్ చేసి వేడి నీళ్లలో వేసి, దానిపై ఉన్న వెంట్రుకలన్నీ తీసేసి, మా దగ్గరున్న కత్తులతో దానిని శుభ్రం చేస్తాం. అప్పుడు అది ఒక తడిబట్టలా ఉంటుంది. తర్వాత ఆ చర్మానికి చిన్న చిన్న రంధ్రాలు పెట్టి ఒక ఫ్రేమ్‌లో గట్టిగా తాడుతో లాగి కట్టేస్తాం. అలా మూడు రోజుల తర్వాత చర్మం ఒక షీట్‌లాగా తయారవుతుంది. తర్వాత దాన్ని కావాల్సిన ఆకారంలో కత్తిరిస్తాం. తోలుపై సూది లేదా పెన్సిలుతో రఫ్ స్కెచ్ వేశాక వెదురు పుల్లను పెన్నులా తయారు చేసి ఇంక్‌లో ముంచి బొమ్మ వేస్తాం. తర్వాత హోల్స్, కార్వింగ్ చేస్తాం. తర్వాత రంగులు నింపుతాం’’ అని దళవాయి చలపతి బీబీసీతో చెప్పారు.
 
కొత్త తరానికి నచ్చేలా...
తోలుబొమ్మల కళాకారులు ఇప్పుడు ల్యాంప్ షేడ్స్ నుంచి, డోర్ హ్యాంగింగ్స్ వరకూ ఎన్నో రకాల వస్తువులు తయారు చేస్తున్నారు. ‘‘గతంలో ఇంట్లో అలంకరించుకోడానికి వీలుగా బొమ్మలను తయారు చేసేవాళ్లం. ఇప్పుడు ల్యాంప్ షేడ్స్, ఫ్లోర్ ల్యాంప్ షేడ్స్, సీలింగ్ ల్యాంప్ షేడ్స్, టేబుల్ ల్యాంప్ షేడ్స్ ఇలా దాదాపు 50 రకాల ల్యాంప్ షేడ్స్ తయారు చేస్తాం. రామాయణం, మహాభారతానికి చెందిన ఘట్టాలను పెయింటింగ్స్‌లా తయారు చేసి, విక్రయిస్తాం. వీటితోపాటూ తోరణాలు, డోర్ హ్యాంగింగ్స్, వాల్ హ్యాంగింగ్స్ ఇంకా చాలా తయారు చేస్తున్నాం. మారిన జీవన శైలికి తగినట్లు, మోడ్రన్ ఆర్కిటెక్టులు ఇంటీరియర్ డిజైనింగ్ కోసం ఉపయోగించేలా తోలుబొమ్మలు తయారుచేసి అందిస్తున్నాం’’ అని కుల్లాయప్ప చెప్పారు.
 
అతిపెద్ద సమస్యగా మార్కెటింగ్...
తోలుబొమ్మ కళాకారులకు ప్రస్తుతం మార్కెటింగ్ అనేది అతిపెద్ద సమస్యగా ఉంది. ‘‘మేమే తోలుబొమ్మలు తయారు చేసుకోవాలి. వాటిని మేమే మార్కెటింగ్ చేసుకోవాలి. వాటిని విక్రయించడానికి మేమే సరైన వేదికను కూడా వెతుక్కోవాల్సి వస్తోంది. ఇది మాకు చాలా పెద్ద సమస్య. మాకు పెద్దగా మార్కెటింగ్ అవకాశాలు లేదు. మొదట్లో మా ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ ఉండేది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అమ్ముకోగలిగేలా మాకు తగిన వేదికలు లేవు’’ అని కుల్లాయప్ప చెప్పారు. దేశంలో తగిన మార్కెటింగ్ అవకాశాలు లేకపోవడంతో తోలుబొమ్మల కళాకారులందరూ విదేశాల్లో జరిగే ఎగ్జిబిష్లపై ఆధారపడుతున్నారు.
 
‘‘హ్యాండీక్రాఫ్ట్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగే ఎగ్జిబిషన్లలో, ప్రైవేటు ఎన్జీవోలు నిర్వహించే ఎగ్జిబిషన్లలో పాల్గొని మా ఉత్పత్తిని అమ్ముతుంటాం. అక్కడికి వచ్చే హోల్‌సేల్ డీలర్లు, ఎక్స్‌పోర్టర్లు మా దగ్గర పెద్దమొత్తంలో కొనుగోలు చేసి వారు బయట అమ్ముకుంటారు. ప్రస్తుతం మాకు అందుబాటులో ఉన్న మార్కెటింగ్ విధానం ఇదే. దీనివల్ల 10 శాతం మంది కూడా లబ్ధి పొందలేకపోతున్నారు. మాకు మార్కెటింగ్ అవకాశాలు పెంచితే మేం ఈ కళను మరింతకాలం మనుగడలో ఉంచగలం’’ అని కుల్లాయప్ప చెప్పారు. రూ.100 నుంచి, లక్ష రూపాయల విలువైన తోలుబొమ్మల కళాకృతులను విక్రయిస్తున్నట్లు నిమ్మలకుంట కళాకారులు చెబుతున్నారు.
 
‘‘బొమ్మల ధర రూ.100 నుంచి మొదలవుతుంది. రెగ్యులర్‌గా అమ్ముడయ్యేవాటి ధర రూ.2,000, రూ.3,000 అలా ఉంటాయి. ఇక తోలు బొమ్మల పెయింటింగ్స్ విషయానికొస్తే రూ.1, 000 నుంచి మొదలవుతుంది. ఒక్కో పెయింటింగ్ లక్ష విలువ కూడా చేస్తుంది. లక్ష రూపాయలు పెయింటింగ్ తయారీకి దాదాపు రెండు నెలల సమయం పడుతుంది. మాకు సగటున మూడు, నాలుగు వందల కూలీ మాత్రమే దక్కుతుంది’’అని కుల్లాయప్ప చెప్పారు. తాము రుణాలు తీసుకుని తోలు బొమ్మలు తయారీ చేస్తున్నామని, ఈ పరిస్థితుల్లో తమ పిల్లలకు ఈ వృత్తి ఏమాత్రం సరిపోదని వారు అంటున్నారు. ‘‘ఒక కుటుంబం బాగా కష్టపడితే రోజుకు మూడు నుంచి నాలుగు వందల కూలీ మాత్రమే వస్తుంది. మాది కుల వృత్తి కాబట్టి దీన్ని వదిలి పెట్టలేం. మా పిల్లలకు కూడా తోలుబొమ్మలు తయారు చేయడం నేర్పిస్తున్నాం. కానీ, ఇదే కెరీర్‌గా ఎంచుకోవద్దని వాళ్లకు మేం చెబుతున్నాం’’ అని కుల్లాయప్ప చెప్పారు.
 
కుటుంబాలకు సాయంగా మహిళలు
తోలుబొమ్మల తయారీ పనిలో ఎక్కువగా పురుషులే ఉంటారు. చర్మం శుభ్రం చేయడం కట్ చేయడం అన్నీ చేస్తుంటారు. కానీ, ఈ కుటుంబాల్లోని మహిళలు కూడా తమ వంతు సాయం చేస్తుంటారు. రెండు నెలల పాటు బొమ్మలు వేయడం నేర్చుకున్న తాను ఇప్పుడు సొంతంగా పని చేస్తున్నట్లు నిమ్మలకుంటలో ఉంటున్న మంగమ్మ చెప్పారు. ‘‘ మగవాళ్లు డ్రాయింగ్స్ వేస్తారు. మేం రంగులు వేయడం, చిన్న చిన్న బొమ్మలు తయారు చేస్తుంటాం. మార్కెట్లో రంగులు తీసుకొచ్చి ఏ బొమ్మకి ఏ కలర్ వేయాలంటే అది నేను వేస్తుంటా. పులులు, జింకలు, పాములు అన్ని బొమ్మలు తయారు చేశాక, నేను దానికి తగ్గట్టుగా రంగులు వేసి ఎగ్జిబిషన్‌లో అమ్మడానికి తీసుకెళ్తాం’’ అని మంగమ్మ చెప్పారు.
 
గతంలో టీఏ, డీఏ ఇచ్చి తమను ఎగ్జిబిషన్లకు తీసుకెళ్లేవారని, ఇప్పుడు అన్నీ తామే చూసుకోవాల్సి వస్తోందని చలపతి చెప్పారు. తోలుబొమ్మలాట కళాకారులు నిమ్మలకుంటతో పాటు విశాఖపట్నం, కాకినాడ, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో కూడా ఉన్నారని కుల్లాయప్ప చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా తమ జనాభా అంతా కలిపి 10 వేలు, 15 వేల మంది కంటే ఎక్కువ ఉండరని అన్నారు. రాయలసీమతో పాటు నెల్లూరు, ఒంగోలు జిల్లాలకు కలిపి తిరుపతిలో హ్యాండీక్రాఫ్ట్ సర్వీస్ కార్యాలయం ఉంది. వారి అర్హతను బట్టి ఎగ్జిబిషన్స్‌కు తీసుకెళ్తామని బీబీసీతో హ్యాండీక్రాఫ్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యమూర్తి చెప్పారు.
 
‘‘ధర్మవరం మండలానికి చెందినవారు, ప్రత్యేకించి నిమ్మలకుంటలో ఉన్నవారు అంతా కలిపి 500 మంది మా దగ్గర నమోదు చేసున్నారు. వీరిలో అప్లికేషన్స్ వచ్చేదాన్ని బట్టి లాటరీ పద్ధతి ద్వారా వారిని ప్రభుత్వం నిర్వహించే ఎగ్జిబిషన్స్‌కు ఎంపిక చేస్తాం. ఇతర దేశాలలో జరుగుతున్న ఎగ్జిబిషన్స్‌కు కూడా వారి అర్హతను బట్టి తీసుకెళ్తాం. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద సబ్సిడీ లోన్లు ఇస్తున్నాం. దేశవ్యాప్తంగా ఎక్కడెఎక్కడ ఎగ్జిబిషన్లు జరిగినా వారికి అవకాశం కల్పిస్తున్నాం. వీరిలో 14 మంది జాతీయ అవార్డు గ్రహీతలు ఉన్నారు’’ అని సత్యమూర్తి బీబీసీతో అన్నారు.