గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 30 నవంబరు 2019 (15:56 IST)

షాద్‌నగర్ అత్యాచారం, హత్య: పోలీస్ స్టేషన్ ముందు ప్రజాందోళన... నిందితులు కాసేపట్లో కోర్టుకు

షాద్‌నగర్‌లో పశువైద్యురాలిపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితులను కాసేపట్లో కోర్టులో హజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసు విషయంలో ప్రజలు షాద్‌నగర్ పోలీసు స్టేషన్ ఎదుట భారీ సంఖ్యలో ధర్నాకు దిగారు. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, "ఈ కేసులో నిందితులను కాసేపట్లో కోర్టులో హాజరుపరిచి, ఆ తరువాత రిమాండుకు పంపిస్తాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిగేలా చూస్తాం" అని చెప్పారు.

 
మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు శనివారం ఉదయం నుంచే ఇక్కడ ఆందోళన చేపట్టాయి. ఈ ఆందోళన కాసేపు జరుగుతుందని, ఆ తరువాత విరమిస్తారని పోలీసులు తొలుత భావించారు. కానీ, క్రమక్రమంగా ఆందోళన చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. ప్రజా సంఘాలు, సామాన్య ప్రజలు, స్థానిక మహిళలకు తోడు విద్యార్థులు కూడా ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగే వరకూ వెళ్ళింది.

 
దాంతో, నిందితులను వైద్య పరీక్షల కోసం బయటకు తీసుకుని వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. స్టేషన్ నుంచి ఎవరూ బయటకు వెళ్ళే అవకాశం లేకపోవడంతో వైద్య పరీక్షల కోసం డాక్టర్లనే స్టేషన్‌కు పిలిపించారు. వైద్య పరీక్షల అనంతరం నిందితులను జడ్జి ఎదుట హాజరు పరుస్తారు. నిందితులను మహబూబ్‌నగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉందని భావిస్తున్నారు.

 
పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించిన ఆందోళనకారులు నిందితులను ఉరితీయాలని, తమకు అప్పగించాలనీ నినాదాలు చేస్తున్నారు. ఆందోళనలో పాల్గొన్న బూర్గుల గ్రామస్థుడు శ్రీను, "అక్కా చెల్లెళ్ళను బయటకు పంపాలంటేనే భయంగా ఉంది. మా చెల్లి షాద్‌నగర్‌లోనే చదువుతోంది. వారు ఇంటికి వచ్చే వరకు ఎంత టెన్షన్‌గా ఉంటుందో ఆలోచించండి" అని అన్నారు.

 
"ఇవాళ ఒకరికి జరిగింది. రేపు మా పిల్లలకు జరగదని హామీ ఏముంది? మేం పనికి వెళ్తాం. మా పిల్లలు కాలేజీకి వెళ్తారు. వారికి భద్రత లేదు. దోషులను కఠినంగా శిక్షించాలి. ఇంకెవరైనా అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేయడానికి భయపడేలా శిక్షించాలి" అని షాద్ నగర్‌కు చెందిన మానస అన్నారు. ఇదిలా ఉంటే, నిందితులకు ఎటువంటి న్యాయ సహకారం అందించకూడదని మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. నిందితుల తరపున ఎవరూ వాదించబోమని అక్కడి న్యాయవాదులు ప్రకటించారు.

 
శుక్రవారం పోలీసులు వెల్లడించిన వివరాలు...
 
బుధవారం యువతి కనిపించడం లేదనే ఫిర్యాదు అందిన తరువాత ఆ మరునాడు తెల్లవారుజామున 20-25 ఏళ్ల మహిళ శరీరం దహనమవుతోందనే సమాచారం మాకు అందింది. ఈ రెండు ఫిర్యాదులనూ కలిపి విచారిస్తే, అది వెటర్నరీ డాక్టరుదేనని తేలిందని పోలీసులు తెలిపారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణను వేగంగా పూర్తిచేశాం. నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు.
 
 
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మొత్తం పంక్చర్ షాపులు అన్నీ చెక్ చేశాం. నలుగురు నిందితుల్లో ఏ1 లారీ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ఏ2, ఏ3, ఏ4 నిందితులు లారీ క్లీనర్లుగా పనిచేస్తున్నారు. వీరంతా మక్తల్ మండలానికి చెందినవారు. వారు తమ లారీలోని లోడ్ దించడానికి యజమానికి ఫోన్ చేస్తే, సమాధానం రాకపోవడంతో ఏ1 తన లారీని తీసుకొచ్చి టోల్ గేట్ దగ్గర పెట్టాడు. లోడు దింపడానికి ఆలస్యం కావడంతో వారు అక్కడే ఎదురుచూస్తున్నారు.

 
ఆ సమయంలో బాధితురాలు తన వాహనం పార్క్ చెయ్యడం చూశారు. ఆ తర్వాత వీరంతా మద్యం సేవించారు. ఆమె మళ్లీ తిరిగి తప్పకుండా వస్తుందని ఊహించారు. స్కూటీ టైరు గాలి తీసేస్తే ఎక్కడికీ పోదు అని ఏ2 నిందితుడు చెప్పాడు. దీంతో వాళ్లు బాధితురాలి స్కూటీ వెనక టైరులో గాలి తీసేశారు. సాయంత్రం ఆమె అక్కడికి రాగానే ఏ1 నిందితుడు వెళ్లి పంక్చర్ అయింది, సహాయం చేస్తానని చెప్పారు. తమ వాళ్ల దగ్గరికి వెళ్లి పంక్చర్ వేయించుకుని వస్తానని చెప్పారు.

 
ఇంతలో బాధితురాలు తన సోదరికి ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత నలుగురూ కలిసి ఆమెను లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఆ సమయంలో నోరును, ముక్కునూ గట్టిగా మూసేయడంతో ఆమె అక్కడే మరణించారు. ఆ తర్వాత ఏ2, ఏ4 నిందితులు స్కూటీ నడపగా, మిగిలిన ఇద్దరూ లారీ నడుపుతూ వెళ్లారు. దగ్గర్లోని బంకులో పెట్రోల్ తీసుకుని, బాడీని దుప్పట్లలో చుట్టి, పెట్రోల్, డీజిల్ పోసి నిప్పంటించి వెళ్లిపోయారు. కానీ మళ్లీ వెనక్కి వచ్చి బాడీ పూర్తిగా కాలిందో లేదో చూసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆరాంఘడ్ వెళ్లిపోయారు. దీనిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ చేపట్టి, త్వరలోనే శిక్ష పడేలా చేస్తాం. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా 100 నెంబరుకు ఫోన్ చెయ్యండి. పోలీసులు మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు.