సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 1 మార్చి 2021 (11:27 IST)

వంట గ్యాస్ సిలిండర్‌పై రాయితీ గతంలో రూ.500 దాకా వచ్చేది, ఇప్పుడు రూ.16కి పడిపోయింది- ప్రెస్ రివ్యూ

వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించిన తొలి నాళ్లలో.. ఒక్కో సిలిండర్‌పై రూ.170 నుంచి రూ.500 వరకు రాయితీ రూపంలో వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో జమయ్యేది. రాయితీ పోను సగటున రూ.500 వరకు వినియోగదారుడు భరించేవారు. ప్రస్తుతం సిలిండర్‌ ధర విజయవాడలో రూ.816కు చేరగా.. రాయితీ మాత్రం 16కి పడిపోయిందంటూ ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది.

 
అదే విశాఖపట్నంలో అయితే సిలిండర్‌ ధర రూ. 800 కాగా సబ్సిడీ రూ.4 చొప్పునే పడుతోంది. ఒక్కో ఊళ్లో ఒక్కోలా రాయితీ వస్తున్నా.. ఎక్కడా 50 రూపాయలకు మించి లేదు. సిలిండర్ల రేట్లు భారీగా పెరుగుతున్నా రాయితీ మాత్రం తగ్గిపోతోంది. ఆరేళ్ల కిందటితో పోలిస్తే, ఒక్కో సిలిండర్‌పై రూ.300 వరకు అదనంగా భరిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 1.42 కోట్ల వంటగ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. వాణిజ్య వినియోగదారుల్ని మినహాయిస్తే.. సుమారు 1.15 కోట్ల కుటుంబాలు ప్రతి నెలా గ్యాస్‌ సిలిండర్లు తీసుకుంటున్నాయి. ఈ లెక్కన ఏడాదికి రాష్ట్ర గ్యాస్‌ వినియోగదారులపై రూ.4,140 కోట్ల భారం పడుతోంది.

 
వంటగ్యాస్‌ ధర అత్యధికంగా 2018 నవంబరులో రూ.970కి చేరింది. అప్పట్లో వినియోగదారుడికి రాయితీ రూపంలో రూ.389 వరకు బదలాయించారు. 2018 డిసెంబరులో గ్యాస్‌ సిలిండర్‌ రూ.837 చొప్పున ఉంది. అప్పుడూ రూ.262 వరకు జమ చేశారు. 2020 మార్చిలో సిలిండర్‌ ధర రూ.833 ఉండగా.. రూ.254 చొప్పున రాయితీ వినియోగదారులకు అందింది. అక్కడ నుంచి క్రమంగా తగ్గుతూ.. సిలిండర్‌కు రూ.16 చొప్పున మాత్రమే లభిస్తోంది. పెరిగిన ధరల ప్రకారం సిలిండర్‌ (విజయవాడలో) ధర రూ.816 అయింది. దీనిపై ఎంత రాయితీ వస్తుందో? అసలొస్తుందో రాదో కూడా డీలర్లే చెప్పలేని పరిస్థితి ఉంది.

 
ప్రాంతాలవారీగా ఎల్‌పీజీ ధరల్లో తేడా ఉంది. దీనికి అనుగుణంగానే రాయితీ కూడా జమ అవుతోంది. అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో సిలిండర్‌ ధర రూ.800 ఉంది. ఇక్కడ గత కొన్ని నెలలుగా వినియోగదారులకు రూ.4 చొప్పునే రాయితీ జమ అవుతోంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో తాజాగా సిలిండర్‌ ధర రూ.863 వరకు ఉంది. ఇక్కడ రూ.49 చొప్పున జమచేస్తున్నారు. తిరుపతిలో సిలిండర్‌ ధర రూ.830పైనే ఉంది. కొన్ని నెలల నుంచి ఇక్కడ సిలిండర్‌కు రూ.17 చొప్పున జమవుతోంది.

 
గృహావసర వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర గతేడాది నవంబరులో రూ.616 ఉంది. డిసెంబరులో రెండు దఫాలుగా రూ.100 పెంచారు. 2021 ఫిబ్రవరిలో మూడుసార్లు కలిపి రూ.100 పెంచారు. దాంతో సిలిండర్‌ ధర రూ.816 అయింది. గ్యాస్‌ ధర సిలిండర్‌పై రూ.200 చొప్పున పెరిగినా.. రాయితీలో మాత్రం మార్పు రాలేదు.

 
వంటగ్యాస్‌ రాయితీని స్వచ్ఛందంగా వదులుకునేలా 'గివ్‌ ఇట్‌ అప్‌' కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుతో అధికాదాయ వర్గాల వారు ముందుకొచ్చి రాయితీ సిలిండర్‌ను వదులుకున్నారు. ముందుకురాని.. పేద, మధ్య తరగతి కుటుంబాలకు రాయితీలో క్రమంగా కోత పడుతోంది. అనధికారికంగానే గివ్‌ ఇట్‌ ఆప్‌ అమలవుతోందని ఈ కథనంలో తెలిపారు.