1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 2 మార్చి 2021 (12:42 IST)

ఆన్‌లైన్‌ పాఠాలు చెబుతానని అశ్లీల చిత్రాలు చూపించిన ఉపాధ్యాయుడు- ప్రెస్ రివ్యూ

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ గురువు తన వృత్తికే కళంకం తెచ్చారు. ఆన్‌లైన్‌ పాఠాల పేరుతో ఆరో తరగతి విద్యార్థినులకు సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూపించడమే కాకుండా వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండలం గోట్కూరి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుందని సాక్షి ఒక కథనంలో తెలిపింది.

 
శనివారం ఈ ఘటన చోటుచేసుకోగా ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు సోమవారం పాఠశాలకు చేరు కుని సదరు ఉపాధ్యాయుడిని నిర్బంధించారు. గోట్కూరి పాఠశాలలో ఖదీర్‌ ఇంగ్లిష్‌ (స్కూల్‌ అసిస్టెంట్‌) ఉపాధ్యాయుడు. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో శనివారం ఆరో తరగతి విద్యార్థినులు కొందరు హాజరయ్యారు. అయితే ఖదీర్‌ వారికి పాఠాలు చెప్పాల్సింది పోయి, తరగతి గదిలోనే తన సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూపించారు. బాలికలతో అసభ్యంగా ప్రవర్తించారు.

 
ఈ విషయాన్ని చిన్నారులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో అదేరోజు వారు ప్రధానోపాధ్యాయుడు రాధాకృష్ణమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం సెలవు కావడంతో సోమవారం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుడు ఖదీర్‌ను తల్లిదండ్రులు, గ్రామస్తులు నిలదీశారు. అతడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న తాంసి ఎస్సై శిరీష పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన జరగకుండా చర్యలు చేపట్టారు.

 
జిల్లా విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుడి ఫోన్‌ను సీజ్‌ చేశారు. ఖదీర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనపై విచారణ నిమిత్తం డీఈవో రవీందర్‌రెడ్డి ముగ్గురు సెక్టోరియల్‌ అధికారులను పాఠశాలకు పంపించారు. వారి నివేదిక ఆధారంగా సదరు ఉపాధ్యాయు డిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ఈ వార్తలో తెలిపారు.