గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 30 జూన్ 2020 (17:36 IST)

టిక్‌టాక్ యాప్ ఇంకా పనిచేస్తోంది, వాడాలా వద్దా? నిషేధం ప్రభావం ఎలా ఉంటుంది?

భారత సార్వభౌమాధికారం, సమగ్రత, శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటూ టిక్‌టాక్, షేరిట్ సహా 59 యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2009 లోని 69వ సెక్షన్ ప్రకారం ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు జూన్ 29 రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, నిషేధం విధించిన 59 యాప్‌లలో 29 యాప్ ‌లు టాప్ 1000 యాప్ లిస్టులో ఉన్నాయి. మరి ఇన్ని కోట్ల మంది వాడుతున్న ఇలాంటి యాప్ లు... ఇప్పుడేమవుతాయి?

 
లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల తర్వాత భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం నిషేధించిన 59 యాప్‌ల జాబితాలో టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, బైడూ మ్యాప్, షేరిట్ వంటి చైనా యాప్‌లు అధికంగా ఉన్నాయి.

 
విదేశాలకు సమాచారం తరలిస్తున్నారు
విస్తృత డిజిటల్ మార్కెట్‌గా అవతరించిన భారతదేశంలో కోట్లాది భారతీయుల గోప్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ చైనా యాప్‌లతో దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పుందని ఫిర్యాదులు అందాయని, వీటిని దుర్వినియోగం చేస్తూ, డౌటా చౌర్యంతో పాటు, విదేశాల్లో సర్వర్లకు అనధికారికంగా డేటాను తరలిస్తున్నారన్న సమాచారం ఉందని ప్రభుత్వం తెలిపింది.

 
ప్రభుత్వ ప్రకటన ప్రకారం వీటిలో కొన్ని యాప్‌ల‌ను త‌క్ష‌ణ‌మే బ్యాన్ చేయాలని ఇండియ‌న్ సైబ‌ర్ క్రైమ్ కో-ఆర్డినేష‌న్ సెంట‌ర్‌, కేంద్ర హోం శాఖ కూడా సూచించాయి. ప్యూట‌ర్ ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌కు కూడా ఈ యాప్‌లపై ఫిర్యాదులు అందాయి. ఈ యాప్‌ల‌తో దేశ సార్వ‌భౌమ‌త్వానికి భంగం క‌లిగే ముప్పుంద‌ని తగిన సమాచారం అందిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని, వీటిని మొబైల్‌తోపాటు ఏ ఇంట‌ర్నెట్ ఆధారిత డివైజ్‌లోనూ ఉప‌యోగించ‌కూడ‌ద‌ని ప్రభుత్వం స్ప‌ష్టం చేసింది.

 
ఆన్‌లైన్ యాప్‌లు, ఆఫ్‌లైన్ యాప్‌లు
భారత ప్రభుత్వం నిషేధించిన యాప్‌లలో టిక్ టాక్, హలో, లైకీ, యూసీ బ్రౌజర్ వంటి ఆన్‌లైన్ యాప్‌లతో పాటు, షేరిట్, క్యామ్ స్కానర్ వంటి ఆఫ్ లైన్ యాప్‌లు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2019 చివరి నాటికి 80 కోట్ల మందికి పైగా టిక్ టాప్ యాప్ వాడుతున్నారు. వారిలో 46 కోట్ల మంది భారతీయులే. అంటే, ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు టిక్ టాక్ యాప్ వాడుతున్నారు.

 
2019లో ఒకానొక దశలో.. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ , ఫేస్‌బుక్ డౌన్‌లోడ్లను కూడా టిక్‌టాక్ యాప్ మించిపోయింది. ఆ ఏడాది మొదటి త్రైమాసికంలో ఏకంగా 33 మిలియన్ల మంది టిక్ టాక్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. టిక్ టాక్ యాప్ ఎక్కువగా వాడేవారిలో 16 నుంచి 24 ఏళ్లలోపు వయసున్న వారే 41 శాతం వరకూ ఉన్నారు.

 
అంతేకాదు, టిక్ టాక్ యాప్ వాడేవారిలో 90 శాతం మంది రోజూ యాప్ వాడతామని చెప్పారు. చైనాలో తయారైన టిక్‌టాక్ యాప్‌ను వాడే చైనీయుల సంఖ్య 18 కోట్ల వరకూ మాత్రమే ఉంది. ఆ తర్వాత స్థానంలో అమెరికాలో 13 కోట్ల మంది వాడుతున్నారు. తొలినాళ్లలో టిక్ టాక్‌ను అమెరికాలో పెద్దగా ఆదరించలేదు. దీంతో అక్కడి మరో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని తమ యాప్ లాంఛ్ చేసింది.

 
ఇలా ఇప్పుడు నిషేధం విధించిన 59 యాప్‌లలో 29 యాప్‌‌లు టాప్-100 యాప్ లిస్టులో ఉన్నాయి. మరి ఇన్ని కోట్లమంది వాడుతున్న ఇలాంటి యాప్‌లు... ఇప్పుడేమవుతాయి. ఈ నిషేధం తర్వాత యాప్‌లు వాడుకోవచ్చా అన్నదే పెద్ద ప్రశ్నగా వినిపిస్తోంది.

 
తక్షణ ప్రభావం ఏంటి?
ప్రభుత్వ ఆదేశాల మేరకు గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ ఐ స్టోర్ నుంచి ఈ యాప్‌లు తొలగించారు. అంటే ఇకపై కొత్తగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం కుదరదు. అయితే, యూజర్లు ఈ యాప్‌‌లను తమ మొబైళ్ల నుంచి తొలగించాలని మాత్రం ప్రభుత్వం ఆదేశాలివ్వలేదు. ప్రస్తుతం టిక్ టాక్ యాప్‌లు కలిగిఉన్న యూజర్లు తమ యాప్ ‌లను ఎప్పటిలాగానే వాడుకోవచ్చు.

 
వాళ్లంతట వాళ్లు యాప్ డిలీట్ చేసే వరకూ అవి అలాగే ఉంటాయి. ఎప్పటిలాగానే తమ యాప్‌లలో వీడియోలు అప్ లోడ్ చేసుకోవడం దగ్గర్నుంచి గతంలో చేసిన అన్ని సౌకర్యాలూ వినియోగించుకోవచ్చు. అదేవిధంగా టిక్ టాక్ అకౌంట్లో ఉన్న తమ ఫాలోయర్స్ సంఖ్య గానీ, వారు ఇదివరకూ అప్ లోడ్ చేసిన వీడియోలు, ఇతర కంటెంట్, వాటికి వచ్చిన లైక్‌లు, షేర్లు ఇవేమీ కూడా ప్రభావితం కావని టెక్నాలజీ నిపుణుడు నల్లమోతు శ్రీధర్ బీబీసీకి తెలిపారు.

 
యాప్‌లను అన్ని ఫోన్లలోనూ తొలగించాలని ఆదేశిస్తే?
ఇప్పటివరకూ యాప్‌ల మీద నిషేధం విధించడమంటే, ఆపిల్ స్టోర్, ప్లేస్టోర్‌ల నుంచి వాటిని తొలగించడం మాత్రమే అన్నట్లుగా ఉంది. ఇప్పటివరకూ భారతదేశంలో ఇలా ఏ యాప్‌లనూ అధికారికంగా నిషేధించలేదు. కానీ తాజా నిషేధం వల్ల... ఈ 59 యాప్‌లు కేవలం భారతదేశంలో మాత్రమే అందుబాటులో ఉండవు. కానీ సైడ్ లోడింగ్ విధానంలో కొన్ని ప్రత్యేకమైన వెబ్ సైట్లు, ఇతర పద్ధతుల ద్వారా ఈ యాప్‌లను సెక్యూరిటీ నిబంధనలకు విరుద్ధంగా ఈ యాప్‌లను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

 
అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ యాప్‌లను అన్ని ఫోన్లలోనూ తొలగించాల్సిందిగా గూగుల్‌కి ఆదేశాలు ఇస్తే మాత్రం... అప్పుడు గూగుల్ ప్లే ప్రొటెక్టర్, గూగుల్ ప్లే సర్వీస్ వంటి వాటి సాయంతో గూగుల్ తమ ఆపరేటింగ్ సిస్టమ్ వాడే అన్ని ఫోన్లలోనూ ఈ యాప్‌లను తీసేసే అవకాశం ఉంది.

 
ప్లే స్టోర్ సాయంతో కాకుండా... ఏకంగా టెలికం నెట్‌వర్క్ సాయంతో కూడా ఈ యాప్‌లను బ్యాన్ చేసే అవకాశముంది. అలా చేస్తే అప్పుడు టిక్ టాక్ అప్లికేషన్‌కు కనెక్ట్ అయ్యేందుకు భారతదేశం నుంచి పంపే పింగ్ రిక్వెస్ట్ వెళ్లకుండా అడ్డుకోవచ్చు. దీనివల్ల ఆ సర్వర్‌కు భారతీయులెవరూ కనెక్ట్ కాకుండా అడ్డుకోవచ్చు. అప్పటికీ, వర్చ్యువల్ ప్రైవేట్ నెట్వర్క్ వాడే వారు మాత్రం ఈ ఇబ్బంది నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.

 
టిక్ టాక్, క్లబ్ ఫ్యాక్టరీ, హలో వంటి ఆన్లైన్ యాప్‌లతో పాటు షేరిట్ వంటి ఆఫ్ లైన్ యాప్‌లు కూడా నిషేధ జాబితాలో ఉన్నాయి. వాటిని తొలగించాలంటే.. కేంద్రప్రభుత్వం ఆయా గూగుల్, ఆపిల్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్ సంస్థలను సంప్రందించి... ఆయా యాప్‌లను తొలగించమని చెప్పాల్సిందే. అప్పటివరకూ ఆ యాప్‌లను కూడా యథాతథంగా వాడుకోవచ్చు.

 
ఎన్ని చేసినా తప్పని ఇబ్బందులు...
ఈ యాప్‌లను అధికారికంగా నిషేధించినా... యూజర్ల మొబైళ్లలో అప్పటికే ఇన్‌స్టాల్ అయి ఉన్న యాప్‌లకు కొన్ని ఇబ్బందులు తప్పవు. ఇకపై ఈ యాప్‌లకు ఎలాంటి అప్డేట్లు దొరకవు. పైగా సెక్యూరిటీ ఇబ్బందుల్ని తీర్చే సహకారం కూడా సైట్ల నుంచి దొరకదు. ఈ యాప్‌లకు సైబర్ సెక్యూరిటీ పరంగా కూడా ఎలాంటి భద్రతా ఉండకపోయే అవకాశాలున్నాయి.

 
భారతీయులు వాడుతున్న చైనీస్ యాప్‌లలో నాలుగు రకాలున్నాయి. వాటిల్లో ఎకనామిక్ యాక్టివీటీ యాప్‌లు, సర్వీస్ ఓరియెండెట్ యాప్స్, వానిటీ యాప్స్, స్ట్రాటజిక్ యాప్స్ అని నాలుగు రకాలున్నాయి. డిజిటల్ ఇండియా గురించి ప్రపంచమంతా చూస్తోంది. బైదూ, ఆలీబాబా, టెన్సెంట్ ఇవన్నీ కూడా... చైనా డిజిటల్ సిల్క్ రూట్‌లో భాగమే. ఇప్పుడిలా ఈ 59 యాప్‌లను నిషేధించడం వల్ల... ఆయా యాప్‌ల యాజమాన్యాల మీద తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. టిక్ టాక్‌లో 30 శాతం యూజర్లు ఒక్క భారతదేశం నుంచే ఉన్నారు. ఇది టిక్‌టాక్ వాల్యుయేషన్ పడిపోడానికి సహకరిస్తుందని గేట్‌వే హౌస్ డైరెక్టర్ బ్లాసీ ఫెర్నాండెజ్ అభిప్రాయపడ్డారు.

 
టిక్ టాక్ ఏమంటోంది?
ఈ నిషేధంపై టిక్ టాక్ యాజమాన్యం బైట్ డెన్స్ కూడా స్పందించింది. ప్రపంచ వ్యాప్తంగా తమ యాప్ విజయవంతం కావడంలో భారతీయుల పాత్ర చాలా బలమైనదని చెప్పింది. యూజర్ల డేటా భద్రతకు పూర్తి భరోసా ఇస్తామని, ప్రభుత్వం అనుమతిస్తే... యూజర్ల డేటా భద్రత గురించి, తీసుకునే సెక్యూరిటీ నియమాలను భారత ప్రభుత్వానికి సవివరంగా తెలియచేస్తామని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

 
అయితే, చట్టపరంగా ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నామని, భారత్‌లోని టిక్‌టాక్ ఉద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని తమకు యాజమాన్యం నుంచి సమాచారం వచ్చిందని ముంబయి టిక్ టాక్ ఉద్యోగి ఒకరు బీబీసీతో చెప్పారు. నిజానికి, భారత్‌లో నియామకాలను పెంచాలని ఈ సంస్థ భావిస్తోందని, దేశంలో మొత్తంగా భారతీయ ఉద్యోగులు ఎంమంది ఉన్నారన్నది చూస్తున్నామని వారు తెలిపారు.

 
హలో ప్రతినిధి ఏమన్నారు...
ఈ నిర్ణయంపై వివరణ ఇచ్చేందుకు సంస్థలోని కీలక భాగస్వాములతో చర్చిస్తున్నామని, డేటా భద్రత విషయంలో తాము అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నామని హలో ప్రతినిధి అన్నారు. "యూజర్ ప్రైవసీకి మేం ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాం. లక్షలాది భారతీయ యూజర్లకు వారి భాషలో వేదిక కల్పిస్తున్నందుకు మేం గర్వపడుతున్నాం. ఈ సేవలను ఇలాగే కొనసాగించాలని ఆశిస్తున్నామని ఆ ప్రతినధి బీబీసీతో అన్నారు.

 
విదేశాల్లోనూ నిషేధాలు...
టిక్‌టాక్‌ను ఇప్పటికే కొన్ని ఇతర దేశాల్లో కూడా నిషేధించారు. 2018 జులై 3న అశ్లీల సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందన్న కారణంగా ఇండోనేషియా ప్రభుత్వం టిక్ టాక్ మీద నిషేధం విధించింది. దీంతో, టిక్ టాక్‌లోకి అప్‌లోడయ్యే సమాచారాన్ని ఫిల్టర్ చేస్తామని, సెన్సార్ చేసేందుకు తగినంత మంది ఉద్యోగుల్ని నియమిస్తామని టిక్ టాక్ హామీ ఇవ్వడంతో ఎనిమిది రోజుల తర్వాత నిషేధం ఎత్తేసింది. 2018 నవంబర్లో బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా టిక్ టాక్ యాప్‌కు ఇంటర్నెట్ యాక్సెస్ నిలిపేసింది.