శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 17 జులై 2023 (11:04 IST)

యూఏఈ: ఈ అరబ్ దేశంలో ప్రధాని మోదీ అన్నిసార్లు ఎందుకు పర్యటించారు?

image
కర్టెసి-ట్విట్టర్
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన అనంతరం యూఏఈకి వెళ్లారు. యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్-నహ్యాన్‌తో శనివారం చర్చలు జరిపారు. అనంతరం భారత రూపాయిని యూఏఈ కరెన్సీ దిర్హామ్‌లో ట్రేడింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ద్వైపాక్షిక వాణిజ్యం త్వరలో రూ.7 లక్షల కోట్ల నుంచి రూ.8 లక్షల కోట్లకు పెరుగుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాల సొంత కరెన్సీ వాణిజ్య ప్రకటన అనేది భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య సంబంధాలలో కొత్త మైలురాయిగా పరిగణిస్తున్నారు.
 
2014 తర్వాత నరేంద్ర మోదీ యూఏఈలో పర్యటించడం ఇది ఐదోసారి. గత కొన్ని సంవత్సరాలుగా ఇండియా, యూఏఈ మధ్య దౌత్య సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. గత ఏడాది మోదీ యూఏఈ చేరుకున్నప్పుడు అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్-నహ్యాన్ ప్రోటోకాల్‌ కాకున్నా మోదీని స్వాగతించడానికి అబుదాబి విమానాశ్రయానికి వచ్చారు. ఈ సందర్భంగా మోదీకి యూఏఈ అత్యున్నత పౌర పురస్కారం అయిన 'ఆర్డర్ ఆఫ్ జాయెద్‌'ను ప్రదానం చేసింది.
 
ఇందిరా గాంధీ తర్వాత మోదీయే
తన పాలనలో గల్ఫ్ దేశాలతో సంబంధాలను పెంచుకోవడంపై మోదీ ప్రత్యేక దృష్టి సారించారు. 2002 గుజరాత్ అల్లర్లు గల్ఫ్ దేశాల్లో భారత సంబంధాలపై ప్రభావం చూపుతాయని 2014లో మోదీ ప్రధాని అయినప్పుడు చాలా మంది అనుకున్నారు. అయితే అందుకు విరుద్ధంగా గల్ఫ్ దేశాలతో భారత్ సంబంధాలను బలోపేతం చేసే దిశగా మోదీ అడుగులు వేశారు. తన తొమ్మిదేళ్ల పాలనలో గల్ఫ్‌లోని ఇస్లామిక్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఆయన దృష్టి సారించారు. యూఏఈ విషయానికి వస్తే మోదీ తన మొదటి పర్యటనను 2015 ఆగస్టులో, రెండోది 2018 ఫిబ్రవరిలో, మూడోది ఆగస్టు 2019లో, నాల్గవది 2022 జూన్‌లో చేశారు. తాజా పర్యటన ఐదోది.
 
ఇందిరా గాంధీ తర్వాత యూఏఈని సందర్శించిన భారత ప్రధాని మోదీయే. ఇందిర 1981లో యూఏఈలో పర్యటించారు. ఆ తర్వాత 34 ఏళ్లకు మోదీ వెళ్లారు. మోదీ విదేశాంగ విధానంలో యూఏఈకి ఇస్తున్న గౌరవం 2017లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా బయటి ప్రపంచానికి తెలిసింది. ఆ సమయంలో మోదీ ప్రభుత్వం మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. అప్పుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ యూఏఈ అధ్యక్షుడు కాదు, అబుదాబి క్రౌన్ ప్రిన్స్. సంప్రదాయం ప్రకారం భారతదేశం ఒక దేశ ప్రధాని లేదా అధ్యక్షుడిని గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తుంది. అయితే 2017లో రిపబ్లిక్ డేకి అల్ నహ్యాన్ ముఖ్య అతిథిగా వచ్చారు.
 
భారత్-యూఏఈ సంబంధాలకు మూడు పునాదులు
ఇండియా, యూఏఈ మూడు ‘E’లపై ఆధారపడి ఉన్నాయి. ఎనర్జీ (ఇంధనం), ఎకానమీ(ఆర్థిక వ్యవస్థ), ఎక్స్పార్టియేట్ (ప్రవాస భారతీయులు). 2022-23 ఆర్థిక సంవత్సరంలో యూఏఈ, భారతదేశానికి మూడో అతిపెద్ద ముడి చమురు సరఫరాదారు. భారతదేశం చమురు దిగుమతుల్లో యూఏఈ వాటా పది శాతం వరకు ఉండేది. అయితే 2030 నాటికి యూఏఈ నుంచి చమురుయేతర వ్యాపారాన్ని రూ.8 లక్షల కోట్లకు పెంచాలని భారతదేశం నిర్ణయించింది. గత ఏడాది కుదిరిన సీఈపీఏ (సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం) భారతదేశం, యూఏఈ మధ్య పెరుగుతున్న సంబంధాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.
 
గత దశాబ్ద కాలంలో భారతదేశం సంతకం చేసిన తొలి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇదే. భారత్ 2011లో జపాన్‌తో చివరిగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసింది. 2027 నాటికి భారతదేశం తన ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని 5 ట్రిలియన్ డాలర్లకు పెంచాలనుకుంటోంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి, 2030 నాటికి ఎగుమతులను ఒక ట్రిలియన్ డాలర్లకు పెంచాలనుకుంటోంది. సీఈపీఏ ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
 
రూ.1,400 కోట్ల నుంచి రూ. 7 లక్షల కోట్లకు...
యూఏఈతో భారతదేశం ద్వైపాక్షిక వాణిజ్యం 1970లలో కేవలం రూ. 1,400 కోట్లు మాత్రమే ఉంది, అది ఇప్పుడు రూ.7 లక్షల కోట్లకు పెరిగింది. 2021-22లో అమెరికా, చైనా తర్వాత యూఏఈ భారతదేశానికి మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అమెరికా తర్వాత యూఏఈకి భారత్‌ అత్యధికంగా ఎగుమతులు చేస్తోంది. యూఏఈలో భారత రాయబారి సంజయ్ సుధీర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒక్క ఏడాదిలోనే యూఏఈతో భారత్ వాణిజ్యం 19 శాతం పెరిగింది.
 
మోదీ తన ప్రస్తుత పర్యటనలో యూఏఈ అధ్యక్షుడితో ఇంధనం, ఆహార భద్రత, రక్షణ సహా అనేక అంశాలపై చర్చించారు. మీడియా కథనాల ప్రకారం 2022లో సీఈపీఏ సమీక్ష కూడా మోదీ, మొహమ్మద్ బిన్ జాయెద్‌ల అజెండాలో ఉంది. యూఏఈతో భారత వ్యాపార సంబంధాలు పెరుగుతున్న వేగం చాలా మంది విశ్లేషకులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. యూఏఈ ఇప్పుడు భారతదేశంలో నాల్గవ అతిపెద్ద పెట్టుబడిదారుగా అవతరించింది. ప్రస్తుతం భారతదేశంలో దాని పెట్టుబడి రూ.24 వేల కోట్లు దాటింది. 202-21లో భారతదేశంలో దాని పెట్టుబడి రూ.8 వేల కోట్లు మాత్రమే. ఆ సమయంలో అది భారతదేశంలో ప్రపంచంలోని ఏడో అతిపెద్ద పెట్టుబడిదారు. అంటే కేవలం ఏడాది వ్యవధిలోనే మూడు స్థానాలు ఎగబాకింది. "యూఏఈ మేకిన్ ఇండియా, స్టార్ట్-అప్ ఇండియా వంటి మోదీ ప్రభుత్వ కార్యక్రమాల్లో అవకాశాలను చూస్తోంది. వాటిలో పెట్టుబడులను పెంచుతోంది'' అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ అండ్ మిడిల్ ఈస్ట్ వ్యవహారాల నిపుణుడు ఫజ్జూర్ రెహమాన్ సిద్ధిఖీ అన్నారు.
 
భారత్‌పై యూఏఈకి ఆసక్తి ఎందుకు పెరిగింది?
సౌదీ అరేబియా మాదిరిగానే యూఏఈ కూడా తన ఆర్థిక వ్యవస్థను విస్తరించాలని కోరుకుంటోంది. చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని యూఏఈ భావిస్తోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా కొత్త పెట్టుబడి గమ్యస్థానాల కోసం వెతుకుతోంది. యూఏఈ తన 'సర్క్యులర్ ఎకనామిక్ పాలసీ'పై పని చేస్తోంది. 2031 నాటికి దాని తయారీ రంగాన్ని రెట్టింపు చేయాలని అది భావిస్తోంది. ఇందుకోసం రూ.22 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. యూఏఈ దృష్టి ఇప్పుడు ఫుడ్ బిజినెస్, గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై పడింది. ఈ వ్యాపారాలన్నింటికీ భారతదేశాన్ని నమ్మకమైన భాగస్వామిగా చూస్తోంది యూఏఈ. ఆ దేశం ఇండియాలో పెట్టుబడులు పెట్టాలనుకుంటోంది. ఈ రంగాలలో దాని సామర్థ్యాన్ని కూడా ఉపయోగించుకోవాలనుకుంటోంది. ఖరీదైన పాశ్చాత్య నిపుణులతో పోల్చితే భారతీయ నిపుణులు, సాంకేతిక నిపుణులకు యూఏఈ ప్రాధాన్యం ఇవ్వడానికి కారణమిదే.
 
రష్యా-యుక్రెయిన్ యుద్ధం ప్రభావం
రష్యా-యుక్రెయిన్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలు ఆహార భద్రత విషయంలో తీవ్రంగా ఆలోచించవలసి వచ్చింది. అరబ్ ప్రపంచానికి 60 శాతం ఆహారం రష్యా, యుక్రెయిన్‌ల నుంచి వస్తుంది. అందువల్ల ఈ యుద్ధం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను కదిలించింది. ఈ యుద్ధం సుదీర్ఘంగా సాగుతుండటంతో యూఏఈ అప్రమత్తమైంది. ఆహార మిగులు దేశంగా ఉన్న భారతదేశంపై దృష్టి సారించింది. భారత ఆయుధాలపై ఆ దేశం ఆసక్తి చూపుతోంది. బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేయాలనుకుంటోంది. దీంతో పాటు భారత్‌తో కలిసి మిలటరీ హార్డ్‌వేర్‌ను కూడా తయారు చేయాలనుకుంటోంది. ఇది భారత మేకిన్ ఇండియా ప్రచారానికి కూడా ఉపయోగపడుతుంది.
 
తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ యూఏఈ ఇండియాకు మద్దతుగా ఉంది. భారత్‌లో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడి యూఏఈలో దాక్కున్న వారిపై కూడా ఆ దేశం కఠినంగా వ్యవహరిస్తోంది. గత ఏడాది యూఏఈలో తీవ్రవాద దాడులను మోదీ ఖండించారు. దీనిపై కలిసి పోరాడదామన్నారు.
 
వాతావరణ మార్పుల సమస్యలపై..
ఈసారి ఐక్యరాజ్యసమితి 28వ వాతావరణ మార్పు సదస్సు సీవోపీ-28ని యూఏఈ నిర్వహిస్తోంది. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ గ్రూప్ సీఈఓ సుల్తాన్ అహ్మద్ అల్ జబీర్‌ను దానికి చైర్మన్‌గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నియమించింది. ఈ ఏడాది నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు దుబాయ్‌లో ఈ సదస్సు జరగనుంది. సీవోపీ-28 అధ్యక్ష పదవి విషయంలో యూఏఈకి మోదీ పూర్తి మద్దతును ప్రకటించారు. "మోదీ ఫ్రాన్స్, యూఏఈ పర్యటనలతో భారత్‌కు ప్రయోజనం ఉంది. ఇంధన భద్రత, వాతావరణ మార్పుల సమస్యను పరిష్కరించడానికి ఆ దేశాల సహకారం చాలా ముఖ్యం'' అని ఫజ్జూర్ రెహ్మాన్ సిద్ధిఖీ అంటున్నారు.
 
యూఏఈ జనాభాలో 35% మంది ప్రవాస భారతీయులే
సుమారు కోటి మంది గల యూఏఈ జనాభాలో ప్రవాస భారతీయులు దాదాపు 35 శాతం మంది ఉన్నారు. వీళ్లందరు అక్కడ చాలా రంగాల్లో పని చేస్తున్నారు. యూఏఈ ఆర్థిక వ్యవస్థకు వారెంతో కీలకం. 2020లో ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన భారతీయులు ఇండియాకు రూ. 6.8 లక్షల కోట్ల వరకు పంపారు. అమెరికాలో స్థిరపడిన భారతీయుల నుంచి డబ్బు ఎక్కువగా వస్తోంది. అయితే గల్ఫ్ దేశాల నుంచి కూడా భారత్ పెద్దయెత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. 2020లో ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన భారతీయులు స్వదేశానికి పంపిన రూ. 6.8 లక్షల కోట్లలో యూఏఈ నుంచి వచ్చింది 18 శాతం. డబ్బు పంపే వారిలో ఎక్కువ మంది గల్ఫ్ దేశాల్లో ఉంటున్న భారతీయులే.
 
2018లో విదేశాల్లో స్థిరపడిన భారతీయులు తమ ఇళ్లకు రూ. 6.4 లక్షల కోట్లు పంపారు. ఇందులో యూఏఈలో పనిచేస్తున్న వారి వాటా రూ. లక్ష కోట్లు. సౌదీ అరేబియా నుంచి రూ. 91 వేల కోట్లు, కువైట్ నుంచి రూ. 33 వేల కోట్లు, ఒమన్ నుంచి రూ. 27 వేల కోట్లు పంపించారు.