గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 2 జూన్ 2020 (11:58 IST)

అన్‌లాక్ 1: భార‌త్‌లో కేసులు పెరుగుతున్నా లాక్‌డౌన్‌ను ఎందుకు స‌డ‌లిస్తున్నారు

భార‌త్‌లో కోవిడ్‌-19 ఇన్ఫెక్ష‌న్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అయితే ఇక్క‌డ మ‌రిన్ని ఆంక్ష‌లు విధించ‌డానికి బ‌దులుగా లాక్‌డౌన్ స‌డ‌లిస్తున్నారు. ఇలా ఎందుకు జ‌రుగుతోందో విశ్లేషిస్తూ బీబీసీ ప్ర‌తినిధి అప‌ర్ణ అల్లూరి అందిస్తున్న క‌థ‌న‌మిది. దేశ వ్యాప్తంగా విధించిన‌ లాక్‌డౌన్‌ను ముగించేందుకు స‌న్న‌ద్ధం అవుతున్న‌ట్లు భార‌త్ శ‌నివారం తెలిపింది.

 
ఇది అంద‌రూ ఊహించిన ప‌రిణామ‌మే. ప‌ది రోజుల క్రితం లాక్‌డౌన్ నిబంధ‌న‌లు స‌డ‌లించ‌డంతో ఇక్క‌డ రోడ్లు ర‌ద్దీగా మారిపోయాయి. మ‌రోవైపు ఆకాశంలో కాలుష్య మేఘాలూ ఎప్ప‌టిలా క‌మ్ముకున్నాయి. చాలావ‌ర‌కు వ్యాపార స‌ముదాయాలు, కార్యాల‌యాలు ఇప్ప‌టికే తెరు‌చుకున్నాయి. నిర్మాణ రంగ ప‌నులు మొద‌ల‌య్యాయి. మార్కెట్లు, పార్కుల్లో జ‌నం క‌నిపిస్తున్నారు. త్వ‌ర‌లో హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్‌, ప్రార్థ‌నా మందిరాలు, పాఠ‌శాల‌లు, కాలేజీలు తెర‌చుకోబోతున్నాయి.

 
క‌రోనావైర‌స్ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. భార‌త్‌లో లాక్‌డౌన్ మొద‌ల‌య్యేట‌ప్పుడు కేవ‌లం 519 కేసులు, 10 మ‌ర‌ణాలు మాత్ర‌మే అధికారికంగా న‌మోద‌య్యాయి. ఇప్పుడు అయితే కేసుల సంఖ్య 1,70,000 దాటిపోయింది. మ‌ర‌ణాలు ఐదు వేల‌కు స‌మీపిస్తున్నాయి. శ‌నివారం ఒక్క‌రోజు దాదాపు 8,000 కొత్త కేసులు న‌మోద‌య్యాయి.

 
ఎందుకు నిబంధ‌న‌లు స‌డ‌లిస్తున్నారు?
ఎందుకంటే లాక్‌డౌన్‌తో మొద‌లైన ఇబ్బందులు ఇక్క‌డ భరించ‌లేని స్థాయికి చేరిపోతున్నాయి. లాక్‌డౌన్‌ను ఎత్తివేసే స‌మ‌యం ఆస‌న్న‌మైంది అని సంక్ర‌మిక వ్యాధుల‌పై అధ్య‌య‌నం చేస్తున్న ప‌రిశోధ‌కులు, ప్రొఫెస‌ర్ గౌత‌మ్ మేన‌న్ చెప్పారు. "ఒక స్థాయికి చేరుకున్న త‌ర్వాత‌.. లాక్‌డౌన్‌ను కొన‌సాగించ‌డం చాలా క‌ష్టం. ఆర్థికంగా, సామాజికంగా, మాన‌సికంగా చాలా ఒత్తిడి ప‌డుతుంది."

 
మొద‌టిరోజు నుంచి లాక్‌డౌన్‌తో భార‌త్‌కు భారీ న‌ష్ట‌మే జ‌రుగుతూ వ‌స్తోంది. ముఖ్యంగా రోజు కూలీకి ప‌నిచేసే వారిపై లాక్‌డౌన్ తీవ్ర ప్ర‌భావం చూపింది. ఆహార స‌ర‌ఫ‌రా గొలుసులూ ఆంక్ష‌ల‌తో స‌త‌మ‌తం అయ్యాయి. కార్ల త‌యారీ సంస్థ‌ల‌తో మొద‌లుపెట్టి వీధి చివ‌ర సిగ‌రెట్లు అమ్మే దుకాణాల వ‌ర‌కు అన్ని ర‌కాల వ్యాపారాలూ ఇబ్బందుల్లో ప‌డ్డాయి. ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేల‌వ‌డంతోపాటు నిరుద్యోగ రేటు పెర‌గ‌డంతో.. భార‌త్ వృద్ధి రేటు 30 ఏళ్ల క‌నిష్ఠానికి దిగ‌జారిపోయింది.

 
ఏప్రిల్ చివ‌రినాటికి లాక్‌డౌన్‌ను పూర్తిగా స‌డ‌లించాల‌ని, లేక‌పోతే విధ్వంస‌క‌ర ప‌రిణామాలు ఎదుర‌వుతాయ‌ని ఆర్థిక‌వేత్త‌, రిజర్వు బ్యాంక్ మాజీ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ్ రాజ‌న్ వ్యాఖ్యానించారు. ఇదే అభిప్రాయాన్ని ప్ర‌ముఖ క‌న్స‌ల్టెన్సీ సంస్థ మెకెన్సీ కూడా వ్య‌క్తంచేసింది. ఇన్ఫెక్ష‌న్ ముప్పుతోపాటు భార‌త్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పైనా దృష్టి పెట్టాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని సంస్థ నొక్కి చెప్పింది.

 
"కేసుల పెరుగుద‌ల వాయిదా ప‌డేలా చూడ‌ట‌మే ల‌క్ష్యంగా లాక్‌డౌన్ విధించారు. కేసులు పెరిగినా త‌ట్టుకొనేందుకు ఆరోగ్య సదుపాయాలు, సిబ్బందిని సిద్ధంచేసేందుకు దీంతో గ‌డువు దొరికింది. ప్ర‌స్తుతం లాక్‌డౌన్‌ ల‌క్ష్యం చాలావ‌ర‌కు నెర‌వేరిన‌ట్టు అనిపిస్తోంది"అని ప్ర‌జారోగ్య నిపుణుడు డాక్ట‌ర్ ఎన్‌ దేవ‌దాస‌న్ తెలిపారు.

 
గ‌త రెండు నెల‌ల్లో ఆసుప‌త్రుల్లోని కోవిడ్‌-19 వార్డుల సంఖ్య పెంచ‌డంతోపాటు మైదానాలు, పాఠ‌శాల‌లు, రైలు పెట్టెల‌నూ భార‌త్ క్వారంటైన్ కేంద్రాలుగా మార్చింది. మ‌రోవైపు టెస్టింగ్తో పాటు వైద్య సిబ్బందికి అవస‌ర‌‌మైన భ‌ద్ర‌తా సామ‌గ్రి ఉత్ప‌త్తి కూడా పెరిగింది. ఇప్ప‌టికీ సామ‌గ్రి కొర‌త‌, స‌వాళ్లు ఉన్న‌ప్ప‌టికీ.. స‌దుపాయాలు స‌మ‌కూర్చుకునేందుకు ప్ర‌భుత్వానికి స‌రిప‌డా స‌మ‌యం దొరికింద‌ని అంద‌రూ అంగీక‌రిస్తున్నారు.

 
"మేం పూర్తిగా స‌న్న‌ద్ధం అయ్యేందుకు లాక్‌డౌన్‌ను ఉప‌యోగించుకున్నాం. ఇప్పుడు ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టే స‌మ‌యం వ‌చ్చింది." అని దిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ కూడా వ్యాఖ్యానించారు. మొద‌ట్లో కొన్ని వారాల‌పాటు భార‌త్‌లో అత్య‌ల్పంగా న‌మోదైన కేసులు ఆరోగ్య నిపుణుల్ని ఆశ్చ‌ర్యానికి గురిచేశాయి. అధిక‌ జ‌న సాంధ్ర‌తతోపాటు వ్యాధుల ముప్పు ఎక్కువ‌గా ఉండ‌టం, నిధుల కొర‌తతో ఉండే ప్ర‌భుత్వ ఆసుప‌త్రులు.. ఇలా ఎన్ని ముప్పులున్నా కేసులు మాత్రం పెద్ద సంఖ్య‌లో పెర‌గ‌లేదు.

 
అయితే త‌క్కువ కేసుల‌కు బ‌దులుగా లాక్‌డౌన్‌ను స‌రిగ్గా నిర్వ‌హించ‌లేక‌పోయారంటూ భార‌త్ ప‌తాక శీర్షిక‌ల్లో నిలిచింది. ఇక్క‌డ ల‌క్ష‌ల మంది అసంఘ‌టిత రంగ కార్మికులు రాత్రికిరాత్రే ఉపాధిలేక రోడ్డున ప‌డ్డారు. భ‌యంతో చాలామంది సుదూర ప్రాంతాల‌కు న‌డుచుకుంటూ, సైకిళ్ల‌పై ప‌య‌న‌మ‌య్యారు.

 
ఒక‌వైపు తీవ్రస్థాయిలో చెల‌రేగ‌నట్టుగా క‌నిపిస్తున్న వైర‌స్.. మ‌రొక‌వైపు ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా కుదేలుచేస్తున్న లాక్‌డౌన్‌.. ఈ రెండింటిలో ఒక‌దాన్ని ప్ర‌భుత్వం తేలిగ్గానే ఎంచుకోగ‌లిగింది. "అయితే కేసులు వేగంగా పెర‌గ‌డంతో ప‌రిస్థితులు త్వ‌ర‌గా మారుతున్నాయి. మ‌రిన్ని కేసులు వ‌స్తాయ‌ని అనిపిస్తోంది. చాలావ‌ర‌కు ఏ ల‌క్ష‌ణాలు లేనివి లేదా ల‌క్ష‌ణాలు త‌క్కువ‌గా ఉండే కేసులు బ‌య‌టప‌డే అవ‌కాశ‌ముంది." అని దేవ‌దాస‌న్ వివ‌రించారు.

 
బ‌య‌ట‌ప‌డని కేసుల్లో ఎక్కువ శాతం ఆసుప‌త్రి వైద్యం అవ‌స‌రంలేని కేసులే ఉండ‌టంతో లాక్‌డౌన్ స‌డ‌లించాల‌ని భార‌త్ భావిస్తోంది. ప్ర‌స్తుతానికి ముంబ‌యి త‌ప్పితే.. మ‌రెక్క‌డా ఆసుపత్రుల్లో బెడ్‌ల కొర‌త లేదు. భార‌త్ కోవిడ్‌-19 కేసుల‌ స‌మాచారంలో చాలా లోపాలున్నాయి. అయితే కొన్ని ప‌శ్చిమ దేశాల స్థాయిలో ఇక్క‌డ వైర‌స్ చెల‌రేగ‌లేద‌ని దీన్ని చూస్తే స్ప‌ష్టంగా తెలుస్తోంది.

 
ప్ర‌భుత్వం చెబుతున్న 3% మ‌ర‌ణ రేటు.. ప్ర‌పంచ దేశాల్లో న‌మోదైన అత్య‌ల్పాల్లో ఒక‌టి. అయితే కొంత‌మంది ఈ వాద‌న‌తో విభేదిస్తున్నారు. మ‌ర‌ణాల‌ను ప‌క్కాగా న‌మోదు చేసే వ్య‌వ‌స్థ భార‌త్‌కు లేద‌ని ప్ర‌ముఖ వైరాల‌జిస్ట్ జాక‌బ్ జాన్ తెలిపారు. కొన్ని క‌రోనావైర‌స్ మ‌ర‌ణాల‌ను భార‌త్‌ లెక్కించ‌లేక‌పోతోంద‌ని, మ‌ర‌ణాల‌న్నింటినీ ఎలా న‌మోదు చేయాలో అవ‌గాహ‌న లేద‌ని ఆయ‌న అన్నారు. "మొద‌ట మ‌నం మ‌ర‌ణాలను త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నించాలి. కేసులు కాదు."అని ఆయ‌న వ్యాఖ్యానించారు. జులై లేదా ఆగ‌స్టులో కేసులు విప‌రీతంగా పెరుగుతాయ‌ని జాన్‌తోపాటు మ‌రికొంద‌రు ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. స‌రిగ్గా అమ‌లుచేయ‌ని లాక్‌డౌన్‌లు వ్య‌ర్థ‌మ‌ని ప్ర‌భుత్వం గ్ర‌హించిన‌ట్లు వారు న‌మ్ముతున్నారు. ‌

 
వ్యూహంలో మార్పు
కేసులు విప‌రీతంగా పెరిగితే మ‌ళ్లీ లాక్‌డౌన్ విధించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉందా? భార‌త్‌లో లాక్‌డౌన్‌ను స‌రైన స‌మ‌యానికే విధించార‌ని, విదేశాల నుంచి వ‌చ్చిన కేసులపై దృష్టి ఎక్కువ‌ పెట్టార‌ని డాక్ట‌ర్ మేన‌న్ భావిస్తున్నారు. "ఆ కేసుల్ని అడ్డుకుంటే క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌గ‌ల‌మ‌ని ఓ న‌మ్మ‌కం ఉండేది. అయితే విమానాశ్ర‌యాల్లో స్క్రీనింగ్ ఎంత ప్ర‌భావ‌వంతంగా జ‌రిగింది?" ‌

 
స్థానికంగా లాక్‌డౌన్‌లు విధించేందుకు ఇది స‌రైన స‌మ‌య‌మ‌ని ఆయ‌న అన్నారు. క‌రోనావైర‌స్ వ్యాప్తి ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండ‌టంతో లాక్‌డౌన్‌ల‌ను పొడిగించ‌డం లేదా ఎత్తివేయ‌డం లాంటి నిర్ణ‌యాల‌ను రాష్ట్రాల‌కే కేంద్రం వ‌ద‌లిపెట్టింది. భార‌త్‌లోని యాక్టివ్ కేసుల్లో మూడో వంతు మ‌హారాష్ట్ర‌లోనే ఉన్నాయి. త‌మిళ‌నాడు, గుజ‌రాత్‌, దిల్లీ కేసులు కూడా క‌లిపితే 67 శాతం వ‌ర‌కూ ఉంటాయి. వ‌ల‌స కార్మికులు ఇళ్ల‌కు చేర‌డంతో బిహార్ లాంటి రాష్ట్రాల్లో కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతోంది.

 
మొద‌ట్లో కేసుల‌న్నీ న‌గ‌రాల‌కే ప‌రిమిత‌మై ఉండేవి. వ‌ల‌స కార్మికులు న‌గ‌రాలు దాటి పోయేందుకు అనుమ‌తించేవారు కాదు. ప్ర‌స్తుతం వారు సొంత ఇళ్ల‌కు వెళ్తున్నారు. ఇప్పుడు వైర‌స్‌ న‌గ‌రాల నుంచి గ్రామాల‌కు త‌ర‌లివెళ్లేందుకు మ‌న‌మే స‌దుపాయాలు ఏర్పాటుచేశాం అని దేవ‌దాస‌న్ వివ‌రించారు. లాక్‌డౌన్‌ల వ‌ల్ల దాదాపు 3,00,000 కేసులు, 71,000 మ‌ర‌ణాల‌ను అడ్డుకోగ‌లిగామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. అయితే ఇప్పుడు ప‌రిస్థితి ఎలా ఉండ‌బోతోందో ఎలాంటి స‌మాచార‌మూ లేదు.

 
లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించడం మొద‌లుపెట్టిన‌ప్పుడు‌... "కరోనా వైర‌స్‌ను క‌ట్ట‌డిచేసేందుకు అంద‌రూ నిబంధ‌న‌లు పాటించాలి. ఎందుకంటే ఇది మీ బాధ్య‌త"అని కేజ్రీవాల్ ట్వీట్‌చేశారు. ఎందుకంటే నిరంతరం ప‌ర్య‌వేక్షించ‌డం, క‌ర్ఫ్యూలు విధించ‌డం చాలా క‌ష్టం. "ప్ర‌జ‌లు సామాజిక దూరం పాటించేందుకు ప‌రిస్థితులు అనుకూలించ‌వ‌ని భ‌య‌మేస్తోంది"అని మేన‌న్ అన్నారు.

 
ఉమ్మ‌డి కుటుంబాలు, బ‌స్తీల్లో కిక్కిరిసిన ఒకే గ‌ది ఇళ్లు, ర‌ద్దీగా ఉండే మార్కెట్లు, వ్యాపార స‌ముదాయాలు, దేవాల‌యాలు, మ‌సీదులు, వివాహ వేడుక‌లు, మ‌త కార్య‌క్ర‌మాల్లో సామాజిక దూరం పాటించ‌డం చాలా క‌ష్టం. "వైర‌స్ ఇక్క‌డే ఉంటుంది. దానితోనే మ‌నం క‌లిసి బ‌త‌కడం నేర్చుకోవాలి. దీనికి మ‌న ముందున్న ఏకైక మార్గం.. వైర‌స్‌తో క‌లిసి ప్ర‌జ‌ల‌ను బ‌తికేలా చేయ‌డ‌మే" ఇదే అంతిమ సందేశంలా క‌నిపిస్తోంది.