బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 29 ఆగస్టు 2022 (20:23 IST)

విజయవాడ ఎయిర్‌పోర్టు: విమానం చార్జీ కన్నా క్యాబ్ చార్జీలు ఎందుకు ఎక్కువ? ఓలా, ఊబర్ ట్యాక్సీలను ఎందుకు అనుమతించట్లేదు?

Vijayawada airport
విజయవాడ ఎయిర్‌పోర్ట్ లోపలి నుంచి రామవరప్పాడు జంక్షన్ 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎవరైనా విమానం దిగి వచ్చి ఇక్కడ క్యాబ్ ఎక్కాలంటే ఫిక్స్‌డ్ చార్జ్ ఉంటుంది. దానిని చెల్లించాల్సిందే. రామవరప్పాడు వరకూ మాత్రమే అయితే ఎవరైనా సెడాన్ మోడల్ బండికి రూ.700 చెల్లించాలి. ఒకవేళ జంక్షన్ దాటి నగరంలోకి కొంచెం దూరం రావాల్సి ఉంటే, ఆ బిల్లు మరింత పెరుగుతుంది. అంటే దాదాపుగా కిలోమీటర్‌కు రూ.60 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. ఇక గుంటూరు వెళ్లాలనుకుంటే ఎయిర్‌పోర్ట్ నుంచి 56 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి రూ.1,500 చెల్లించాలి. అటు ఏలూరు వెళ్లాలనుకున్నా.. దాదాపు అంతే దూరానికి రూ.2వేలు ఇవ్వాలి. ఇవన్నీ ఫిక్స్ చేసిన చార్జీలు.

 
image
ఈ బిల్లు చూశారు కదా.. ఇది హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి గచ్చిబౌలీలోని ఓ హోటల్ చేరేందుకు క్యాబ్ బిల్లు. ఈ దూరం దాదాపు 30 కిలోమీటర్లు. పైగా అత్యంత రద్దీలో అనేక జంక్షన్లు దాటుకుంటూ వెళ్లాలి. అదే సెడాన్ బండి బిల్లు మొత్తం చూస్తే రూ.775 మాత్రమే. హైదరాబాద్ లో సాధారణంగా వసూలు చేసే చార్జీలు ఇవి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ చార్జీలు అటూ ఇటూ అవుతూ ఉంటాయి. అంటే విజయవాడ నగర శివారులో 12 కిలోమీటర్ల దూరాన ఉన్న రామవరప్పాడు జంక్షన్‌కు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో రూ. 700 వసూలు చేస్తే... అంతకన్నా రెట్టింపు దూరం, దానికి మించిన ట్రాఫిక్ సహా ఇతర అనేక సమస్యలున్న హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ నుంచి కేవలం రూ.775 మాత్రమే వసూలు చేస్తున్నారని స్పష్టమవుతోంది. అంటే కిలోమీటర్‌కు సుమారుగా రూ.25 వరకూ పడుతోంది.

 
image
ఈ బిల్లు చూడండి. ఇది చెన్నై నగరంలో మీనంబాక్కం ఎయిర్‌పోర్ట్ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 6గంటలు పాటు తిరిగితే 65 కిలోమీటర్ల దూరానికి వేసిన చార్జ్. అది కూడా కేవలం రూ.1089 మాత్రమే. అంటే విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి రామవరప్పాడుకి అత్యధికంగా 20 నిమిషాల్లో చేరుకునేందుకు చెల్లించాల్సిన మొత్తంతో పోలిస్తే చెన్నైలో 6గంటల వినియోగానికి 65 కిలోమీటర్ల దూరానికి చెల్లించిన బిల్లుకి పెద్ద తేడా లేదు. అదే 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు బిల్లుతో పోల్చినా చెన్నైలో 65 కిలోమీటర్ల దూరానికి తక్కువ చార్జ్ వసూలు చేస్తున్నారు.

 
ఇంత తేడా ఎందుకు
విజయవాడ, హైదరాబాద్, చెన్నై వంటి ఎయిర్‌పోర్టులలో ఇంత తేడా ఎందుకుందనే ప్రధానమైన ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. హైదరాబాద్ నుంచి విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు చేరేందుకు దాదాపు రూ.3వేల టికెట్ చార్జీతో ప్రయాణం చేయాలి. అంటే కిలోమీటర్‌కు సుమారుగా రూ.15 లోపు చార్జ్ అవుతుంది. కానీ విమానం దిగి కార్‌లో ప్రయాణించాలంటే మాత్రం ప్రతీ కిలోమీటర్‌కు దానికి మూడు రెట్లు అదనంగా వసూలు చేస్తుండడం విశేషం. విజయవాడతో పోలిస్తే హైదరాబాద్, చెన్నై ఎయిర్‌పోర్ట్ క్యాబ్ చార్జీలలో తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం అక్కడ ఓలా, ఉబర్ వంటి ఆన్‌లైన్ క్యాబ్ సర్వీసులకు అనుమతి ఉంది. కానీ విజయవాడలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది.

 
"మీరు ఏ క్యాబ్ ఎక్కాలన్నది మీ ఇష్టం కాదు. ఎయిర్‌పోర్ట్ లాంజ్ నుంచి బయటకు రాగానే ఓ క్యాబ్ సర్వీస్ ఉంటుంది. వాళ్లు చెప్పిన ధర చెల్లించి మనం క్యాబ్ బుక్ చేసుకోవాలి. మనం ఎక్కడికి వెళ్లాలో చెబితే వాళ్లే ఫిక్స్ చేసిన చార్జ్ ఉంటుంది. దానిని చెల్లించి మనం ప్రయాణం చేయాలి. మరో ప్రత్యామ్నాయం లేదు. సొంత కారు ఉంటే లోపలికి అనుమతిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి క్యాబ్ మీద ఆధారపడే వాళ్లు మాత్రం అక్కడ ఎయిర్ పోర్టులో చెప్పిన చార్జ్‌కే అంగీకరించాలి. లేదంటూ అక్కడి నుంచి కిలోమీటర్‌కు పైగా బయట రోడ్డు మీదకి నడిచి వచ్చి ఇతర క్యాబ్ లేదా మరో వాహనం వెదుక్కోవాల్సిందే అన్నట్టుగా ఉంది"అని ప్రయాణీకుడు ఆర్ రమేష్ అన్నారు. చెల్లించిన దానికి బిల్లు కూడా ఇవ్వలేదని, దేశంలో ఏ ఎయిర్‌పోర్టులోనూ ఇలాంటి సమస్య తనకు ఎదురుకాలేదని ఆయన తెలిపారు. కొన్ని చోట్ల ప్రీపెయిడ్ క్యాబ్ సర్వీసులున్నప్పటికీ చార్జీలు ఇంత ఎక్కువగా లేవని బీబీసీకి ఆయన తెలిపారు.

 
రెండేళ్లుగా అనుమతించడం లేదు..
కరోనాకి ముందు వరకూ ఎయిర్‌పోర్ట్ లోపలికి అన్ని క్యాబ్స్‌ను అనుమతించేవారు. కానీ ప్రస్తుతం ఓలా, ఊబర్ సహా ట్యాక్సీలకు అక్కడ పార్కింగ్ చేసేందుకు అనుమతి లేదు. ప్రస్తుతం విజయవాడ ఎయిర్‌పోర్టులో హర్షిణి కార్ రెంటల్ సర్వీస్ అనే సంస్థ క్యాబ్‌లు నడుపుతోంది. ఆ సంస్థకు చెందిన ట్యాక్సీలకు మాత్రమే ఎయిర్‌పోర్ట్ ఆవరణలో పార్కింగ్‌కు అనుమతించారు. సొంత వాహనాలు మినహా ఇతర ఎల్లో బోర్డు ఉన్న వాహనాలకు మాత్రం అవకాశం లేదని చెబుతున్నారు.

 
"గతంలో మేము ప్రయాణీకుల డ్రాపింగ్, పికప్ కూడా లోపలి నుంచి చేసేవాళ్లం. ఇప్పుడు మాకు అవకాశం లేదు. కాబట్టి మేము ఎయిర్‌పోర్ట్ గేటు బయట రోడ్డు పక్కన నిలుపుతాం. ఎవరైనా ప్రయాణీకులు అంత దూరం నడిచి వస్తే మాకు బుకింగ్స్ వస్తాయి. రోడ్డు మీద నిలుపుకుంటే పోలీసుల వేధింపులు కూడా తప్పవు. ఓలాలో బుక్ చేస్తే ఎయిర్‌పోర్ట్ నుంచి రామవరప్పాడు జంక్షన్‌కు రూ. 550 బిల్లు వస్తుంది. కొన్ని సార్లు లోపల హర్షిణి రెంటల్ సర్వీస్ వాళ్ల కార్లు అందుబాటులో లేనప్పుడు కూడా మమ్మల్ని పిలిచి మాకు రూ.550 మాత్రమే ఇస్తారు. ప్రయాణీకుల నుంచి మాత్రం రూ.700 వసూలు చేస్తుంటారు"అని ఓలాలో ట్యాక్సీ నడుపుతున్న విజయవాడకు చెందిన డ్రైవర్ కే బాలసుబ్రహ్మణ్యం అన్నారు. అన్ని క్యాబ్స్‌కు అవకాశం ఉన్నప్పుడు పోటీ వల్ల ప్రయాణీకులకు కొంత చౌకగా సర్వీసు అందేది, మాకు బుకింగ్స్ పడేవి, ఇప్పుడు అలాంటి అవకాశం లేదని ఆయన బీబీసీకి తెలిపారు.

 
ఎయిర్‌పోర్ట్ అథారిటీ లైసెన్స్ ఉంది..
విజయవాడ ఎయిర్‌పోర్టులో క్యాబ్ సర్వీసులు ఆపరేట్ చేస్తున్న హర్షిణి కార్ రెంటల్ సర్వీసు సంస్థ ప్రతినిధులను బీబీసీ సంప్రదించింది. తమకు అధికారికంగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులున్నాయని వారు తెలిపారు. "మాకు అన్ని అర్హతలు ఉన్నాయి. నిబంధనల ప్రకారమే క్యాబ్ సర్వీసులు నడుపుతున్నాం. ఆ కార్ రెంటల్ సర్వీసు నడిపేందుకు ఏఏఐకి ఫీజులు చెల్లిస్తున్నాం. అన్ని వాహనాలను అనుమతిస్తే కాంట్రాక్ట్ పొందిన మాకు ప్రయోజనం ఏముంటుంది. చార్జీలు ఎక్కువగా వసూలు చేయడానికి పెట్రోలు ధరలు పెరగడమే కారణం. ఈ మధ్య ఎయిర్‌పోర్ట్ ప్రయాణీకుల సంఖ్య కొంత తగ్గింది. అందువల్ల మా దగ్గర ఉన్న క్యాబ్స్‌కే తగిన బుకింగ్స్ రావడం లేదు" అంటూ హర్షిణి సంస్థ ప్రతినిధి ప్రసాద్ బీబీసీకి తెలిపారు. ఎయిర్‌పోర్ట్ నుంచి ఇతర ప్రాంతాలతో పాటుగా విజయవాడ నుంచి ఎయిర్‌పోర్ట్ కి కూడా సర్వీసులు నడుస్తున్నాయని, అన్నింటికీ ఫిక్స్‌డ్ చార్జీలు ఉంటాయని ఆయన అన్నారు.

 
ఉన్నతాధికారులే చెప్పాలి..
చెన్నై హైదరాబాద్‌తో పోల్చినా విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి క్యాబ్ చార్జీలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో విజయవాడలో ఇతర సర్వీసుల చార్జ్ కన్నా ఎయిర్‌పోర్ట్ అథారిటీ లైసెన్సు ఉందని చెబుతున్న హర్షిణి సంస్థ వసూలు చేస్తున్న రేట్లు ఎక్కువే. ఈ అంశంపై వివరణ కోసం ఎయిర్ పోర్ట్ అథారిటీ ప్రతినిధులను బీబీసీ సంప్రందించింది. కానీ అధికారికంగా స్పందించేందుకు వారు నిరాకరించారు. ఉన్నతాధికారుల నుంచి సమాచారం తీసుకోవాలని అన్నారు. నిబంధనలను అనుసరించి, హర్షిణి సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించామని, ఓలా, ఉబర్ వంటి సంస్థలు లైసెన్సు ఫీజు చెల్లించేందుకు సిద్ధం కావడం లేదని ఓ అధికారి వివరించారు.

 
ఏపీలో వైజాగ్, తిరుపతి సహా ఏ ఎయిర్‌పోర్ట్‌లోనూ లేని విధంగా ఏకపక్షంగా ఒకే సంస్థ నిర్వహణలో క్యాబ్ సర్వీసులు ఉండడం పట్ల కన్స్యూమర్ ఫోరం ప్రతినిధి కే సురేష్ ఆందోళన వ్యక్తం చేశారు. అధిక ధరలు వసూలు చేస్తున్న వ్యవహారం మీద ఎయిర్‌పోర్ట్ అథారిటీ దృష్టి పెట్టాలని ఆయన కోరారు. "ఎయిర్ పోర్ట్ క్యాబ్ సర్వీసుల్లో ఒక్కరే పెత్తనం చేయడంపై ఫిర్యాదు చేస్తాం. దీనిని అడ్డుకోవాలని కోరుతాం. స్పందించకపోతే చట్టపరంగా చర్యలకు కూడా ప్రయత్నిస్తాం"అని ఆయన బీబీసీకి తెలిపారు. క్యాబ్ ఆపరేటర్ల నుంచి లైసెన్సు ఫీజుల పేరుతో వినియోగదారుల మీద భారం మోపే విధానం సరికాదని సురేష్ అన్నారు.