గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 4 జులై 2023 (13:40 IST)

ఫోన్ వేడెక్కితే ఏమవుతుంది? వేడెక్కకూడదంటే ఏంచేయాలి?

10t5g mobile
మధ్యాహ్నం మండే ఎండలో భోజనానికి బయటకు వెళ్లారు అనుకోండి.. అప్పుడు ఫోన్ కూడా వేడెక్కుతుంది. ప్రస్తుతం వర్షాలు పడుతున్నప్పటికీ, కొన్నిచోట్ల ఎండలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఎండలతో మన శరీరం ఒక్కటే కాదు, ఎలక్ట్రానిక్స్ కూడా ప్రభావితం అవుతాయి. ఇంతకూ ఉష్ణోగ్రతలు ఎక్కువైనప్పుడు మొబైల్ ఫోన్లు పనిచేయడం ఎందుకు కష్టం అవుతుంది, వేడి నుంచి మన ఫోన్లను కాపాడుకోవాలంటే ఏం చేయాలి?
 
వేడి ఎక్కువైనప్పుడు ప్రాసెసర్లకు ఏమవుతుంది?
ఎండలో కాస్త వేగంగా పనిచేయడానికి మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్ ప్రాసెసర్ల విషయంలోనూ ఇదే జరుగుతుంది. మన ఫోన్‌లో ప్రధానమైన ఫంక్షన్లన్నింటినీ లోపలుండే ఈ చిప్‌లే నడిపిస్తాయి. ఈ విషయంపై లీడ్స్ బెకెట్ యూనివర్సిటీలోని ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సీనియర్ లెక్చరర్ డా. రోజ్ వాట్ మిల్లింగ్టన్ మాట్లాడుతూ.. ‘‘మొబైల్ ఫోన్‌ను నడిపించే లోపలుండే పరికరాలు పనిచేసేటప్పుడు కూడా ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంటాయి’’ అని చెప్పారు. ‘‘ఫోన్ వేడెక్కేటప్పుడు మరింత ఓవర్‌హీట్ అవ్వకుండా చూసేందుకు ప్రాసెసర్ కొన్నిసార్లు స్తంభించిపోతుంది. ఫలితంగా ఫోన్‌లో స్పీడ్ తగ్గిపోతుంది. ఒక్కోసారి ఇది మొరాయిస్తుంది కూడా’’ అని రోజ్ అన్నారు.
 
సాధారణంగా ఫోన్లను 35 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు కొంచెం అటూఇటూ ఉండే ఉష్ణోగ్రతల్లో పనిచేసేలా తయారుచేస్తారని డాక్టర్ రోజ్ చెప్పారు. ‘‘ఎనర్జీని స్టోర్ చేసే బ్యాటరీలను నిర్దేశిత ఉష్ణోగ్రతల్లో పనిచేసేలా సిద్ధంచేస్తారు. ఉష్ణోగ్రతలు పెరిగేటప్పుడు అవి మరింత కష్టపడాల్సి ఉంటుంది. అంటే మరింత ఎనర్జీ అవసరం అవుతుంది. అంటే బ్యాటరీ చాలా త్వరగా అయిపోతుంటుంది’’ అని ఆమె వివరించారు. ‘‘ఒక్కోసారి ఎండలో ఉండేటప్పుడు మనం బ్రైట్‌నెస్‌ను పెంచుతుంటాం. బ్యాటరీ త్వరగా అయిపోవడానికి ఇది కూడా ఒక కారణం’’ అని ఆమె తెలిపారు.
 
స్క్రీన్ బర్న్
ఎండలో ఉండేటప్పుడు మీ స్క్రీన్‌లో ఏదైనా మార్పులు కనిపిస్తున్నాయా? దీనికి ఉష్ణోగ్రతలే కారణం కావచ్చు. ‘‘ఫోన్ కాస్త పాతదైతే, లేదా కాస్త ఎక్కువ రోజులు దాన్ని వాడినా.. ఉష్ణోగ్రతల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.’’ అని రోజ్ చెప్పారు. ‘‘స్క్రీన్ ప్రొటెక్టర్లు మరింత ఉష్ణోగ్రతలను గ్రహించగలవు. ఇది ఫోన్‌కు అసలు మంచిదికాదు. మొత్తంగా ఉష్ణోగ్రతల వల్ల స్క్రీన్ బర్న్ కావచ్చు.’’ అని ఆమె చెప్పారు.
 
ఫోన్ చల్లబరిచేందుకు ఏం చేయాలి?
చార్జింగ్ పెట్టి వదిలేయొద్దు.. ‘‘బయట వేడిగా ఉండేటప్పుడు, బ్యాటరీని చార్జింగ్ పెడితే మొబైల్ వేడిగా అవుతుంది. మనం ఆ చార్జింగ్‌ను అలా పెట్టి వదిలేస్తే, ఫోన్ మరింత వేడెక్కుతుంది.’’ అని రోజ్ చెప్పారు.
 
నేరుగా ఎండ తగలనివ్వొద్దు..
‘‘నేరుగా ఎండ పడే చోటులో మొబైల్ ఉంచకూడదు. కారులో కూడా మొబైల్ వదిలిపెట్టి వెళ్లకూడదు. వీలైనంత వరకూ నీడలో పెట్టండి. కుదిరితే ఫ్యాన్‌కు ఎదురుగా కూడా పెట్టొచ్చు’’ అని ఆమె అన్నారు.
 
తేలిగ్గా ఉండేలా చూడండి
ఇది ఫోన్ లోపల, బయట రెండింటికీ వస్తుంది. లోపల అంటే మీరు ఉపయోగించని అప్లికేషన్లను క్లోజ్ చేయండి. అదే బయట అంటే ఫోన్ కేస్‌లను కాసేపు తొలగించండి. ‘‘మీరు జీపీఎస్ ప్రస్తుతం వాడకపోతే, దాన్ని ఆపేయండి. ఎందుకంటే ఎంత తక్కువ ఉపయోగిస్తే, అంత ఎనర్జీ ఆదా అవుతుంది. ఫలితంగా ఫోన్ ఉష్ణోగ్రతలను కాస్త తగ్గించుకోవచ్చు’’ అని రోజ్ చెప్పారు. ఫోన్‌ను ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మెరుగ్గా పనిచేస్తుంది. ‘‘కొన్నిసార్లు మీ ఫోన్ మరీ కష్టపడుతుంటే, కొన్ని నిమిషాలపాటు స్విచ్చాఫ్ చేయండి. కాసేపు దాన్ని చల్లబడనివ్వండి. తర్వాత మళ్లీ ఆన్ చేసుకోండి’’ అని రోజ్ సూచించారు.
 
ఫ్రిడ్జ్‌లో మాత్రం పెట్టొద్దు
‘‘చల్లని ఐస్ ముక్కల సంచిలో ఫోన్‌ను మాత్రం పెట్టొద్దు. ఎంతకంటే దీని వల్ల ఉపయోగం ఉండదు’’ అని రోజ్ చెప్పారు. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడం అనేది ఫోన్‌కు మంచిదికాదు. మరోవైపు ఐస్ ముక్కల్లోని నీరు లోపలకు కూడా వెళ్లొచ్చు. ‘‘పెరిగే ఉష్ణోగ్రతల వద్ద ఎలా పనిచేయాలో నిర్దేశించే ఓవర్‌హీట్ వ్యవస్థలు ఫోన్లలో ఉంటాయి. మరీ విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు మాత్రమే ఇవి దెబ్బతింటాయి.’’ అని రోజ్ చెప్పారు.