శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (20:28 IST)

వేలంటైన్స్ డే రోజున ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఏం చేశాడంటే: సినిమా రివ్యూ

'వరల్డ్ ఫేమస్ లవర్'నంటూ హీరో విజయ్ దేవరకొండ ప్రేమికుల రోజున ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఓనమాలు, మళ్లీమళ్లీ ఇది రాని రోజు వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రాంతి మాధవ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నిజంగానే వరల్డ్ ఫేమస్ లవర్ అనిపించాడా అంటే కథలోకి వెళ్లాల్సిందే.

 
గౌతమ్ (విజయ్ దేవరకొండ), యామిని (రాశి ఖన్నా) సినిమా ప్రారంభంలోనే సహజీవనంలో ఉన్న జంటగా కనిపిస్తారు. చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాలో స్థిరపడిన వీరిద్దరి పెళ్లికి అడ్డంకి ఇలాంటి అన్ని సినిమాల్లో మాదిరే హీరోయిన్ తండ్రే విలన్. తండ్రికి ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఆయనను కష్టపెట్టడం ఇష్టం లేక, అలా అని ప్రేమించిన గౌతమ్‌ను వదులుకోలేక సహజీవనానికి సిద్ధపడుతుంది యామిని. ఇలా కథ ప్రశాంతంగా సాగుతున్న సమయంలో తనకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదని, రైటర్‌గా తానేమిటో నిరూపించుకోవాలని ఉందని, కొంతకాలం పాటు బ్రేక్ కావాలని యామినికి చెప్తాడు గౌతమ్. యామిని అందుకు ఓకే అంటుంది.

 
అయితే, ఎంత కాలమైన ఒక్క కథ కూడా రాయకుండా సోమరిలా కాలం వృథా చేయడమే కాకుండా తనపై ఎలాంటి ఆదరణా చూపని గౌతమ్‌కు బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది యామిని. వారిద్దరి మధ్య ప్రేమ మొదలవడం నుంచి బ్రేకప్ వరకు ప్లాష్ బ్యాక్‌ల రూపంలో సినిమాలో వచ్చే ఉపకథల మధ్యలో చూపిస్తూ ముందుకు నడిపించాడు దర్శకుడు. అయితే ఈ ఉప కథలకు, ప్రధాన కథకు మధ్య ఉండే లింకేమిటి..? యామిని, గౌతమ్ మళ్లీ కలుస్తారా లేదా అన్నదే కథలో కీలకం.

 
ట్రైలర్‌లోని అస్పష్టతే సినిమాలోనూ..
'వరల్డ్ ఫేమస్ లవర్' ట్రైలర్ చూసినప్పుడు కనిపించిన గజిబిజితనమే సినిమాలోనూ కంటిన్యూ అయింది. ఒక జంట మధ్య వచ్చే డిస్టర్బెన్స్‌కి సంబంధించిన కారణాలను సెన్సిటివ్‌గా చెప్పాలన్న ఆలోచన బాగున్నప్పటికీ కథను ఒకే టెంపోలో చివరి వరకు నడిపించడంలో దర్శకుడు ప్రతిభ కనబరచలేకపోయారు.

 
పర్సనల్ లైఫ్‌లో కలిగిన బాధను కసిగా మార్చుకుని రచయితగా మారి సినిమాలో వచ్చే రెండు ఉపకథలను రాస్తాడు గౌతమ్. ఆ రెండు ఉపకథలకు అదనంగా తన కథను జోడించగా ముగింపు లేకుండానే పబ్లిషయిన 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే కథ హీరో ఫ్రెండ్‌తో కంటతడి పెట్టిస్తుంది. అదే కథ ఒక ఫ్రెండ్ తండ్రి లక్షలు ఖర్చుపెట్టి పుస్తకంగా ప్రచురించేలా చేస్తుంది. ఆ పుస్తకం 50 లక్షల కాపీలు అమ్ముడై రికార్డు సృష్టిస్తుంది. ఆ పుస్తకం చదివిన ప్రతి ఒక్కరూ అందులోని వేదనలో మునిగిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ రచయితకు అభిమానులుగా మారిపోతారు. ఆయన ఎప్పుడెప్పుడు జైలు నుండి బయటకు వస్తాడా? ఆ కథకు ఎలాంటి ముగింపునిస్తాడా? అని ఎదురుచూస్తుంటారు.

 
సినిమా ప్రధాన కథలోనే జీవం కనిపించదు. హీరో గౌతమ్ ఎందుకోసం స్ట్రగుల్ అవుతున్నాడు, ఆయనకు ఏం కావాలన్న విషయం సినిమాలో స్పష్టంగా చెప్పలేకపోయారు. కొన్నికొన్ని చోట్ల విజయ్ దేవరకొండ ఇంతకుముందు నటించిన 'అర్జున్ రెడ్డి' తరహాలో ఈ సినిమా ఉండాలన్నట్లుగా అసందర్భమైన సన్నివశాలు జోడించడంతో అవి ఎబ్బెట్టుగా అనిపిస్తాయి.
వరల్డ్ ఫేమస్ లవర్

 
‘ఐశ్వర్య రాజేశ్ ఆకట్టుకుంది’
సినిమా ప్రధమార్థంలో ఇల్లందు బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఉపకథ చూస్తున్నంతసేపు 'వరల్డ్ ఫేమస్ లవర్' అద్భుతంగా అనిపిస్తుంది. తెలంగాణ మాండలికంలో సాగే సంభాషణలు, విజయ్ దేవరకొండ, ఐశ్వర్య రాజేష్‌ నటన, రచయిత కమ్ దర్శకుడిగా క్రాంతి మాధవ్ ప్రతిభ సినిమాను మరో ఎత్తుకు తీసుకెళ్తాయి. సినిమా మొత్తం అదే ఫ్లోలో సాగితే అద్భుతమైన క్లాసిక్‌గా మిగిలిపోయేది.

 
కానీ ద్వితీయార్ధంలో ప్యారిస్ నేపథ్యంలో సాగే ఉపకథ కానీ, ఇంటెన్సిటీ లోపించిన ప్రధాన కథ కానీ పేలవంగా ఉండి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. అక్కడక్కడ కొన్నిసన్నివేశాలు బాగున్నా మొత్తంగా ఈ సినిమా నిరాశపరుస్తుంది.

 
ఎవరి ప్రతిభ ఎలా ఉంది
విజయ్ దేవరకొండ నటన సినిమాకు గొప్ప బలం. సినిమాలో అతడి పాత్ర డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తుంది. నటనపరంగా విజయ్ దేవరకొండ వైవిధ్యం చూపించారు. యామిని లాంటి బరువైన పాత్రకు రాశి ఖన్నా కాకుండా ఇంకెవరైనా అయితే బాగుండేదన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇల్లందు బ్యాక్ డ్రాప్‌లో సాగే కథలో ఐశ్వర్య రాజేశ్ మంచి పర్ఫార్మెన్స్ కనబరిచింది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా తెర మీద కనిపించినంతసేపు అద్భుతంగా మెరిసిపోయింది. కేథరిన్ థ్రెసా, ఇజబెల్లా ఫరవాలేదనిపిస్తారు. ప్రియదర్శి గురించి గొప్పగా చెప్పడానికేమీ లేదు. జయప్రకాశ్ సహాయ పాత్రలో ఉనికిని చాటుకున్నాడు.

 
ప్రేమ కథలకు మంచి సంగీతం సమకూరుస్తారని పేరున్న గోపీసుందర్ సంగీతం అంతంతమాత్రంగా ఉంది. సినిమాకు పాటలు, నేపథ్య సంగీతం పెద్ద బలహీనతయ్యాయి. జయకృష్ణ గుమ్మడి ఛాయాగ్రహణం ఫరవాలేదనిపించింది.