శనివారం, 18 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 18 డిశెంబరు 2024 (12:24 IST)

145 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇంకా ఎక్కువ మంది పిల్లలను కనాలని అంటున్నారు ఎందుకు?

population
భారత్ గత ఏడాది చైనాను దాటి అత్యధిక జనాభా గల దేశమైందని ఐక్యరాజ్య సమితి అంచనాలు చెబుతున్నాయి. 145 కోట్ల జనాభా మార్కును చేరుకున్నాక, ఇక జనాభా పెరుగుదలకు ఈ దేశం ప్రాధాన్యం ఇవ్వదని అనుకోవడం సహజం. కానీ ఇప్పుడు జనాభా పెంపుపై చర్చ మరింత పెరిగింది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల ప్రజలు ఎక్కు మంది పిల్లల్ని కనాలంటూ పిలుపునిచ్చారు. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టింది. ఇంతకుముందు, ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు. కానీ, ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆ నిబంధనను రద్దు చేసింది.
 
అంతే కాకుండా, తక్కువ సంతానోత్పత్తి రేటు.. జనాభాలో వృద్ధుల సంఖ్య పెరుగుతుండడాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ప్రోత్సాహకాలు అందించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలో ఇలాంటి నిర్ణయాన్ని అమలు చేయబోతోందని కొన్ని కథనాలు చెబుతున్నాయి. మరో పొరుగు రాష్ట్రం తమిళనాడు కూడా ఇదే తరహా విధానాలను అమలు చేసే ఆలోచనలో ఉంది. భారత్‌లో సంతానోత్పత్తి రేటు కొన్ని దశాబ్దాలుగా తగ్గుతూ వస్తోంది. 1950లో సగటున ఒక మహిళ 5.7 మంది పిల్లలను కంటే, ప్రస్తుతం ఆ సగటు రెండుకు పడిపోయింది.
 
17 రాష్ట్రాలలో ఈ సగటు జనాభా స్థిరీకరణ స్థాయి కంటే తక్కువగా ఉంది. స్థిరీకరణ స్థాయి అంటే జనాభా సంఖ్యలో భారీ పతనం లేకుండా ఉండేందుకు అవసరమైన జననాల రేటు. ప్రస్తుతం దక్షిణాదిలోని 5 రాష్ట్రాల సగటు సంతానోత్పత్తి రేటు 1.6 కన్నా తక్కువగా ఉంది. కర్ణాటకలో సంతానోత్పత్తి రేటు 1.6, తమిళనాడులో 1.4గా ఉంది. అంటే ఈ రాష్ట్రాలలో సంతానోత్పత్తి రేట్లు అనేక యూరప్ దేశాలతో సమానంగా కానీ అంతకంటే తక్కువ కానీ ఉన్నాయి. అయితే దేశంలో మారుతున్న జనాభా గణాంకాలు ఎన్నికల ప్రాతినిధ్యం, రాష్ట్రాలవారీ పార్లమెంట్ స్థానాలు, కేంద్రం నుంచి అందాల్సిన నిధులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి.
 
ఆర్థికంగా కొన్ని ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంటూ దేశ ఆదాయం పెంపులో తమ వంతు పాత్ర పోషిస్తున్నా జనాభా నియంత్రణ విధానాల వల్ల తాము మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని దక్షిణ రాష్ట్రాలు భావిస్తున్నాయి. జనాభా ఆధారంగా కేంద్రం నుంచి వచ్చే నిధుల వాటాలో నష్టపోతున్నామని ఈ రాష్ట్రాలు భావిస్తున్నాయని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ గోలి 'బీబీసీ'తో చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రణాళికపైనా దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విధానంలో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన చేపడతారు. అప్పుడు ఆర్థికంగా సంపన్నంగా ఉన్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ సీట్లు తగ్గే అవకాశాలుంటాయి.
 
కేంద్రం ఇచ్చే నిధులను జనాభా పరంగా కేటాయిస్తే అప్పుడు ఆర్థిక ఇబ్బందులు రెట్టింపవడంతో పాటు విధానాల రూపకల్పన కష్టతరం అవుతుందని దక్షిణాది రాష్ట్రాలు భావిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువ పార్లమెంటు సీట్లు దక్కించుకుంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలు సీట్లను నష్టపోయే అవకాశాలున్నాయి. ఇది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రభావం చూపుతుందని పరిశీలకులు కేఎస్ జేమ్స్, శుభ్ర కృతి అంచనా వేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా అనేక మంది బీజేపీ నాయకులు నిధుల కేటాయింపు, పార్లమెంటు సీట్ల కేటాయింపులలో మార్పుల ప్రక్రియలో తొందరపడబోమనే సూచనలు ఇచ్చారు.
 
'వాస్తవానికి రాష్ట్రాలు ఈ అంశాలపై ఎక్కువ ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇవి కేంద్రంతో పరస్పర చర్చలలో పరిష్కరించుకోగలిగిన సమస్యలే. అసలైన సమస్య మరొకటి ఉంది' అని శ్రీనివాస్ గోలి అన్నారు. జనాభాలో వృద్ధుల సంఖ్య పెరుగుతుండడం, అదే సమయంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతుండడం అనేది భారత్ ఎదుర్కోవాల్సిన కీలక సవాల్ అని ఆయన అన్నారు. ఫ్రాన్స్‌ జనాభాలో వృద్ధుల సంఖ్య 7 శాతం నుంచి 14 శాతానికి పెరగడానికి 120 ఏళ్లు.. స్వీడన్‌లో ఇంతేస్థాయిలో రెట్టింపు కావడానికి 80 ఏళ్లు పట్టగా భారత్‌లో అందుకు 28 ఏళ్లే పట్టొచ్చని శ్రీనివాస్ అంచనా వేశారు. వృద్ధుల సంఖ్య పెరుగుదలకు, సంతానోత్పత్తి రేటు తగ్గుతుండడమే కారణంగా చెప్పుకోవచ్చు.
 
అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినప్పుడు భారత్‌లో సామాజిక, ఆర్థిక ఎదుగుదల అంతంతమాత్రమే అయినా సంతానోత్పత్తి రేటు తీవ్రంగా పడిపోయింది. దేశవ్యాప్తంగా చిన్న కుటుంబాలను ప్రోత్సహించిన కుటుంబ సంక్షేమ పథకాలే ఈ మార్పును సాధ్యం చేశాయి. అయితే ఈ పరిణామం అనుకోని ఫలితాలకు దారి తీసింది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌ను తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ సంతానోత్పత్తి రేటు 1.5గా ఉంది. అంటే స్వీడన్ దేశ సంతానోత్పత్తి రేటుకు సమానం. కానీ ఆ దేశ తలసరి ఆదాయం కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం 28 రెట్లు తక్కువ. మరి పెరుగుతున్న అప్పులు, పరిమిత వనరులతో కొట్టుమిట్టాడుతున్న ఈ రాష్ట్రాలు వృద్ధుల సంఖ్యకు తగినట్లుగా అధిక పెన్షన్లతో పాటు సామాజిక భద్రత అందించడానికి సిద్ధంగా ఉన్నాయా?
 
యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్(యూఎన్‌ఎఫ్‌పీఏ) తాజాగా విడుదల చేసిన 'ఇండియా ఏజింగ్' నివేదిక ప్రకారం దేశంలో 60 ఏళ్లు దాటిన వృద్ధుల్లో 40 శాతం మంది నిరుపేదలు. అంటే 'భారత్ ధనిక దేశంగా మారక ముందే వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది' అని శ్రీనివాస్ అన్నారు. దీని వల్ల పిల్లలు, వృద్ధుల నిష్పత్తిలో వ్యత్యాసం పెరగనుంది. అంటే పెరుగుతున్న వృద్ధుల జనాభా బాగోగులు చూసుకునేవారి సంఖ్య తగ్గిపోతుంది. భారత దేశ ఆరోగ్య సంక్షేమ వ్యవస్థ, వృద్ధాశ్రమాలు ఈ పరిణామాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేరని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగరీకరణ, వలసలు, మారుతున్న లేబర్ మార్కెట్స్ ఈ విపత్తుకు మరింత ఆజ్యం పోస్తున్నాయి.
 
అధిక జనాభా ఉన్న రాష్ట్రాల నుంచి తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు వలసలు పెరగడం వల్ల యువకులు, వృద్ధుల సంఖ్య మధ్య అంతరాన్ని తగ్గించడం సులభమే అయినా ఆయా రాష్ట్రాలలో వలస వచ్చినవారి పట్ల వ్యతిరేకతను ప్రేరేపించే అవకాశం ఉంది. వృద్ధుల ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు పెట్టడం ఇప్పుడు అత్యవసరం అని శ్రీనివాస్ అన్నారు. గత నెలలో ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు మోహన్ భాగవత్ దేశ భవిష్యత్తు కోసం కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జనాభా శాస్త్రం ప్రకారం ఒక దేశ జనాభా పెరుగుదల రేటు 2.1 కంటే తగ్గితే ఆ సమాజం దానంతటదే కూలిపోతుంది అని మోహన్ భాగవత్ ఇటీవలే ఒక సభలో అన్నారని మీడియా కథనాలు చెబుతున్నాయి.
 
మోహన్ భాగవత్ వ్యాఖ్యల్లో కొంత వాస్తవమున్నా అవి పూర్తి నిజాన్ని వెల్లడించలేదు అని నిపుణులు అంటున్నారు. సంతానోత్పత్తి రేట్లు ఇలానే కొనసాగితే రాబోయే సంవత్సరాలలో దేశ జనాభా అత్యంత వేగంగా పడిపోతుందని లండన్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్‌లో జనాభా శాస్త్రవేత్తగా పనిచేస్తున్న టిమ్ డైసన్ బీబీసీతో చెప్పారు. జననాల రేటు 1.8గా ఉంటే జనాభా తగ్గుదల మెల్లగా జరుగుతుంది. దానిని నియంత్రించే అవకాశం ఉంటుంది. అదే ఆ రేటు 1.6 కన్నా తగ్గితే జనాభా వేగంగా పడిపోతుంది. ఆ పరిస్థితిని నియంత్రించడం కష్టమవుతుంది. సంతానోత్పత్తి, పని చేసే వయసులో ఉన్న జనాభా తగ్గుతుంటే దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని టిమ్ అన్నారు. ఇలాంటి పరిణామం ఇప్పటికే కొన్ని దేశాల్లో చోటు చేసుకుంటుంది.
 
మే నెలలో, దక్షిణ కొరియా అధ్యక్షుడు యాన్ సుక్ యోల్ ఆ దేశంలో రికార్డు స్థాయిలో జననాల రేటు పడిపోవడంతో 'నేషనల్ ఎమర్జెన్సీ' ప్రకటించారు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రీస్‌లో సంతానోత్పత్తి రేటు 1.3కు పడిపోయింది. 1950లో ఉన్న సంతానోత్పత్తి రేటుతో పోలిస్తే దాదాపు 50 శాతం తగ్గింది. ఆ దేశ ప్రధాని ఈ మార్పు జనాభా సంక్షోభంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. కానీ దీనికి పరిష్కారంగా ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రజలను ప్రోత్సాహించడం వల్ల ప్రయోజనం లేదని నిపుణులు అంటున్నారు.
 
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న సామాజిక మార్పులను పరిశీలిస్తే ఈ జనాభా తగ్గుదల ధోరణిలో మార్పు వచ్చే అవకాశం లేదని డైసన్ అన్నారు. కాగా భారత్‌లోని తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు ఇప్పటికే శ్రామికశక్తిలో తగ్గుదలను ఎదుర్కొంటున్నాయి. దీనికి పరిష్కారం ఎలా అనేది ఇప్పుడు ఆయా రాష్ట్రాల ముందున్న ప్రశ్న. మరోవైపు ఈ సమస్యను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందిన దేశాలు తమ వృద్ధ జనాభాకు మెరుగైన ఆరోగ్య సంక్షేమాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాయి.
 
'ఇప్పుడు భారత్ కూడా తమ వృద్ధుల ఆరోగ్యంపై దృష్టి సారించాలి. రిటైర్మెంట్ వయసును మరింత పెంచడంతో పాటు, మెరుగైన వైద్య సదుపాయాలు, ఆర్థిక సహాయాన్ని అందించాలి. చురుకైన, ఆరోగ్యవంతమైన వృద్ధాప్య జనాభాని సృష్టించుకోవాలి' అని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న యువ జనాభా సహాయంతో ఆర్థిక వ్యవస్థను వేగంగా అభివృద్ధి చేసుకోవాలి. ఈ దిశగా చర్యలు తీసుకునేందుకు భారత్ కు 2047 వరకు అవకాశం ఉంది. ఆలోపు ఉద్యోగాలు సృష్టిస్తూ, వృద్ధ జనాభాకు మరింత వనరులను కేటాయించగలగాలి.