శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 6 జనవరి 2023 (21:12 IST)

గోళ్లు ఎందుకు కొరుకుతారు?

Nails
బ్రిటన్ మాజీ ప్రధాని గార్డన్ బ్రౌన్, బ్రిట్నీ స్పియర్స్ నుంచి అనేక మంది ప్రముఖులు, సాధారణ ప్రజల వరకు.. చివరకు నాతో సహా చాలామందిలో కామన్‌గా కనిపించే ఓ అలవాటు ఏమిటో తెలుసా? అది గోళ్లు కొరుక్కోవడం. అవును... ప్రపంచంలో అనేక మందికి ఉన్న అలవాటు ఇది. దీని గురించి నేనేమీ గర్వంగా ఫీలవడం లేదు. ఎవరైనా చూస్తే చాలా అసహ్యంగా ఉంటుంది కూడా. అంతేకాదు... నా చేతి వేళ్లు కూడా చూడ్డానికి ఏమాత్రం బాగులేనట్లు తయారవుతాయి ఈ అలవాటుతో. ఈ అలవాటు మానుకోవాలని నేను చాలాసార్లు ప్రయత్నించాను కానీ, మానుకోలేకపోయును.

 
గోళ్లు కొరకకుండా ఉండలేకపోవడానికి కారణమేంటా అని ఆలోచిస్తున్నాను. ఈ అలవాటు ఉన్నవారిలో సంకల్పబలం తక్కువా? మానసికంగా దుర్బలులా? ఆకలి ఎక్కువా? బహుశా సైకలాజికల్ రీసెర్చ్‌లలో దీనికి సమాధానం దొరకొచ్చు. ఇలాంటి అసహ్యకరమైన అలవాటు నుంచి బయటపడడానికి నాకు అందులో సూచనలూ దొరకొచ్చు. ఈ ఆలోచనలతో సైకలాజికల్ రీసెర్చ్ పేపర్లు శోధించడం ప్రారంభించాను. నాకు మొదట్లోనే ఇలాంటి అలవాటుకు ఉన్న పేరు తెలిసింది. ఆ పేరు... ‘ఒనికోఫాగియా’. సైకియాట్రిస్ట్‌లు దీనిని ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’, ‘ఇంపల్సివ్ కంట్రోల్ ప్రాబ్లమ్’ వంటివాటితో కలిపి చెప్తుంటారు.

 
చర్మం పీక్కోవడం, జుత్తు పీక్కోవడం వంటి తీవ్రమైన మానసిక పరిస్థితులు ఉన్నవారికి సైకియాట్రిస్ట్ సహాయం ఉపయోగపడొచ్చు.. కానీ, నేను ఈ గోళ్లు కొరుక్కునే విషయంలో ఇంకా అలాంటి స్థితిలో లేను. యువతలో 45 శాతం మందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. వీరిలో సగం మందికి వైద్యపరమైన సహాయం అవసరం.

 
తప్పు తల్లిదా?
గోళ్లు కొరుక్కోవడం విషయంలో సైకోథెరపిస్ట్‌లు కొన్ని థియరీలు చెప్తుంటారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ మౌఖిక దశలో దీన్ని ‘అరెస్టెడ్ సైకో సెక్సువల్ డెవలప్‌మెంట్’గా పేర్కొన్నారు. ఆహారం తగినంత తినిపించకపోవడం, లేదంటే అతిగా తినిపించడం, సుదీర్ఘ కాలం తల్లి వద్ద పాలు తాగడం, లేదంటే తల్లితో సమస్యాత్మక సంబంధాలుండడం వంటి కారణాలను ఆయన పేర్కొన్నారు. దీని ఫలితంగా కొందరిలో ఇతర లక్షణాలూ ఉండొచ్చని ఫ్రాయిడ్ సిద్ధాంతాలు సూచిస్తున్నాయి. వ్యంగ్యమైన వ్యక్తిత్వం, పొగతాగడం, మద్యం తాగడంతో పాటు ఓరల్ సెక్స్‌ను ఇష్టపడడం వంటి లక్షణాలు ఉండొచ్చని సూచిస్తున్నాయి.

 
మరికొందరు ఇతర సైకో థెరపిస్ట్‌లు మాత్రం గోళ్లు కొరుక్కోవడం అనేది  మనిషిలోని అంతర్గత శత్రుత్వం వల్ల, ఆందోళన వల్ల కూడా కావొచ్చని సూచించారు. అనేక సైకోడైనమిక్ సిద్ధాంతాల మాదిరిగానే ఈ సిద్ధాంతాల్లో ఏవైనా నిజం కావొచ్చు. కానీ, ఇవే నిజం అనడానికి నిర్దిష్ట కారణం ఏమీ లేదు. అంతేకాదు... ఈ సిద్ధాంతాలలో ఎక్కడా ఈ అలవాటు మానడానికి పనికొచ్చే సూచనలూ లేవు.

 
నా విషయానికే వస్తే నేనేమీ సుదీర్ఘ కాలం అమ్మ దగ్గర పాలు తాగలేదు... ఆందోళన దీనికి కారణమా? అని ఆలోచిస్తే ఎలాంటి ఆందోళనా లేకుండా రిలాక్స్‌డ్‌గా ఉన్నప్పుడూ నేను గోళ్లు కొరుక్కునే సందర్భాలున్నాయి. కాబట్టి గోళ్లు కొరుక్కోవడానికి ఇదే కారణం అని కచ్చితంగా చెప్పడానికి నాకైతే కారణాలేమీ కనిపించలేదు. దీనికి శాస్త్రీయంగా ఎలాంటి చికిత్స పద్ధతులూ నాకు కనిపించలేదు. అయితే, ప్రజలు గోళ్లు ఎందుకు కొరుక్కుంటారు.. దానికి చికిత్స ఏమిటి అనేదానికి నా సిద్ధాంతం ఒకటి ఉంది. నా సిద్ధాంతాన్ని ‘యాంటీ థియరీ’ అంటాను. గోళ్లు కొరుక్కోవడానికి ప్రత్యేక కారణాలేవీ ఉండవనేదే నా సిద్ధాంతం.

 
ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉండొచ్చు కానీ నిర్దిష్ట కారణాలేవీ ఉండవు దీనికి. అన్నిటికంటే ముఖ్యంగా నోట్లో వేలు పెట్టుకోవడమనేదీ చాలా సులభమైన పని.. నోటికి దగ్గరగా చేతులు తీసుకువెళ్లడానికి అనేక పరిస్థితులు, అవసరాలు కారణమవుతుంటాయి. కొన్ని అలవాట్లకు దూరం కావడం కష్టమైనపని. గోళ్లు కొరకడమనేది నా దృష్టిలో వ్యక్తిగత లక్షణాలను బయటపెట్టే విషయమేమీ కాదు.