మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 14 నవంబరు 2024 (17:19 IST)

చాగంటి కోటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన పదవిపై వివాదం ఎందుకు?

Chaganti Koteswara Rao
ఫోటో కర్టెసి- సోషల్ మీడియా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రముఖ హిందూమత ఆధ్యాత్మికవేత్త, ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావును ‘రాష్ట్ర నైతిక విలువల సలహాదారు’గా నియమించింది. రెండేళ్ల పాటు కొనసాగే ఆ పదవికి క్యాబినెట్‌ హోదాను కూడా కల్పించింది. ‘‘నైతిక విలువల సలహాదారు’’గా రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలలోని విద్యార్థుల్లో ‘‘నైతిక విలువలు, నీతి- నియమాలను’’ పెంపొందించేందుకు చాగంటి కోటేశ్వరరావు కృషి చేస్తారని ప్రభుత్వం పేర్కొంది.
 
ఎవరీ చాగంటి కోటేశ్వరరావు?
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ప్రచవనకారునిగా చాగంటి కోటేశ్వరరావుకు పేరు ఉంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన చాగంటి, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ)లో పనిచేసి రిటైర్‌ అయ్యారు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఆయన వివిధ వేదికలు, దేవాలయాలు, పీఠాలు, టీవీ చానళ్లు, సామాజిక మాధ్యమాల్లో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తున్నారు. ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ప్రవచనకర్తగా ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నేపథ్యంలో పాలకులు కూడా వరుసగా ఆయనకు పదవులిస్తూ వస్తున్నారు. 2014–19 మధ్య టీడీపీ హయాంలో ఆయనకు ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు పదవి లభించింది. 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా చాగంటిని నియమించినా ఆయన సున్నితంగా తిరస్కరించారు.
 
ప్రజా ప్రభుత్వాలు ఇలా చేయచ్చా?
ఒక మతానికి చెందిన ప్రబోధకుడిని ‘‘నైతిక విలువల’’ కోసం ప్రజాధనంతో నడిచే రాష్ట్ర ప్రభుత్వం ఎలా నియమిస్తుంది? అనే ప్రశ్న ఇప్పుడు పలువురి నుంచి వినిపిస్తోంది. పాఠశాలల్లో విద్యార్థులకు ‘‘మోరల్ వాల్యూస్’’ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఇతరులతో ఎలా ప్రవర్తించాలి? ఎలా గౌరవించాలి? ఎలా సాయపడాలి? క్రమశిక్షణ, దయ, కృతజ్ఞత, నిజాయితీ, తమ పనులు తాము చేసుకోవడం, సమాజం పట్ల బాధ్యత వంటి అంశాలు అందులో ఉంటాయి. హిందూ మతానికి చెందిన పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాల ఆధారంగా చాగంటి ప్రవచనాలు చేస్తుంటారు. ఆయన ప్రసంగాల్లో ‘ఛాందసవాదం’తో పాటు మహిళల విషయంలో ఆయన బోధించే విషయాలపై అనేక విమర్శలు ఉన్నాయి. ‘‘లౌకిక దేశంలోని రాష్ట్రంలో అన్ని కులాల, మతాల విద్యార్థులకు ఆయన నైతిక విలువలను ఎలా బోధించగలరు?’’ అని ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇంతవరకు ‘‘నైతిక విలువలు’’కు సంబంధించి స్పష్టంగా ఎటువంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు.
 
గతంలో వివాదాలు
ఏడేళ్ల కిందట ఓ బహిరంగ వేదికపై చాగంటి తన ప్రవచనంలో.. శ్రీకృష్ణుడి ప్రస్తావన తెస్తూ.. ‘‘ఆయన పశువుల కాపరి ఇంట్లో పుట్టాడు. ఓ మహా విజ్ఞానవేత్తో, చక్రవర్తి కడుపున పుట్టిన వాడో కాదు. రామచంద్రమూర్తి అయితే దశరథ మహారాజు కుమారుడిగా పుట్టాడు. కృష్ణుడు... ఏమీ తెలియని వాడు, తలకడిగితే మొల కడగరు, మొల కడిగితే తల కడగరు... అటువంటి గొల్ల వాళ్ల ఇంట్లో పుట్టాడు’’ అంటూ వ్యాఖ్యానించారు.. ఈ వ్యాఖ్యలపై తమ కులాన్ని అవమానించారంటూ యాదవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసి పోలీస్‌స్టేషన్లలో కేసులు పెట్టగా, చివరికి ఆయన క్షమాపణతో ఆ వివాదం సద్దుమణిగింది. మరో సందర్భంలో 2016లో షిర్డీ సాయిబాబాను దేవుళ్లతో సమానంగా చూడకూడదంటూ చేసిన వ్యాఖ్యలతో బాబా భక్తులు నిరసన వ్యక్తం చేసి.. ఏకంగా ఏపీ సచివాలయానికి ప్రదర్శనగా వచ్చారు. ఇక మహిళలను ఉద్దేశించి ఆయన తన ప్రసంగాల్లో చేసే వ్యాఖ్యలు, వాదనలు పలుమార్లు వివాదాస్పదమయ్యాయి.
 
వివాదాస్పద ప్రవచనాలు
‘‘ఏ ఆడదానికైనా పురుషుడి వల్లనే గౌరవం, భర్తని నిందించి,. భర్తను విడిచిపెట్టి.. భర్త కంటే తనకు వేరే చోట సుఖముందని భావించే స్త్రీ విషంతో సమానం.. అటువంటి మహిళ ముఖం కూడా చూడకూడదు. ఏ ఆడదాని గౌరవమైన పురుషుడి వల్లే’’ అంటూ శ్రీరామకథను ప్రస్తావిస్తూ గతంలో చాగంటి చేసిన ప్రవచనం వివాదాస్పదమైంది. ‘‘మగ పిల్లలతో ఎక్కువ స్నేహాలు చేసే ఆడపిల్లను ఇంటికి కోడలిగా తెచ్చుకోకూడదని, వరుడి తండ్రి పెళ్లికూతురిని చూసేందుకు ఆమె ఇంటికి వెళ్లినప్పుడు, ఆమె ఆ సమయంలో నిద్రపోతున్నా, లేదంటే ఆమె ఇంట్లో లేకున్నా, ఆమెకు విపరీతమైన పురుష స్నేహాలు ఉన్నా అటువంటి యువతిని కూడా ఇంటికి కోడలిగా తెచ్చుకోకూడదని’’ ఆయన గతంలో బహిరంగ వేదికలపై ప్రవచనాలు చేశారు. ఇక ఒకింత స్థోమత ఉన్న యువతులనే ఇంటికి కోడళ్లుగా తెచ్చుకోవాలన్న అర్థంలోనూ ఆయన ప్రవచించారు.
 
‘‘రాజ్యాంగస్ఫూర్తికి భిన్నమైన ఇలాంటి భావనలున్న చాగంటి విద్యార్థులకు ఎలాంటి నైతిక విలువలు బోధిస్తారు’’ అని మహిళా చేతన కార్యదర్శి కె.పద్మ ప్రశ్నించారు. ‘‘భర్త లోదుస్తులు ఉతికిన భార్య స్వర్గానికి వెళ్తుందని ఓ సందర్భంలో చాగంటి సెలవిచ్చారు. అలాంటి వారి నుంచి పిల్లలు ఏం నేర్చుకుంటారు? మనుషులను సమానంగా చూడలేని వారు ఆడదానికి పురుషుడి వల్లనే విలువ అని సెలవిచ్చేవారి నుంచి పిల్లలు నేర్చుకునేదేమిటి’’ అని ఆమె బీబీసీతో అన్నారు.
 
‘‘విద్యావ్యవస్థలో మత ప్రవచనాలు చెప్పే ఛాందసవాదులను జొప్పిస్తే సమాజ నిర్మాణంలోనే తేడా వస్తుంది. బాల్యం, యవ్వనం ఆరంభంలో మనస్సు స్వచ్ఛంగా, స్వేచ్ఛగా ఉంటుంది. అలాంటి మనసుల్లోకి కూడా నైతిక విలువల ముసుగులో మతం జొప్పించి.. మౌఢ్యం వైపు మళ్లించడం అవాంఛనీయ పరిణామం. పిల్లలకు నైతిక విలువలు, విద్యాబుద్ధులు నేర్పించేందుకు ఉపాధ్యాయవ్యవస్థ ఉంది కదా.. ప్రత్యేకంగా మళ్ళీ ఈ పదవి ఎందుకు.. పైగా చాగంటి ఉపన్యాసాలు చూస్తే కుటుంబవ్యవస్థలో ఫ్యూడల్‌ భావజాలం పెంచేలా ఉంటాయి. అవి సమాజ ప్రగతికి అవరోధం’’ అని పద్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘సీఎం చంద్రబాబు దీనిపై పునరాలోచించాలి. గతంలో ఆయన ఎప్పుడూ ఇలాంటి పదవులను సృష్టించలేదు. బహుశా జనసేన, బీజేపీ భావజాలానికి లొంగి ఇలా చేస్తున్నారేమో తెలియడం లేదు’’ అని ఆమె అన్నారు.
 
ప్రవచనాలు చెప్పే వారితో వ్యక్తిత్వ వికాసం ఎలా?
‘‘హిందూ ధర్మానికి సంబంధించి ఆధ్యాత్మిక ప్రబోధకుడు చాగంటి కోటేశ్వరరావుకి చాలా మంచి పేరు ఉంది. ప్రభుత్వాలు కావాలనుకుంటే ఆయన సేవలను హిందూ ధార్మిక పీఠాల్లో, దేవాలయాల్లో. పుణ్యక్షేత్రాల్లో.. హిందూ సమాజానికి సంబంధించి ఎక్కడైనా వినియోగించుకోవచ్చు. కానీ లౌకిక దేశంలోని రాష్ట్రంలో అన్ని మతాలు, కులాలు, వర్గాలు చదువుకునే విద్యాసంస్థల్లో ఆయన భావజాలాన్ని ప్రచారం చేయించాలని చూడడం సరికాదు. ఓ మత ప్రవచనకారుడిని తీసుకువచ్చి పిల్లలకు వ్యక్తిత్వ నిర్మాణం చెబుతామని రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించడం.. అందుకు క్యాబినెట్‌ హోదా ఇచ్చి ప్రజాధనం ఖర్చు పెట్టడం రాజ్యాంగ విరుద్ధం’’ అని ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు బీబీసీతో అన్నారు.
 
‘‘చాగంటి వారు చెప్పేవన్నీ పురాణకథలు. అవి ఫిక్షన్‌ నుంచి పుట్టినవి.. ఫిక్షన్‌ నుంచి చెప్పేది వాస్తవ జీవన దృశ్యాలు కాలేవు.. పౌరాణిక ప్రవచనాల్లో కథాత్మకమైన ఊహాజనితమైన ప్రవచనమే ఉంటుంది. కానీ జీవితాన్ని వాస్తవంగా చూపించే పర్సనాలిటీ డెవలప్‌మెంట్.. చదువుకోవడం, రాసుకోవడం అభివ్యక్తి చేయడం, లైబ్రరీకి వెళ్లడం, విజ్ఞాన మందిరాలకు వెళ్లడం, పరీక్షలు రాయడం, నిరంతర అధ్యయనం చేయడం వంటి నైతిక సూత్రాలతోనే అలవడుతుంది. వ్యక్తిత్వ వికాస నిర్మాణ దక్షత చెప్పడం భిన్నమైన సబ్జెక్టు. ఇది ఏ మతం నుంచి నేరుగా రాదు. రేపు చాగంటి వారు చెప్పినా వేరే మతాల వాళ్ళు స్వీకరించరు. అందుకే అలాంటి పదవుల్లో మతేతరమైన లౌకిక ప్రజాస్వామ్య సామ్యవాద భావాలున్న వ్యక్తిత్వ వికాస నిపుణులను నియమించాలి.’’ అని కత్తి పద్మారావు సూచించారు
 
చంద్రబాబు ఎవరి మెప్పుకోసమో చేస్తున్నారు?
‘‘ఒక ప్రభుత్వమే నేరుగా ఒక మత ప్రచారకుడిని తీసుకువచ్చి ఇలా పదవినివ్వడం ఎక్కడా లేదు.. సీఎంగా ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు గతంలో ఎప్పుడూ ఇలా చేయలేదు.. ఇప్పుడు ఎవర్నో మెప్పించడానికి చేస్తున్న పనిలా ఉంది.. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన నిపుణులు, రచయితలు చాలా మంది ఉన్నారు.. అలాంటి వారిని తీసుకువచ్చి క్లాసులు చెప్పించాలి. లౌకిక, ప్రజాస్వామ్య, సామ్యవాద భావజాలంతో పాటు కరుణ, ప్రేమ ఆత్మీయత, దానం, సహనం వంటి వాటిపైన పిల్లలను చైతన్యవంతం చేయాలే కానీ ఫిక్షన్‌ గురించి చెప్పే ఆధ్యాత్మికవేత్తను తీసుకువచ్చి చెప్పించడం కరెక్ట్‌కాదు. నాకు తెలిసి ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఆ పోస్టు నిలబడదు’’ అని దిల్లీకి చెందిన ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ రీసెర్చ్‌(ఐసీఎస్‌ఎస్‌ఆర్‌) సీనియర్‌ఫెలోగా కూడా పనిచేస్తున్న డాక్టర్‌కత్తి పద్మారావు అన్నారు.
 
ఇది సరికాదు
‘‘లౌకిక దేశంలో కేవలం హిందూ ధర్మానికి ప్రతినిధిగా ఉన్న ఓ ప్రవచనకారుడిని తీసుకువచ్చి నైతిక విలువలను ప్రబోధించే పని అప్పజెప్పడం సరికాదు.. నైతిక విలువలు అంటే సనాతన ధర్మం ఒక్కటే కాదు. చాగంటి కోటేశ్వరరావు నియామకంతో సనాతన ధర్మమే నైతికత అనే అభిప్రాయం బలపడుతుంది’’ అని సీనియర్‌ జర్నలిస్టు ఉషా ఎస్ డానీ వ్యాఖ్యానించారు. ‘‘విద్యార్థులకు నైతికత కావాలే కానీ సనాతన ధర్మాలతో ఏం పని.. ఈ మధ్య సనాతన ధర్మం అంటూ హడావుడి చేస్తున్న పవన్‌ కల్యాణ్‌ను సంతృప్తి పరిచేందుకే నియమించినట్టు ఉంది.. అసలు సనాతన ధర్మం ఏమిటనే దానిపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..ఈ పరిస్థితుల్లో ఈ పోస్టుపై ప్రభుత్వం పునరాలోచించాలి. లేదంటే ఆ పోస్టులో విద్యారంగంలో కృషి చేసిన వారినో, సామాజిక కార్యకర్తలనో నియమించాలి’’ అని డానీ సూచించారు.
 
ఆ పోస్టులో చేరిన తర్వాత మాట్లాడతా: చాగంటి
"ప్రభుత్వం అప్పజెప్పిన పని మంచిది కాబట్టి.. చేయడానికి అంగీకరించాను" అని చాగంటి కోటేశ్వరరావు బీబీసీతో అన్నారు. గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన పోస్టులపై ఆసక్తి చూపని నేపథ్యంపై మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదు. ‘‘నైతిక విలువల పదవికి సంబంధించిన ఆర్డర్ చూసి..అది చదివిన తర్వాత.. ఆ పోస్టులో జాయిన్ అయిన తర్వాత నేను వివరంగా మాట్లాడుతాను" అని స్పష్టంచేశారు. ఇప్పుడు ఇంతకుమించి మాట్లాడలేనన్నారు.