శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. సాహిత్యం
  3. పుస్తక సమీక్ష
Written By PNR
Last Updated : శుక్రవారం, 26 సెప్టెంబరు 2014 (11:19 IST)

"మాతెలుగు తల్లి"కి రాష్ట్రేతరుల హారతి!

తెలుగునేల రెండుగా విడిపోయింది. అదేసమయంలో తెలుగు జాతిగీతం రచించిన శంకరంబాడి సుందరాచారి శతజయంతి వేడుకలు కూడా వచ్చాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగునాట ఎవరూ శంకరంబాడిని గుర్తించిన పాపాన పోలేదు. అయితే, ఆయన మద్రాసు నగరంలో ఉంటూ, సినిమా పాటగా "మా తెలుగుతల్లికి మల్లెపూదండ" అంటూ రాసిన గీతం సుకృతం కారణంగానోమో అదే చెన్నై నగరానికి చెందిన జనని సాంఘిక సాంస్కృతిక సమితి ‘శంకరంబాడి సుందరాచారి శతజయంతి సంచిక’ పేరుతో ఒక ప్రత్యేక సంచికను ప్రచురించింది. 
 
ఆగస్టు 10వ తేదీన ఈ పుస్తకం కొత్త ఢిల్లీలోని ఏపీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆది లీలా ఫౌండేషన్‌ వారిచే ఆవిష్కరించబడింది. 133 పుటలున్న ఈ సంచికలో 12 వ్యాసాలున్నాయి. ఇవన్నీ ఒకటి తప్ప (సుందరాచారి గ్లాసు) శంకరంబాడి‌లోని సాహితీ మూర్తిని పరిచయం చేసేవే. సుందరాచారి తన చివరి సంవత్సరాలలో శిష్యుడు డాక్టర్‌ మన్నవ భాస్కరనాయుడు ఇంట ఉన్నారు. ఆ సంఘటనలను, తన జీవితానికి గురువుగారు ఏర్పరచిన బాటనూ, తీర్చి దిద్దిన కవితాలతను మన్నవ వారు చక్కగా తన వ్యాసంలో ఆవిష్కరించారు. 
 
కేవలం మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతరచయితగానే ప్రాచుర్యంలో ఉన్న గొప్ప కవివరుని ఇతర రచనలను స్థూలంగా నేటి తరానికి పరిచయం చేయడానికి ప్రయత్నించిన జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య ఆశయం ఎంతో ముదావహమైనది. భారత, రామాయణ గాథలను తేట తెలుగు పదాలతో తేటగీతి పద్యాలుగా మలచిన శంకరంబాడి కవితా శక్తికి నీరాజనమీ సంచిక. సీనియర్‌ పాత్రికేయులు మన్నవ గంగాధరప్రసాద్‌ సంపాదకత్వంలో వెలువడిన ఈ సంచిక ద్వారా సుందరాచారి సాహితీ విలువలు, ఆయనలోని మానవీయకోణం తెలుసుకోవచ్చు. ఈ ప్రతులక కోసం సంప్రదించవలసిన చిరునామా... ప్రధాన కార్యదర్శి, జనని (సాంఘిక, సాంస్కృతిక సమితి), నెం:13/53, రెండవ వీధి, వాసుకినగర్‌, కొడుంగైయూర్‌, చెన్నై-600 118.