గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2016-17
Written By pnr
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2016 (13:04 IST)

ఛార్జీల భారం ఉండబోదు.. ఆన్‌లైన్‌లో టిక్కెట్ బుక్ చేస్తే సబ్సీడి : సురేశ్ ప్రభు వెల్లడి

రైల్వేల్లో ఆదాయం కోసం టికెట్ల ధరల పెంపు కాకుండా ప్రత్యామ్నాయలపై దృష్టి పెట్టామని కేంద్రరైల్వే మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. లోక్‌సభ‌లో రైల్వే బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైల్వేల అంతర్గత సామర్థ్యం పెంచుతామన్నారు. రైల్వేలను ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకలా మారుస్తామన్నారు. రైల్వేలైన్ల విద్యుద్దీకరణ పెంచామని... వచ్చే ఏడాది 10 శాతం ఆదాయం పెంచుతామన్నారు. 
 
రైళ్ల వేగం, సమర్థత, పారదర్శకత పెంచడమే తమ లక్ష్యమన్నారు. ఐదేళ్లలో రైల్వేలో రూ.1.50 లక్షల కోట్ల ఎల్‌ఐసీ పెట్టుబడులు ఉంటాయన్నారు. 2500 కి.మీ బ్రాడ్‌ గేజ్‌ లైన్లు వేశామన్నారు. వచ్చే ఏడాది 2800 కి.మీ రైల్వే లైన్‌ వేస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు. పీపీపీ పద్దతిలో రైల్వే ప్రాజెక్టులు చేపడుతామని చెప్పారు. ఇందుకోసం అంతర్జాతీయ సహకారం తీసుకుంటామన్నారు. రైల్వేలో మౌలిక సౌకర్యాలు పెంచుతామన్నారు. 
 
అంతేకాకుండా, రైల్వే ప్రయాణాల్లో ప్రయాణికులకు సంతోషం అందించడమే తమ లక్ష్యమన్నారు. 1078 టికెట్‌ మిషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైల్వేలో ఆన్‌లైన్‌ సేవలు పెంచుతామని తెలిపారు. మహిళలు, వృద్ధులకు లోయర్‌ బెర్త్‌ కోటా 50 శాతం పెంచుతామని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే కనెక్టివిటీ పెంచుతామన్నారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్‌ చేసే వారికి సబ్సిడీలు వర్తిస్తాయన్నారు. 
 
100 రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని... వచ్చే నాలుగేళ్లలో 400 స్టేషన్లలో వైఫై సేవలు అందిస్తామని రైల్వేమంత్రి హామీ ఇచ్చారు. పీపీపీ పద్దతిలో 400 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి స్టేషన్లను అభివృద్ధి చేస్తామన్నారు. దశలవారీగా అన్ని రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సరికొత్త టెక్నాలజీతో ప్రమాదాలు నివారిస్తామని చెప్పారు. ప్రమాదాల నివారణకు కొరియా, జపాన్‌తో కలిసి పనిచేస్తున్నామని సురేష్ తెలిపారు.
 
రైళ్ల నుంచి ప్రయాణికులు కిందపడకుండా చర్యలు తీసుకుంటామని, భవిష్యత్‌లో కాపలా లేని రైల్వే గేట్లు ఉండవని హామీ ఇచ్చారు. వడోదరలో రైల్వే యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఐటీ సేవలను మరింతగా ఉపయోగించుకుంటామన్నారు. రైలు ప్రయాణం మరింత సుఖవంతంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కొత్తగా 74 రైళ్లలో అన్‌బోర్డ్‌ కీపింగ్‌ సేవలను అందుబాటులో తెచ్చామన్నారు. కొన్ని రైళ్లలో దీన్‌దయాళ్‌ పేరుతో మోడ్రన్‌ కోచ్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. విదేశీయులకు సైతం ఈ-టిక్కెట్లను అందజేస్తామన్నారు.