కోయంబత్తూరు కారు డ్రైవర్ ఖాతాలో రూ.9 వేల కోట్లు జమ
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరుకు చెందిన ఓ కారు డ్రైవర్ ఖాతాలో ఉన్నఫళంగా రూ.9 వేల కోట్లు జమ అయ్యాయి. ఈ నిధుల జమకు సంబంధించి తన బ్యాంకు ఖాతాకు వచ్చిన సందేశాన్ని చూసి ఆయన షాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత ఆ తర్వాత బ్యాంకు అధికారులు ఆ మొత్తాన్ని మళ్లీ వెనక్కి తీసుకున్నారు. ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, కోయంబత్తూరు జిల్లాలోని పళణి నెయక్కారపట్టికి చెందిన రాజ్ కుమార్ చెన్నైలోని కోడంబాక్కంలో స్నేహితుడి వద్ద ఉంటూ కారు డ్రైవరుగా పని చేస్తున్నాడు. ఈ నెల 9వ తేదీన ఆయనకు మొబైల్‌కు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తమిళనాడు మర్కెంటైల్ బ్యాంకు నుంచి డబ్బు జమ అయినట్టు వచ్చింది. మెసేజ్ చూస్తే ఏకంగా రూ.9 వేల కోట్లు కనిపించింది.
ఇది నమ్మలేకపోయిన అతడు నిజానిజాల్ని నిర్ధారించుకునేందుకు తన స్నేహితుడికి రూ.21 వేలు బదిలీ చేశాడు. చివరకు అది నిజమని నిర్ధారించుకున్నాక సంబరంలో మునిగితేలాడు. కానీ ఆ సంతోషం ఎక్కువ సేపు మిగల్లేదు. ఆ తర్వాత బ్యాంకు వారు రాజ్‌కుమార్‌కు ఫోన్ చేసి పొరపాటున రూ.9 వేల కోట్లు బదిలీ అయ్యిందని వివరించారు.
తన స్నేహితుడికి పంపిన డబ్బుతో పాటూ మొత్తం సొమ్మును తమకు అప్పగించాలన్నారు. అయితే, రాజ్ కుమార్ తరపున న్యాయవాదులు వెళ్లి బ్యాంకు అధికారులతో మాట్లాడటంతో ఆ రూ.21 వేలు వెనక్కు ఇవ్వాల్సిన పనిలేదని, వాహన రుణం ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది.