1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (10:45 IST)

భారత మార్కెట్‌పై కన్నేసిన చైనా ఈ-కామెర్స్ అలీబాబా!

భారత మార్కెట్‌పై చైనా ఈ-కామెర్స్ దిగ్గజం కన్నేసింది. భారత్‌లోని అపార అవకాశాలను కొల్లగొట్టేందుకు అలీబాబా వ్యవస్థాపకుడు 'జాక్ మా' ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా సొంతంగా కార్యకలాపాలు సాగించడంతో పాటు భారత్‌లో ఇప్పటికే ఈ రంగంలో ఉన్న సంస్థలు, వ్యక్తులతో కలసి పనిచేసే విషయాలను కూడా జాక్ మా పరిశీలిస్తున్నారు. 
 
భారత్‌లో తొలి పర్యటనకు వచ్చిన జాక్ మా బుధవారం ఫిక్కీ నిర్వహించిన సదస్సులో పాల్గొని కీలకోపన్యాసం చేశారు. భారత్ లోని అపార అవకాశాలను ప్రస్తుతిస్తూనే, వాటిని చేజిక్కించుకునేందుకు తాను కూడా ఉవ్విళ్లూరుతున్నానని చెప్పారు. తన పర్యటనలో భాగంగా నేడు ఆయన పలు కంపెనీలతో భేటీ కానున్నారు. ఇందులో భాగంగా దేశీయ ఈ-కామర్స్ సంస్థ స్నాప్ డీల్‌తో ఆయన సమావేశం కానున్నట్లు సమాచారం. స్నాప్ డీల్ లో జాక్ మా వాటా తీసుకుంటారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. 
 
ఇదిలా ఉంటే చైనా అపర కుబేరుడైన జాక్ మా భారత ప్రధాని నరేంద్ర మోడీని పొగడ్తలతో ముంచెత్తారు. తాను మోడీ ప్రసంగాన్ని విన్నానని, ఆ ప్రసంగం ఉత్తేజపూరితంగా ఉందని చెప్పారు. అంతేగాకుండా.. భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడితే బాగుంటుందని తన మనసులోని మాటను బయటపెట్టారు.