1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (17:37 IST)

పీఎఫ్ సొమ్ము విత్‌డ్రాకు క్యూ కట్టిన ఉద్యోగులు.. 10 రోజుల్లోనే....

ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగత ఆదాయం బంద్ కావడంతో ఎక్కువ మంది వేతన జీవులు తమ పీఎఫ్ సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. అలా గత పది రోజుల్లో ఏకంగా 1.37 లక్షల మంది క్లెయిమ్‌లను పరిష్కరించినట్టు ఈపీఎఫ్‍వో ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
వ్యక్తిగత ఆదాయంపై కరోనా వైరస్ ప్రభావం పడుతున్న నేపథ్యంలో ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) తమ ఖాతాదారులకు నగదు ఉపసంహరణ అవకాశాన్ని కల్పించింది. దేశంలోని అన్ని సంస్థల ఉద్యోగులకు ఈ క్యాష్ విత్‌డ్రా అవకాశం ఉంటుంది. 
 
దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ అమలవుతోంది. ఇది ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. దీంతో ఖాతాదారులకు సహాయం చేయడానికి ఇటీవల ప్రభుత్వం ప్రత్యేకంగా నగదు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. కేవైసీ వివరాలు నిబంధనల మేరకు ఉన్న వారి అప్లికేషన్లను 72 గంటల్లోగా ప్రాసెస్‌ చేస్తున్నామని ఈపీఎఫ్‌వో సంస్థ తెలిపింది. 
 
నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న ఖాతాదారులకు ఇప్పటివరకు రూ.279.65 కోట్లు చెల్లించినట్లు ఈపీఎఫ్‌వో ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఖాతాదారులు అవసరమైన మేరకు నగదును విత్‌డ్రా చేసుకుంటున్నారు. ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్ యోజన పథకం కింద ఈపీఎఫ్‌ పథకం నుంచి ప్రత్యేక ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే.