శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 నవంబరు 2020 (22:05 IST)

క్యాష్‌బ్యాక్‌, డిస్కౌంట్లను ఆపేయండి.. నిర్మలా సీతారామన్‌కు సీఏఐటీ లేఖ

ఈ-కామర్స్ వెబ్‌సైట్లు ప్రకటించే క్యాష్‌బ్యాక్‌లను, డిస్కౌంట్లను ఆపివేయాలని కోరుతూ అఖిల భారత వర్తక సమాఖ్య సంఘం(సీఏఐటీ) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది. బ్యాంకులు ఇలా ఈ-కామర్స్ కంపెనీలతో కలిసి వినియోగదారులకు ప్రోత్సాహకాలు కల్పించడం రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని లేఖలో సీఏఐటీ పేర్కొంది.
 
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ, ఆర్‌బీఎల్, బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు పలు బ్యాంకులు ఈ-కామర్స్ కంపెనీలతో.. మరీ ముఖ్యంగా అమేజాన్, వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌తో అనైతిక ఒప్పందం ఏర్పరచుకుని కార్డులపై 10 శాతం క్యాష్‌బ్యాక్ ప్రకటిస్తున్నాయని సీఏఐటీ ప్రధాన జాతీయ కార్యదర్శి ప్రవీణ్ ఖండెల్వాల్ లేఖలో ప్రస్తావించారు. 
 
వర్తకుల నుంచి నేరుగా కొనుగోలు చేసే వారికి ఇదే బ్యాంకులు ఎటువంటి రాయితీలు, క్యాష్‌బ్యాక్‌లు ప్రకటించవని ఆయన గుర్తుచేశారు. ఈ-కామర్స్ కొనుగోళ్ల పైనే డిస్కౌంట్లను బ్యాంకులు ఎందుకు పొడిగిస్తున్నాయో దర్యాప్తు జరగాలని సీఏఐటీ అభిప్రాయపడింది.