రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ కథ కంచికి : లోక్‌సభలో సవరణ బిల్లు
పూర్వపు తేదీలతో పన్ను (రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్) విధానానికి కేంద్ర ప్రభుత్వం టాటా చెప్పేసింది. దీనికి సంబంధించిన సవరణ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీంతో 2012 మే 28కి ముందు తేదీలతో వర్తించేలా కంపెనీలపై పన్ను విధించే ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ రద్దు కానుంది.
ఈ సెక్షన్ కింద వొడాఫోన్ గ్రూప్, కెయిర్న్ ఎనర్జీ కంపెనీలకు జారీ చేసిన పన్ను డిమాండ్ నోటీసులూ రద్దవుతాయని నిర్మల చెప్పారు. యూపీఏ-2 హయాంలో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ విధానం తీసుకువచ్చారు.
కానీ.. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే విదేశీ కంపెనీలకు ఈ టాక్స్ పెద్ద అడ్డంకిగా మారింది. వొడాఫోన్ గ్రూప్, కెయిర్న్ ఎనర్జీ కంపెనీలు ఈ విషయాన్ని హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకెళ్లి.. వడ్డీ ఖర్చులతో సహా ప్రభుత్వం చెల్లించాలని వాదించి విజయం సాధించాయి.
ఈ నేపథ్యంలోనే ఈ సెక్షన్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో 17 కంపెనీలకు రూ.1.10 లక్షల కోట్ల లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా వొడాఫోన్ గ్రూప్‌నకు రూ.11,000 కోట్లు, కెయిర్న్ ఎనర్జీకి రూ.8,800 కోట్ల లబ్ధి చేకూరనుంది.