పేరు మార్చుకున్న కరాచీ బేకరీ ఇకపై...
ఉరుము ఉరిమి మంగళం మీద పడిందనేది పాత సామెత. పుల్వామా దాడుల నేపథ్యంలో పాక్ అంటేనే మండిపడుతున్న జనసామాన్యం ధాటికి కరాచీ బేకరీ కూడా తామేమీ అతీతులం కాదంటూ పేరు మార్చేసుకుంది.
వివరాలలోకి వెళ్తే... పుల్వామా ఉగ్రదాడి అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న 'కరాచీ బేకరీ'లకు పేరు మార్చుకోవలసిందేనంటూ బెదిరింపులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ తమ బ్రాంచ్‌ల దగ్గర సెక్యురిటీని పెంచడంతో పాటు ఇది పూర్తిగా భారతీయ సంస్థేనని వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది.
అయితే పేరు మార్పుపై కరాచీ బేకరీ యాజమాన్యం తాజాగా ఓ ప్రకటకన చేస్తూ... ఇకపై తమ సంస్థలకు 'ఇండియన్ కరాచీ'గా పేరు మారుస్తున్నట్టు తెలిపింది. మోజాంజాహి మార్కెట్ దగ్గర ఉన్న కరాచీ బేకరీ యాజమాన్యాన్ని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ ఆధ్వర్యంలోని బీజేపీ నేతలు సంప్రదించగా ఈ మేరకు హామీ ఇచ్చారు.
రెండు రోజుల్లో ఇండియన్ కరాచీ బేకరీ పేర్లు పెడతామని యాజమాన్యం తెలిపినట్టు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గొడుగు శ్రీనివాస్‌యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇంకా ఏమేమి మార్చాల్సి ఉంటుందో... చూద్దాం.