గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 నవంబరు 2020 (17:50 IST)

కాటేసిన కరోనా : ఆర్థిక మాంద్యం దిశగా భారత్... ఆర్బీఐ హెచ్చరికలు

ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ కారణంగా మన దేశం తొలిసారి ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటుంది. దేశ చరిత్రలో ఇలా జరుగనుండటం ఇదే తొలిసారి. ఈ మేరకు భారత రిజర్వు బ్యాంకుకు చెందిన ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 
 
నౌక్యాస్ట్‌ పేరుతో ఆర్‌బీఐ తొలిసారి విడుదల చేసిన నివేదిక.. సెప్టెంబర్‌ త్రైమాసికంలో దేశ జీడీపీ 8.6 శాతం క్షీణించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జులై- సెప్టెంబర్‌)లోనూ దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణపథంలో కొనసాగింది. ఫలితంగా మాంద్యంలోకి జారినట్లేనని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ పాత్ర అధ్యక్షతన ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. 
 
తొలి త్రైమాసికం(ఏప్రిల్‌- జూన్‌)లోనూ జీడీపీ మరింత అధికంగా 24 శాతం వెనకడుగు వేసింది. వరుసగా రెండు త్రైమాసికాలలో ఆర్థిక వ్యవస్థ క్షీణతను నమోదు చేస్తే.. సాంకేతికంగా మాంద్యంలోకి జారుకున్నట్లుగా ఆర్థికవేత్తలు భావిస్తారు. వెరసి ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో దేశ జీడీపీ రెసిషన్‌లోకి ప్రవేశించిందని నౌక్యాస్ట్‌ తెలియజేసింది. దేశ చరిత్రలో జీడీజీ మాంద్య పరిస్థితులను ఎదుర్కోవడం ఇదే తొలిసారికావడం గమనార్హం. 
 
కాగా, ఈ తాజా పరిస్థితులపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందిస్తూ, ఆర్థిక వృద్ధికి దన్నుగా సరళ పరపతి విధానాలను కొనసాగించనున్నట్లు తెలిపారు. అయితే ధరల ఒత్తిడి, ద్రవ్యోల్బణ అంచనాలు వంటివి పాలసీ నిర్ణయాలకు ఆటంకాలను సృష్టిస్తున్నట్లు ఆర్‌బీఐ ఆర్థికవేత్తలు తెలియజేశారు. 
 
కరోనా సెకండ్‌ వేవ్‌లో భాగంగా ఇటీవల పలు దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రపంచ వృద్ధికి విఘాతం కలిగించే అవకాశమున్నట్లు వివరించారు. అటు కార్పొరేషన్లు, ఇటు కుటుంబాలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని, ఇది ఫైనాన్షియల్‌ రిస్కులను పెంచే వీలున్నదని తెలియజేశారు. ఫలితంగా సవాళ్లతో కూడిన పరిస్థితులు ఎదురవుతున్నట్లు వివరించారు.