ఆప్కో చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన జెసి, ఒకటి కొంటే రెండు ఉచితం
చేనేత వస్త్రాలను ప్రోత్సహించటం ద్వారా లక్షలాది మంది కార్మికులకు జీవనోపాధి చూపించవచ్చని కృష్ణా జిల్లా సంయిక్త పాలనాధికారి (అభివృద్ధి) ఎల్. శివ శంకర్ అన్నారు. దసరా పర్వదినాలను పురస్కరించుకుని విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని బాపు మ్యూజియం అవరణలో శనివారం ఆప్కో చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకంను శివశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే చేనేత వస్త్రాల వినియోగం మరింత పెంపొందించవలసి ఉందన్నారు.
ఆప్కో జిఎం(పరిపాలన) రమేష్ మాట్లాడుతూ, ఈ నెల 26వ తేదీ వరకు ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుందని, ఎంపిక చేసిన వస్త్ర శ్రేణిపై 30 శాతం రాయితీ అందిస్తున్నామని తెలిపారు. మరోవైపు ఒకటి కొంటే ఒకటి ఉచితం, ఒకటి కొంటే రెండు ఉచితం ప్రాతిపదికన మరిన్ని వస్త్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
ఈ ప్రదర్శనలో మంగళగిరి, మచిలీపట్నం, రాజమండ్రి, ఉప్పాడ, చీరాల, వెంకటగిరి, మాధవరం చీరలను అందుబాటులో ఉంచామని అప్కో మండల వాణిజ్య అధికారి ఎస్ వివి ప్రసాద రెడ్డి తెలిపారు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.