సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 మార్చి 2021 (10:04 IST)

బాదుడే బాదుడు.. పెరిగిన వంటగ్యాస్ ధరలు..

దేశీయ చమురు కంపెనీలు వంట గ్యాస్ ధరలను పెంచేస్తున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో రెండోసారి వంటగ్యాస్‌ ధరను పెంచాయి. గత నెల 25న సిలిండర్‌పై రూ.25 పెంచిన కంపెనీలు తాజాగా మరో రూ.25 భారం మోపాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్‌ ధర రూ.819కి చేరింది. ఫిబ్రవరి నెలలో సిలిండర్‌ ధరలను మూడు సార్లు సవరించిన సంగతి తెలిసిందే. ఆ నెలలో మొత్తంగా రూ.100 అధికమయ్యింది.
 
కాగా, గతేడాది డిసెంబర్‌ 1 నుంచి ఇప్పటివరకు వంటగ్యాస్‌పై రూ.225 పెరిగాయి. డిసెంబర్‌ 1న 14 కిలోల సిలిండర్‌ ధర రూ.594గా ఉన్నది. రూ.50 పెంచడంతో రూ.644కు చేరింది. మళ్లీ జనవరి 1న రూ.50 వడ్డించడంతో అది రూ.694కు పెరిగింది. అంతటితో ఆగని కంపెనీలు ఫిబ్రవరి 4న రూ.25 పెంచాయి. దీంతో సిలిండర్‌ ధర రూ.719కి చేరింది. అదేనెలలో పదిరోజుల వ్యవధిలోనే మరో రూ.50 మేర వినియోగదారులపై భారం మోపాయి.
 
ఫిబ్రవరి 14న రూ.50 పెంపుతో రూ.769 పెరిగింది. చివరగా ఫిబ్రవరి 25న రూ.25 మేర గ్యాస్‌ ధరను అధికం చేయడంతో రూ.794కు చేరింది. తాజాగా మరో రూ.25 వడ్డించడంతో సిలిండర్‌ వెల రూ.819కి పెరిగింది. ఇవాళ ఉదయమే కమర్షియల్‌ గ్యాస్‌పై రూ.95 వడ్డించాయి. దీంతో వాణిజ్య అవసరాలకోసం వినియోగించే సిలిండర్‌ ధర రూ.1614కు చేరిన సంగతి తెలిసిందే.