1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2023 (12:20 IST)

వినాయక చవితి నుంచి జియో ఫైబర్ సేవలు : జియో కస్టమర్లు 45 కోట్లు

mukesh ambani
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 15వ తేదీ వినాయక చవితి పండుగ రోజు నుంచి జియో ఫైబర్ సేవలు ప్రారంభించనున్నట్టు సోమవారం ముంబైలో జరిగిన రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో వెల్లడించారు. ఈ సంస్థ 46వ వార్షిక సాధారణ సదస్సులో వాటాదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, గత పదేళ్లలో కంపెనీ 150 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు ముఖేశ్ వెల్లడించారు. 
 
ఇతర ఏ కార్పోరేట్ కంపెనీ ఈ స్థాయి పెట్టుబడులు పెట్టలేదని అన్నారు. రిలయన్స్ కొత్త తరం టెక్నాలజీ కంపెనీగా అవతరించిందన్నారు. దేశంలో జియో యూజర్ల సంఖ్య 45 కోట్లు దాటినట్లు తెలిపారు. సగటు వినియోగం నెలకు 25 జీబీగా ఉందన్నారు. 5 కోట్ల మంది జియో వినియోగదారులు 5జీ వినియోగిస్తున్నట్లు తెలిపారు. 
 
2జీ వినియోగదారులను 4జీకి మార్చేందుకు జియో భారత్ ఫోన్‌ను కేవలం రూ.999కే తీసుకు వచ్చామన్నారు. దేశంలో అందరికీ 5జీ నెట్ వర్క్ అందించడమే లక్ష్యమని, డిసెంబర్ నాటికి అందిస్తామన్నారు. ఫైబర్ కేబుల్ అవసరంలేని జియో ఎయిర్ ఫైబర్‌ను వినాయక చవితికి లాంచ్ చేస్తున్నామని, సెప్టెంబర్ 19న దీనిని తీసుకు వస్తున్నామన్నారు.
 
జియో సినిమా వేదికగా 45 కోట్ల మంది ఐపీఎల్ ప్రసారాలను వీక్షించారని, ఫైనల్ మ్యాచ్‌ను 12 కోట్ల మంది చూశారన్నారు. రిలయన్స్ నికర లాభం పెరిగినట్లు తెలిపారు. బీమా రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ముఖేశ్ ప్రకటించారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా సాధారణ, ఆరోగ్య బీమా సేవలను అందిస్తామన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్‌లో 2.6 లక్షల ఉద్యోగులు చేరినట్లు ముఖేశ్ అంబానీ వెల్లడించారు.