బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 10 జులై 2019 (09:58 IST)

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రైవేటు పరం?

భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా, దేశంలోని పలు ప్రధాన రైల్వే స్టేషన్ నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను తొలుత ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇదే జరిగితే ప్రయాణికులపై భారం పడనుంది. ఈ నిర్ణయాన్ని రైల్వే కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఆందోళనకు దిగాలని భావిస్తున్నాయి. 
 
దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్ల నిర్వహణతో పాటు ఫ్లాట్‌ఫాం టిక్కెట్ల విక్రయం పారిశుద్ధ్య నిర్వహణ, పార్కింగ్ వంటి సేవలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐఆర్ఎస్‌డీసీ) చేతికి అప్పగించడం జరిగింది. దీంతోపాటు జోన్లలో ఉన్న మరికొన్ని రైల్వే స్టేషన్లు కూడా ఐఆర్ఎస్‌డీసీ చేతికే అప్పగించాలని భావిస్తోంది. 
 
ప్రధాన రైల్వే స్టేషన్ల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల ఫ్లాట్‌ఫాం టిక్కెట్ల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే, ఉద్యోగాల సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది. దీంతో శాశ్వత కార్మికులపై అమితమైన భారంపడనుంది. దీంతో రైల్వే కార్మికులు రైల్వేశాఖ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.