మరో 80 ప్రత్యేక రైళ్లు... 10 నుంచి రిజర్వేషన్లు - తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని?
కరోనా లాక్డౌన్ తర్వాత భారతీయ రైల్వే అంచలంచెలుగా రైళ్లను పట్టాలెక్కిస్తోంది. ఇప్పటికే 230 ప్రత్యేక రైళ్లను దేశ వ్యాప్తంగా నడుపుతోంది. తాజాగా మరో 80 రైళ్లను నడిపేందుకు రైల్వే నిర్ణయించింది.
ఈ రైళ్ళలో ఈ నెల 10 నుంచి రిజర్వేషన్ ప్రక్రియ మొదలు కానున్నట్టు రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. అన్‌లాక్ నేపథ్యంలో వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు పెరగడంతోపాటు అందుబాటులో ఉన్న రైళ్లలో రద్దీ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
అదేసమయంలో వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల కోసం అదేమార్గంలో సమాంతర రైళ్లు (క్లోన్ ట్రైన్స్) నడపనున్నట్టు చెప్పారు. రైళ్లకు డిమాండ్ ఎక్కువై, వెయిటింగ్ లిస్టు ఎక్కువగా ఉన్నప్పుడు అదే మార్గంలో ఆ రైలు వెనకే క్లోన్ ట్రైన్స్‌ను నడుపుతామని పేర్కొన్నారు. దీనివల్ల ప్రయాణికులు ఎటువంటి అసౌకర్యం లేకుండా హాయిగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చన్నారు.
రైల్వే నడపనున్న 80 ప్రత్యేక రైళ్లలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని తెలుగు రాష్ట్రాల్లో కేవలం నాలుగు రైళ్లు మాత్రమే సేవలు అందించనున్నాయి. వీటిలో సికింద్రాబాద్-దర్బంగా (07007), దర్బంగా-సికింద్రాబాద్ (07008), హైదరాబాద్-పర్బానీ(07563), పర్బానీ-హైదరాబాద్ (07564) మాత్రమే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య తిరిగే ఒక్క రైలు ఇందులో లేకపోవడం గమనార్హం.
ఇకపోతే, తమిళనాడుకు మాత్రం ఏకంగా 13 రైళ్లు కేటాయించింది. ఈ రైళ్లన్నీ ఆ రాష్ట్ర పరిధిలోనే తిరుగుతాయి. అయితే, ఇతర రాష్ట్రాల్లో ప్రారంభమయ్యే రైళ్లలో కొన్ని తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించనున్నాయి. అందులో జైపూర్-మైసూరు రైలు ఒకటి. ఇది కాచిగూడ మీదుగా ప్రయాణించనుంది.
గోరఖ్‌పూర్-యశ్వంత్‌పూర్ మధ్య నడిచే రైలు సికింద్రాబాద్ మీదుగా రాకపోకలు సాగించనుంది. బెంగళూరు-గువాహటి-బెంగళూరు, చెన్నై-చాప్రా-చెన్నై, హౌరా-తిరుచురాపల్లి-హౌరా, చెన్నై-న్యూఢిల్లీ-చెన్నై రైళ్లు మాత్రం విజయవాడ మీదుగా తిరగనున్నాయి. ఇక, తూర్పు కోస్తాలో జోన్ పరిధిలోని విశాఖపట్టణం నుంచి చత్తీస్‌గఢ్‌లోని కోర్బా మధ్య రెండు రైళ్లు నడవనున్నాయి.