1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (16:13 IST)

శ్రామిక్ రైళ్లను పునరుద్ధరించాలి.. ధర్మేంద్ర ప్రధాన్ విజ్ఞప్తి

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా అష్ట దిగ్బంధనం అమలైన కాలంలో మే 1 నుంచి శ్రామిక్ రైళ్ళను నడిపారు. వీటి ద్వారా లక్షలాది మంది వలస కూలీలు తమ స్వస్థలాలకు చేరుకున్నారు. ప్రస్తుతం అన్‌లాక్ అమలవుతున్నందువల్ల స్వస్థలాల నుంచి ఉపాధి కోసం మళ్ళి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో శ్రామిక్ రైళ్లను పునరుద్ధరించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. వలస కార్మికులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు తిరిగి వెళ్ళేందుకు శ్రామిక్ రైళ్లను పునరుద్ధరించాలని కోరారు. రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు ఆయన రాసిన లేఖలో ఒడిశా నుంచి వలస కూలీలు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలకు వెళ్ళేందుకు శ్రామిక్ రైళ్ళను పునరుద్ధరించాలని కోరారు.
 
వలస కూలీలకు జీవనోపాధి అత్యవసరమని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మనదేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచవలసిన అవసరం ఉందని తెలిపారు. ఒడిశాలో వలస కూలీలు దయనీయ స్థితిలో ఉన్నట్లు చెప్పారు. వారికి జీవనోపాధి అవసరమని పేర్కొన్నారు. 
 
వలస కూలీలు తమకు ఉపాధి దొరికే ప్రాంతాలకు వెళ్ళడానికి వీలుగా ఒడిశా నుంచి కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు శ్రామిక్ స్పెషల్ రైళ్ళను పునరుద్ధరించాలని, ఈ విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.