బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 6 ఏప్రియల్ 2023 (15:15 IST)

బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఏఐ) అధ్యక్షునిగా బాధ్యతలను స్వీకరించిన ఎస్‌ నరసింహా రెడ్డి

image
2023-24 సంవత్సరానికిగానూ బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(బీఏఐ) అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన, స్వప్న ప్రాజెక్ట్స్‌, హైదరాబాద్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌ నరసింహా రెడ్డి తన బాధ్యతలను చేపట్టారు. ఆయన ఈ బాధ్యతలను బీఏఐ పూర్వ అధ్యక్షులు, ట్రస్టీ శ్రీ ఆర్‌ రాధాకృష్ణన్‌ నుంచి స్వీకరించారు. హైదరాబాద్‌లోని స్వప్న ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దేశవ్యాప్తంగా మేజర్‌, మైనర్‌ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఉండటంతో పాటుగా ప్రస్తుతం 95 మిలియన్‌ డాలర్ల పనులను నిర్వహిస్తోంది. శ్రీ ఎస్‌ నరసింహారెడ్డి ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆసియన్‌ అండ్‌ వెస్ట్రన్‌ పసిఫిక్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఐఎఫ్‌ఏడబ్ల్యుపీసీఏ) బోర్డు సభ్యునిగా కూడా వ్యవహరిస్తున్నారు.
 
బీఏఐ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ నరసింహారెడ్డి మాట్లాడుతూ, నిర్మాణ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే తన తొలి ప్రాధాన్యత అని అన్నారు. తన విజన్‌ స్టేట్‌మెంట్‌లో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వాన్ని తాము కాంట్రాక్టులన్నీ ఎలాంటి అవాంతరాలు లేకుండా  సౌకర్యవంతంగా అమలు చేయడానికి ‘యునిఫైడ్‌ స్టాండర్డ్‌ కాంట్రాక్ట్‌ డాక్యుమెంట్‌’ను తీసుకురావాలని అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు అమలులో ఉన్న కాంట్రాక్ట్‌ చట్టం 1882లో తీసుకువచ్చారని, ఎన్నో వివాదాలు దీని కారణంగా కోర్టుల్లో ఉన్నాయన్నారు. ఈ సంస్కరణల కారణంగా పరిశ్రమలో పారదర్శకత రావడంతో పాటుగా కోరుకుంటున్న సహజవృద్ధి కూడా కనిపించనుందన్నారు.
 
సిమెంట్‌ రెగ్యులేటరీ అథారిటీని సైతం నియమించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఆయన తక్షణమే పెరిగిన సిమెంట్‌ ధరలను నియంత్రించాలని కోరారు. భారీగా పెరిగిన సిమెంట్‌ ధరల కారణంగా రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు, ప్రభుత్వం, ప్రైవేట్‌ కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఎంఆర్‌టీపీ కమిషన్‌, కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ), నేషనల్‌ కంపెనీ లా అప్పీల్లెట్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌ఏటీ) సైతం సిమెంట్‌ కంపెనీలు అనుసరిస్తున్న వ్యాపారవ్యతిరేక విధానాలను గుర్తించాయని, నూతన రెగ్యులేటర్‌ నియామకంతో ఈ తరహా అక్రమాలు నివారించబడతాయని నూతన అధ్యక్షుడు భావిస్తున్నారు.