శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

ఒక్క మిస్డ్ కాల్‌తో కొత్త గ్యాస్ కనెక్షన్

కొత్త గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఏజెన్సీల చుట్టూ రోజుల తరబడిన చెప్పులు అరిగిపోయేలా తిరగాల్సిన పరిస్థితి ఉంది. కానీ, ఇపుడు అలాంటి పరిస్థితికి ఇకపై స్వస్తి పలకనున్నారు. ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీ) ముందుకొచ్చింది. ఈ వార్తను ట్విట్టర్‌ ద్వారా సంస్థ వెల్లడించింది.
 
ఐఓసీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పుడు ఇండేన్‌ గ్యాస్‌ కనెక్షన్‌ పొందాలనుకునే వారు ఐఓసీ ఫోన్‌ నంబర్‌కు మిస్‌ కాల్‌ ఇస్తే సరిపోతుంది. 84549 55555 నంబర్‌కు మిస్‌ కాల్‌ చేస్తే ఐఓసీ వారే తిరిగి మనకు ఫోన్‌ చేసి వివరాలు కనుక్కొని కనెక్షన్‌ మంజూరు చేస్తారు. 
 
ఇందుకు చిరునామా ధ్రువీకరణపత్రం, ఆధార్‌ కార్డును అందజేస్తే సరిపోతుంది. అదేవిధంగా రిఫిల్‌ బుకింగ్‌ కోసం కూడా స్మార్ట్‌ వేను తెలిపింది. ఇదే నంబర్‌కు మిస్డ్ కాల్‌ ఇవ్వడం ద్వారా గ్యాస్‌ బండ బుక్‌ చేసుకునే అవకాశం కల్పించింది.
 
ఇప్పటికే వాట్సాప్‌లో రిజిస్టర్‌ అయిన వినియోగదారులకు రిఫిల్‌ అని టైప్‌ చేసి సెండ్‌ చేయగానే గ్యాన్‌ బుకింగ్‌ చేస్తున్నారు. అదేవిధంగా, తల్లిదండ్రుల నుంచి వేరే కాపురం పెట్టే కుమారులకు ఎలాంటి చిరునామా ధ్రువీకరణపత్రం లేకుండానే గ్యాస్‌ కనెక్షన్‌ ఇవ్వనున్నారు.