15 నుంచి జేఈఈ అడ్మిట్ కార్డులు డౌన్‌లోడింగ్
దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్ఐటీలలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్ష అడ్మిట్‌కార్డులు త్వరలో విడుదల కానున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో వాయిదాపడిన ఈ పరీక్షను సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తెలిపింది.
అయితే, ఈ పరీక్షకు 15 రోజులముందు హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. దీనిప్రకారం ఈ నెల 15న అడ్మిట్ కార్డులను విడుదలచేసే అవకాశం ఉన్నది.
జూలై జరగాల్సిన ఈ ప్రవేశ పరీక్ష సెప్టెంబరు నెలకు వాయిదాపడింది. విద్యార్థలు క్షేమంగా ఉండాలని, వారి ఆరోగ్యం సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో పరీక్షలను వాయిదావేసినట్లు కేంద్ర విద్యాశాఖ, ఎన్‌టీఏ గతంలో ప్రకటించాయి.
అయితే దేశంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండటంతో పరీక్షను వాయిదావేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈనేపథ్యంలో పరీక్ష వాయిదాకు సంబంధించి ఇప్పటివరకు ఎన్‌టీఏగానీ, విద్యాశాఖ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో శనివారం హాల్‌టికెట్లు వెలువడే అవకాశం ఉన్నది.