బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 28 మార్చి 2024 (17:53 IST)

జేఈఈ మెయిన్ 2024 పరీక్షలో స్వల్ప మార్పులు..

jee exam
జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్ 2024 ప్రవేశ పరీక్షలో మళ్లీ స్వల్ప మార్పులు చేశారు. గత నెలలో ఏప్రిల్ 4 నుంచి 15వ తేదీల మధ్య ఈ పరీక్షలు నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. అయితే, గురువారం ఈ పరీక్ష తేదీల్లో మార్పులు చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 4వ తేదీ నుంచి 12వ తేదీ లోపు నిర్వహించనున్నట్టు తెలిపింది. సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల విడుదల సందర్భంగా గురువారం ఇచ్చిన ప్రకటనలో ఈ తేదీలను పొందుపరిచింది. అంతకుముందు షెడ్యూల్‌ విడుదల సమయంలో ఏప్రిల్‌ 1 నుంచి 15 మధ్య జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు జరుగుతాయని పేర్కొన్న ఎన్టీఏ... ఆ తర్వాత ఏప్రిల్‌ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ షెడ్యూల్‌లోనూ మార్పులు చేయడం గమనార్హం.
 
సవరించిన షెడ్యూల్‌ ప్రకారం.. జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 (బీఈ/బీటెక్‌) పరీక్ష ఏప్రిల్‌ 4, 5, 6, 8, 9 తేదీల్లో జరగనుండగా, పేపర్‌ - 2 పరీక్ష ఏప్రిల్‌ 12న నిర్వహించనున్నారు. పేపర్‌-1 పరీక్ష రెండు షిఫ్టుల్లో (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు) జరుగనుంది. అలాగే, పేపర్‌-2 పరీక్ష ఒకే షిఫ్టు (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు) నిర్వహించనున్నారు. 
 
ఇదిలాఉండగా.. అభ్యర్థులకు సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు అందుబాటులోకి వచ్చాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, కోర్సు, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేయడం ద్వారా పరీక్ష కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చు. ఈ స్లిప్పులో పరీక్ష కేంద్రం, నగరం, తేదీ, సమయం, విధివిధానాలు తదితర సమాచారం ఉంటుంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు త్వరలోనే విడుదల చేయనున్నారు.